సవాలుగా మారుతున్న పంటల రక్షణ

Mon,November 11, 2019 02:44 AM

-తెగుళ్ళ నుంచి పంటలు రక్షించేందుకు శాస్త్రవేత్తలు కృషిచేయాలి
-19వ అంతర్జాతీయ మొక్కల సంరక్షణ కాంగ్రెస్‌లో ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: మారుతున్న వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పంటలను ఆశిస్తున్న తెగుళ్లు, కీటకాల నుంచి రక్షించడానికి శాస్త్రవేత్తలు నిరంతరం కృషి జరుపాల్సిన అవసరమున్నదని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ డాక్టర్ త్రిలోచన్ మహాపాత్ర సూచించారు. తొలిసారిగా మన దేశంలో అందులో హైదరాబాద్ హెచ్‌ఐసీసీలో నిర్వహిస్తున్న 19వ అంతర్జాతీయ మొక్కల సంరక్షణ సదస్సు (ఐపీపీసీ )ను ఆదివారం ఆయన ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ.. ప్రపంచవ్యాప్తంగా వాతావరణంలో వస్తున్న మార్పులు పంటల రక్షణకు సవాలుగా మారుతున్నాయన్నారు.

ఈ నేపథ్యంలో గ్లోబల్ తెగుళ్ళ కోసం గ్లోబల్ ప్లాన్ అవసరమని పిలుపునిచ్చారు. ఇంటిగ్రేటెడ్ పెస్ట్ మేనేజ్‌మెంట్ విధానం ఇప్పటివరకు దిగుబడి పెంచడానికి ఉపయోగపడిందన్నారు. జీవనియంత్రణ యంత్రాంగాలను మరింత అన్వేషించాల్సిన అవసరమున్నదని చెప్పారు. ఇందుకోసం తెగుళ్ళ నివారణకు నిఘా, పర్యవేక్షణను మెరుగుపరచాలని అభిప్రాయపడ్డారు. ప్రపంచవ్యాప్తంగా తెగుళ్ళు, వ్యాధులు , కలుపు మొక్కల కారణంగా 35-40 శాతం పంట దిగుబడులు నష్టపోతున్నాయని, దీని విలువ దాదాపు 250 బిలియన్ డాలర్ల వరకు ఉంటుందని తెలిపారు. పురుగుమందుల వాడకానికి ఏటా ప్రపంచవ్యాప్తంగా 35 బిలియన్ డాలర్లు ఖర్చవుతున్నాయని చెప్పారు. సాధారణంగా తెగుళ్ల ద్వారా 13.8 శాతం నుంచి 35.8 శాతం వరకు పంట నష్ట జరుగుందని, కొన్ని సందర్భాల్లో నష్టం 100 శాతానికి కూడా చేరుతుందని ఆవేదన వ్యక్తంచేశారు. మొక్కల రక్షణకు సహజ పద్ధతుల్లో పురుగుమందు వాడకాన్ని సమతుల్యం చేయాల్సిన అవసరముందన్నారు.

ఫాల్ ఆర్మీవార్మ్ పురుగు మన దేశంలోకి ప్రవేశించనప్పటి నుంచి 18 రాష్ర్టాలకు విస్తరించిందని తెలిపారు. సదస్సు నిర్వాహక కమిటీ చైర్మన్ డాక్టర్ హరిశర్మ మాట్లాడుతూ.. 70 ఏండ్ల చరిత్రలో మన దేశంలో తొలిసారిగా మొక్కల సంరక్షణ కాంగ్రెస్ జరుగుతుండటం హర్షణీయమన్నారు. అంతర్జాతీయంగా పంటసంరక్షణలో సాధించిన పురోగతి తెలుసుకొనేందుకు ఈ సదస్సు దోహదం చేస్తుందని తెలిపారు. సదస్సులో ఐఏపీపీఎస్ అధ్యక్షుడు డాక్టర్ జియోఫ్ నార్టన్, సెక్రటరీ జనరల్ డాక్టర్ ఈఏ షార్ట్ హెన్రిచ్, ఇక్రిశాట్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ పీటర్ కార్బెర్రీ తదితరులు పాల్గొన్నారు. సదస్సులో 55కు పైగా దేశాల నుంచి 750 మంది కీటక శాస్త్రవేత్తలు, ప్లాంట్ పాథాలజిస్టులు, నెమటాలజిస్టులు, కలుపుశాస్త్ర నిపుణులు హాజరయ్యారు.

అస్కి అభివృద్ధి కార్యక్రమాలు భేష్

-ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర
హైదరాబాద్, నమసత్తే తెలంగాణ: అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (అస్కి) ఆధ్వర్యంలో చేపడుతున్న కార్యనిర్వాహక అభివృద్ధి కార్యక్రమాలు అద్భుతంగా ఉంటున్నాయని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ (ఐసీఏఆర్) డైరెక్టర్ జనరల్ త్రిలోచన్ మహాపాత్ర కితాబిచ్చారు. ఆదివారం హైదరాబాద్‌లోని అస్కిని ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అస్కి రూపొందించిన కార్యక్రమాలు భారతీయ వ్యవసాయ పద్ధతులపై విశ్లేషణ జరిపేందుకు దోహదపడుతున్నాయని పలువురు విదేశీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారని చెప్పారు. ఇలాంటి అభివృద్ధి కార్యక్రమాలు భవిష్యత్‌లో మరిన్ని రూపొందించాలని ఆకాంక్షించారు. ఈ సమావేశంలో అస్కి డైరెక్టర్ జనరల్ శోభనా కే పట్నాయక్, సెంటర్ ఫర్ పావర్టీ అండ్ రూరల్ డెవలప్‌మెంట్ డైరెక్టర్ ప్రొఫెసర్ లక్ష్మి, నేషనల్ అకాడమీ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ సీహెచ్ శ్రీనివాస్‌రావు, జాయింట్ డైరెక్టర్ సోమ్, అస్కి డీన్ వల్లీ మాణిక్కం తదితరులు పాల్గొన్నారు.

508
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles