జల్సాకోసం బ్యాంకు దోపిడీ


Thu,June 20, 2019 02:39 AM

Ghatkaser Andhra Bank Bank robbers caught after three years

-మూడేండ్ల తర్వాత పట్టుబడిన ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ దొంగలు
-నిందితులు బావ, బావమరుదులే
-యూట్యూబ్ వీడియోలతో ప్లాన్
-అర కిలో బంగారం, రెండు కార్లు, బైక్ స్వాధీనం
-తాజాగా బీబీనగర్ ఎస్బీఐకి స్కెచ్
-ఏటీఎం అలర్ట్‌తో పట్టుబడిన వైనం

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: మూడేండ్ల క్రితం జరిగిన ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసు మిస్టరీని రాచకొండ పోలీసులు ఛేదించారు. ఇటీవల బీబీనగర్ స్టేట్ బ్యాంక్‌లో చోరీకి యత్నిస్తూ దొరికిన నిందితుడి విచారణలో ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ వెలుగులోకి వచ్చింది. ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంకులో దోపిడీకి పాల్పడిన ఇద్దరూ స్థానికులు.. అందునా బావ, బావమరిది కావడం విశేషం. ఆంధ్రాబ్యాంక్ నుంచి నాలుగు కిలోల బంగారం ఎత్తుకెళ్లగా.. నిందితుల నుంచి అర కిలో బంగారంతోపాటు రెండు కార్లు, ఒక బైక్ స్వాధీనం చేసుకొన్నారు. ఏ చిన్న క్లూ కూడా వదలకుండా మూడేండ్లపాటు రాచకొండ పోలీసులను ముప్పుతిప్పలు పెట్టిన దొంగలు.. జల్సాలకు డబ్బు సరిపోక మరో బ్యాంకులో దొంగతనానికి పాల్పడి దొరికిపోయారు. రాచకొండ అదనపు పోలీసు కమిషనర్ గొట్టె సుధీర్‌బాబు బుధవారం వెల్లడించిన వివరాల ప్రకారం.. ఈ నెల 7వ తేదీన బీబీనగర్ స్టేట్ బ్యాంక్‌లో దోపిడీ యత్నం జరిగి బ్యాంక్ అధికారులు, పోలీసులకు ఓ వ్యక్తి చిక్కాడు.

అతడిని విచారించగా బోడుప్పల్ గాయత్రిహిల్స్ ప్రాంతానికి చెందిన పెరిక ఎబ్బే అలియాస్ చిన్నాగా తేలింది. చిన్నాను మరింత లోతుగా విచారించగా అతడికి సహకరించిన బావమరిది శివకుమార్ పేరు బయటికు వచ్చింది. అతడిని కూడా అదుపులోకి తీసుకొని విచారించగా బావ, బావమరుదుల విలాసవంతమైన జీవితం వెలుగులోకి వచ్చింది. ఇదే సమయంలో 2016 ఫిబ్రవరిలో ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ దోపిడీ కేసుపై అధికారులు దృష్టిపెట్టారు. అక్కడ దుండుగులు ఉపయోగించిన సామాగ్రి, బ్యాంకులోకి ప్రవేశించే విధానాన్ని.. బీబీనగర్ స్టేట్‌బ్యాంక్ దోపిడీ యత్నంతో సరిచూసుకొన్నారు. రెండు ఘటనలూ ఒకేమాదిరిగా జరిగాయని నిర్ధారించుకొని మరోసారి చిన్నా, శివకుమార్‌ను తమదైనశైలిలో విచారించడంతో ఆ దోపిడీ చేసింది కూడా తామేనని తెలిపారు.
BANK-ROBBERY-ACCUSED
ఆంధ్రాబ్యాంక్ నుంచి ఎత్తుకెళ్లిన నాలుగు కిలోల బంగారాన్ని ఎవరికీ అనుమానం రాకుండా దవాఖాన ఖర్చుల నిమిత్తం అంటూ బంధువుల, సొంత కుటుంబసభ్యులతో తెలంగాణ, ఏపీ, బెంగళూరులోని పలు ప్రాంతాల్లో అమ్మించారు. అలా వచ్చిన దాదాపు రూ.కోటిని విలాసాలకు ఖర్చుచేశారు. ఖరీదైన కార్లు కొన్నారు. పలుచోట్ల ఆస్తుల కొనుగోలులో పార్టనర్‌షిప్ పెట్టారు.

నెలపాటు రెక్కీ

ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్‌ను టార్గెట్ చేసుకున్న దుండుగులు నెలరోజులపాటు రెక్కీ నిర్వహించి బ్యాంకుతోపాటు పరిసరాలపై పట్టు సాధించారు. రెండురోజులు వరుస సెలవులు వచ్చేలా చూసుకొని చిన్నా ఒక్కడే శుక్రవారం రాత్రి బ్యాంక్‌లోకి ప్రవేశించాలని, తిరిగి ఆదివారం చీకటిపడిన తర్వాత బయటికువచ్చి పోలీసులకు చిక్కకుండా పారిపోవాలని ప్లాన్ వేసుకొన్నారు. లాకర్‌తోపాటు ఇతర వైర్లను కట్‌చేసే సమయంలో శబ్దాలు రాకుండా, వెలుతురు బయటకు వెళ్ళకుండా.. అత్యాధునిక సామగ్రిని చైనాతోపాటు వివిధ దేశాల నుంచి అమెజాన్ ద్వారా కొనుగోలు చేశారు. చీకట్లో స్పష్టంగా కనిపించేందుకు నైట్‌విజన్ కండ్లద్దాలను చిన్నా ధరించి.. ఆంధ్రాబ్యాంక్ లాకర్‌ను బ్రేక్‌చేసి నాలుగు కేజీల బంగారాన్ని దోచారు.

అప్పట్లో అంతర్‌రాష్ట్ర ముఠా పనిగా భావించిన రాచకొండ పోలీసులు.. దేశంలోని పలు ప్రాంతాల్లో గాలించి చివరకు పెండింగ్ కేసుగా పెట్టారు. తమ వద్ద ఉన్న నగదు ఖర్చయిపోవడంతో తిరిగి ఈ ఇద్దరికి డబ్బు అవసరం ఏర్పడింది. దాంతో ఘట్‌కేసర్ ఆంధ్రాబ్యాంక్ క్రైమ్‌సీన్‌ను రిపీట్ చేసేలా ప్లాన్‌చేసి దొరికిపోయారు. బ్యాంకులో విద్యుత్ వైర్లు కత్తిరించడంతో బ్యాంకు పక్కనే ఉన్న ఏటీఎంలో చీకట్లు అలుముకోవడంతో బ్యాంక్ అధికారులకు అలర్ట్ వెళ్లింది. అప్రమత్తమై బ్యాంక్‌కు చేరుకొని చూడగా బ్యాంక్‌లోన ఉన్న చిన్నా దొరికిపోయాడు. కాల్ సెంటర్ ఉద్యోగం చేస్తున్న చిన్నాకు వచ్చే జీతం జల్సాలకు సరిపోకపోవడంతో బ్యాంక్ దొంగతనానికి ప్లాన్ వేశాడు. ఇందుకోసం దాదాపు 100 బ్యాంక్ దోపిడీల వీడియోలను వీక్షించినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. మిస్టరీని ఛేదించిన రాచకొండ ఎస్వోటీ బృందం, భువనగిరి డివిజన్ అధికారులను రాచకొండ అదనపు పోలీస్ కమిషనర్ గొట్టె సుధీర్‌బాబు అభినందించారు.

1973
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles