స్వాతంత్య్ర సమరయోధుడు ఎర్రబోతు రాంరెడ్డి ఇకలేరు


Sun,November 11, 2018 01:40 AM

Freedom fighter ramreddy passedway

నల్లగొండ రూరల్: నల్లగొండ మండలం అప్పాజిపేట గ్రామానికి చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు, తెలంగాణ సాయుధ పోరాట యోధుడు ఎర్రబోతు రాంరెడ్డి (85) అనారోగ్యంతో శనివారం హైదరాబాద్‌లోని కిమ్స్‌లో కన్నుమూశారు. రాంరెడ్డి భౌతికకాయాన్ని ఆయన స్వగ్రామానికి తరలించగా.. స్వాతంత్య్ర సమరయోధులు వేమవరపు మనోహర్ పంతులు, కల్వకుంట్ల లక్ష్మయ్య, టీఎస్ ఎఫ్‌డీసీ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్ జిల్లా నాయకులు కంచర్ల కృష్ణారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సహా పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన అంత్యక్రియల్లో ప్రజలు, బంధువులు, ప్రముఖులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

1933లో జన్మించిన రాంరెడ్డి..


నల్లగొండ మండలం అప్పాజీపేటకు చెందిన ఎర్రబోతు బుచ్చిరెడ్డి, సత్తమ్మ దంపతులకు ఐదుగురు సంతానం. మొదటివాడైన రాంరెడ్డి 1933 అక్టోబర్ 10న జన్మించారు. రాంరెడ్డికి భార్య సక్కుబాయమ్మ, ముగ్గురు కుమారులు, ఓ కూతురు ఉన్నారు. పెద్ద కుమారుడు భాస్కర్‌రెడ్డి ఢిల్లీలో ఐఏఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రెండో కుమారుడు రవీందర్‌రెడ్డి మధ్యప్రదేశ్‌లో రాష్ట స్థాయి ఫారెస్ట్ ఆఫీసర్‌గా పనిచేస్తున్నారు. మూడో కుమారుడు మహేందర్‌రెడ్డి హైదరాబాద్‌లో వ్యాపార రంగంలో స్థిరపడ్డారు.

ఉరికొయ్యకు చేరువై..


రాంరెడ్డి తెలంగాణ సాయుధ పోరాటంలో ప్రముఖంగా పాల్గొన్నారు. భారత స్వాతంత్య్రానంతరం నల్లగొండలోని ఫెడరేషన్ హాస్టల్‌లో చదువుతున్న సమయంలో మీజాన్ అనే ఉద్యమ సాహిత్య పత్రికకు ఆకర్షితుడయ్యారు. 16 సంవత్సరాల వయసులోనే రజాకార్ల ఇన్‌ఫార్మర్లను మట్టుబెట్టిన ఘటనలో రాంరెడ్డి అరెస్టయ్యారు. దీంతో కోర్టు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఓ అమెరికన్ జర్నలిస్ట్ రాంరెడ్డిని ఇంటర్వ్యూ చేయగా నాటి టైమ్ మాగజైన్‌లో ప్రచురితమైంది. బాలుడికి ఉరిశిక్ష అనేది ఆ కథనం సారాంశం. అప్పట్లో చెక్‌రిపబ్లిక్ రాజధాని ప్రేగ్ నగరంలో జరిగిన యువజనోత్సవ సభల్లో ప్రదర్శించగా 10వేల మంది యువత భారీ ర్యాలీ నిర్వహించారు. దీంతో ఓ ఇద్దరు సీనియర్ న్యాయవాదులు నల్లగొండ జైల్లో రాంరెడ్డిని కలిసి, కౌంటర్ దాఖలు చేసి కేసు నుంచి ఆయనకు విముక్తి కల్పించారు. ఏడేండ్ల సాధారణ జైలు శిక్ష అనంతరం విడుదలైన రాంరెడ్డి ఆ తర్వాత మూడు దశాబ్దాలుగా అప్పాజీపేట సర్పంచ్‌గా సేవలందించారు. తెలంగాణోద్యమంలోనూ గ్రామస్థాయిలో తన వాణి విన్పించారు.


806
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles