తల్లీ బైలెల్లినాదో..


Mon,July 16, 2018 11:56 AM

Golkonda Bonalu Celebrations Started In Telangana

-ఎల్లమ్మకు పట్టువస్ర్తాలు సమర్పించిన మంత్రులు
-అమ్మవారికి మొదటి బోనం సమర్పించిన భక్తులు

తెలంగాణ రాష్ట్ర పండుగ.. బోనాల పండుగ ఆదివారం వైభవంగా మొదలయ్యింది. గోల్కొండ కోటలోని అమ్మవారి గుడికి డప్పు చప్పుళ్లతో తొట్టెల ఊరేగింపు కన్నుల పండువగా సాగింది. ఆషాఢ జాతర కోసం వేల మంది భక్తులు అమ్మవారి దర్శనానికి తరలివచ్చారు.
హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: రాష్ట్ర పండుగైన బోనాల జాతర గోల్కొం డ కోటలో అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ఆదివారం ఉదయం లంగర్‌హౌస్‌చౌరస్తా నుంచి బయలుదేరిన తొట్టెల ఊరేగింపులో మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్, పద్మారావు అమ్మవారికి పట్టువస్ర్తాలు, పసుపు, కుంకుమ, గాజులు, ఫల, పుష్పాలను సమర్పించారు. అక్కడ నుంచి ప్రారంభమైన ఊరేగింపు పోతరాజుల వీరంగాలు, శివసత్తుల పూనకాల మధ్య బడాబజార్ మీదుగా మధ్యాహ్నం కోటలోని ఆలయ పూజారి సర్వేశకుమార్‌చారి ఇంటికి చేరింది. అనంతరం గోల్కొండ కోటలోని పటేల్ లక్ష్మమ్మ ఇంటి నుంచి అమ్మవారికి సిద్ధం చేసిన బోనాన్ని తీసుకొచ్చారు. ఆలయ పూజారి ఇంట్లో తెల్లవారుజామనుంచి శుద్ధి, అలంకరణ, పూజా కార్యక్రమాలతో సిద్ధం చేసిన ఉత్సవ విగ్రహాలకు పూజలు నిర్వహించి గోల్కొండ కోటకు తొట్టెల ఊరేగింపు బైలెల్లింది.
Bonam
ఇసుకేస్తే రాలనంత జనసందోహంతో బైలెల్లిన జాతర కోటలోకి ప్రవేశించే సందర్భంలో పోతరాజులు వీరంగాలతో ఊగిపోయారు. జనం కోటకు పోటెత్తడంతో ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా అధికారులు సాధారణ క్యూలైన్లలో కాకుండా పూర్తిగా గేట్లను తెరిచి కోటలోకి అనుమతించారు. గతంలో పలు ఆంక్షలతో బోనాల జాతరకు అనుమతించే అధికారులు ఈ ఏడాది భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అనుమతించారు. కోట ప్రాంగణంలో ఆటపాటలతో సాగిన తొట్టెల ఊరేగింపు సాయంత్రం 6 గంటలకు దర్బార్‌కు సమీపంలోని ఎల్లమ్మ (శ్రీజగదాంబ మహంకాళి) ఆలయానికి చేరుకున్నది. అమ్మవారిని మంత్రులు సమర్పించిన పట్టువస్ర్తాలు, పూలతో అలంకరించి బోనం సమర్పించారు. ఈ బోనం సమర్పించడానికి ముందే నగరం నలుమూలల నుంచి భక్తులు గోల్కొండకు తరలివచ్చి బోనాలు సమర్పించారు. ఉదయం నుంచే మొదలైన బోనాల సమర్పణ కోసం అమ్మవారికి అర్ధరాత్రి 3 గంటలకే శుద్ధి, అలంకరణ చేపట్టి తొలిపూజ నిర్వహించారు.
Naini
కోటలో బోనాల జాతర ముగిసే వరకు నిత్యం 50 మంది కళాకారులతో బోనాల విశిష్టతను తెలిపే ప్రదర్శనలను నిర్వహిస్తామని భాషాసాంస్కృతికశాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ నమస్తే తెలంగాణతో పేర్కొన్నారు. ఊరేగింపులో 500 మంది కళాకారులు పాల్గొన్నారు. ఈ తొట్టెల ఊరేగింపులో డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, ఎంపీ బండారు దత్తాత్రేయ, బీజేపీ శాసనసభాపక్షనేత జీ కిషన్‌రెడ్డి, బీజేపీ నేత బద్దం బాల్‌రెడ్డి, జాయింట్ కలెక్టర్ శ్రీవత్స, ఆర్డీవో చంద్రకళ, దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ బాలాజీ, గోల్కొండ జగదాంబ మహంకాళి ఆలయ కార్యనిర్వాహక అధికారి మహేందర్, ఆలయ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. బోనాల జాతరకు ప్రసిద్ధి గాంచిన లష్కర్ బోనాలకు శ్రీకారం చుడుతూ ఎదుర్కోలు ఘటోత్సవాన్ని ఆదివారం కర్బలా మైదానంలో నల్లపోచమ్మ గుడిలో మంత్రి తలసాని ప్రారంభించారు. అక్కడి నుంచి ఉజ్జయినీ మహంకాళీ ఆలయం వరకు ఘటాలను ఊరేగించారు. ఈ ఘటోత్సవాన్ని సికింద్రాబాద్‌లోని రోజుకో వీధిలో 15 రోజులపాటు నిర్వహిస్తారు. ఈ నెల 29, 30 తేదీల్లో లష్కర్ బోనాల జాతర నిర్వహిస్తారు.

3440
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles