విమాన ఇంజిన్లు మేడిన్ తెలంగాణ


Tue,February 13, 2018 02:51 AM

GE, Tata Group co to deliver LEAP engine

ఇక్కడి నుంచే ప్రపంచానికి ఎగుమతి
ఆదిభట్లలో టాటా, జీఈ జాయింట్ వెంచర్
-ఏరో-ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌కు భూమిపూజ
-మూడు వేల కోట్లకుపైగా పెట్టుబడులు
-ఏరోస్పేస్ రంగానికి మరింత ఊతం
-ఐటీ, పరిశ్రమల మంత్రి కే తారక రామారావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ప్రపంచ స్థాయి ప్రఖ్యాత పరిశ్రమలకు వేదిక అవుతున్న తెలంగాణ.. అతి త్వరలో మరో ఘనతను సాధించనుంది. మేడిన్ తెలంగాణ ముద్రతో విమాన ఇంజిన్లు ఇక్కడి నుంచి వివిధ ప్రపంచ దేశాలకు ఎగుమతి కానున్నాయి. ఇందుకు ఉద్దేశించిన ఏరో-ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను దేశీయ పారిశ్రామిక దిగ్గజం టాటా గ్రూప్, అంతర్జాతీయ దిగ్గజం జనరల్ ఎలక్ట్రిక్ (జీఈ) సంయుక్తంగా ఏర్పాటు చేయనున్నాయి. ఆదిభట్లలో ఏర్పాటు చేయబోయే ఏరో- ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ కేంద్రం భూమి పూజ కార్యక్రమం సోమవారం హెచ్‌ఐసీసీలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు చేతుల మీదుగా జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కేంద్రం ఏర్పాటు తెలంగాణ ఏరోస్పేస్ రంగానికి మరింత ఊతం ఇస్తుందని అన్నారు. పెట్టుబడులు పెట్టేందుకు తెలంగాణను ఎంపిక చేసుకోవటం పట్ల టాటా, జీఈ (జనరల్ ఎలక్ట్రిక్) కంపెనీలకు కృతజ్ఞతలు తెలిపారు. రెండు దిగ్గజ సంస్థలు జాయింట్ వెంచర్ ఏర్పాటుచేయడం గొప్ప విషయమన్నారు. ఇక్కడ నెలకొన్న ఎకో సిస్టం, నైపుణ్యం కలిగిన విద్యార్థులు ప్రపంచస్థాయి సంస్థలను ఆకర్షించడంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్నాయని మంత్రి చెప్పారు. రెండు స్ట్రాంగ్ ఎయిరోస్పేస్ పార్కులు, ఐదు ఎయిర్ స్ట్రిప్స్‌కు అదనంగా మరో తయారీ కేంద్రం హైదరాబాద్‌లో ఉండటం ఇక్కడి విమానయాన రంగం అభివృద్ధికి దోహదం చేస్తుందని అన్నారు. ఒప్పందం చేసుకున్న స్వల్ప వ్యవధిలోనే కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేసుకోవడం ఆనందంగా ఉందని చెప్పారు.
tata
ఈ ఏడాది డిసెంబర్ చివరి నాటికి తెలంగాణ నుంచి తొలి విమాన ఇంజిన్ తయారవుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. అంతకుముందు జీఈ-సౌత్‌ఏసియా అధ్యక్షుడు విశాల్‌వాంచూ మాట్లాడుతూ.. హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టడంలో మంత్రి కేటీఆర్ పాత్ర ప్రశంసనీయమన్నారు. కేటీఆర్ చొరువవల్లే తక్కువ సమయం లో కేంద్రం ఏర్పాటుకు భూమి పూజ చేసుకున్నామని చెప్పారు. భారత ఏవియేషన్ రంగానికి మంచి భవిష్యత్ ఉందని, 2025 నాటికి మూడో స్థానానికి చేరుతుందని చెప్పారు. టాటాసన్స్, ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్ అధ్యక్షుడు బన్‌మలి ఆగ్రావాలా మాట్లాడుతూ భారత్‌లో ఏవియేషన్ రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలున్నాయని అన్నారు. తాజా పెట్టుబడుల ద్వారా అత్యంత నైపుణ్యం కలిగిన ఉద్యోగాలను సృష్టించడంతోపాటు అత్యున్నత సరఫరా చైన్ వృద్ధి కానుందని చెప్పారు. తద్వారా అంతర్జాతీయం గా పోటీతత్వం కలిగిన ఉత్పాదక పర్యావరణ వ్యవస్థ దేశంలో అభివృద్ధి అవుతుందన్నారు. కార్యక్రమంలో రవాణాశాఖమంత్రి మహేందర్‌రెడ్డి, టాటా, జీఈ గ్రూపుల ప్రతినిధులు పాల్గొన్నారు.

ఫలించిన మంత్రి కేటీఆర్ కృషి


తెలంగాణలో పెట్టుబడుల వెల్లువ కొనసాగుతున్న వేళ.. ఏరోస్పేస్ విభాగంలో అంతర్జాతీయంగా పేరు న్న జీఈ సంస్థ నగరంలో తమ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నది. ఇందులో మంత్రి కేటీఆర్ కీలకపాత్ర పోషించారు. ఏడాదిపాటు శ్రమించారు. అమెరికా, ఢిల్లీలో జీఈ సంస్థ చైర్మన్ జాన్ ఎల్ ఫ్లానరీతో కలిసి చర్చించారు. తెలంగాణలో పెట్టుబడులకున్న అనుకూలవాతావరణం గురించి చెప్పి మెప్పించారు. రాష్ట్ర ప్రభుత్వం అమలుచేస్తున్న అత్యుత్తమ విధానాల గురించి, ముఖ్యంగా టీఎస్ ఐపాస్, పెట్టుబడుల వల్ల కలిగే ప్రయోజనాల గురించి వివరించారు. టాటా సంస్థ దిగ్గజం రతన్‌టాటాకు ఈ కేంద్రం ఏర్పాటు ఆవశ్యకతను గురించి కేటీఆర్ వివరించారు. దాంతో ఇరు సంస్థలు హైదరాబాద్‌లో కేంద్రం ఏర్పాటుకు గత డిసెంబర్‌లో ఒప్పందం కుదుర్చుకున్నాయి.

లీప్ ఇంజిన్లకు మంచి డిమాండ్


ఏరోస్పేస్ హబ్‌గా దూసుకుపోతున్న హైదరాబాద్‌కు ఏరో-ఇంజిన్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటువల్ల మరింత పేరు రానుంది. ఈ కేంద్రంలో సీఎఫ్‌ఎం ఇంటర్నేషనల్‌కు చెందిన లీప్ ఇంజిన్ విడిభాగాలను తయారుచేస్తారు. సీఎఫ్‌ఎంను జీఈ, శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్స్ భాగస్వామ్యంతో ఏర్పాటు చేశారు. విమానాల తయారీలో లీప్ ఇంజిన్లకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. నూతనటెక్నాలజీ, ఇంధన సామర్థ్యం ఇతర అంశాల దృష్ట్యా ఇవి నంబర్ వన్ స్థానంలో ఉంటున్నాయి. ఎయిర్‌బస్, బోయింగ్ అండ్ కొమా క్ విమానాల్లో ఈ ఇంజిన్లనే వినియోగిస్తారు. ప్రస్తు తం మనదేశ వాయుసేన ఉపయోగించే యుద్ధ విమానాల్లో దాదాపుగా జీఈ సంస్థ ఇంజిన్లే ఉంటాయి. కమర్షియల్ ఏవియేషన్ చరిత్రలో అత్యంత వేగంగా అమ్ముడుపోయే ఇంజిన్లుగా వీటికి పేరుంది. తెలంగాణలో ఉత్పత్తిచేసే ఈ ఇంజిన్ల విడిభాగాలు సీఎంఎఫ్ ఇంటర్నేషనల్‌కు ఎగుమతి అవుతాయి.

2815
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles