బడుగువర్గాల పక్షపాతి కృష్ణన్ కన్నుమూత

Mon,November 11, 2019 02:08 AM

-సంతాపం తెలిపిన సీఎం కేసీఆర్
-తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంతాపం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అణగారిన వర్గాల అభ్యున్నతికోసం కృషిచేసిన రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ (86) కన్నుమూశారు. కొంతకాలంగా ఢిల్లీలోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతున్న కృష్ణన్ ఆదివారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కృష్ణన్ మృతి పట్ల ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర సంతాపం తెలియజేశారు. 1956 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన కృష్ణన్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అణగారిన వర్గాల పక్షపాతిగా పనిచేశారు. పలు సంక్షేమ కార్యక్రమాల రూపకల్పనలో ముఖ్యభూమిక వహించారు. వీపీ సింగ్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మండల్ కమిషన్ సిఫార్సుల రూపకల్పనలో పీఎస్ కృష్ణన్ కృషి మరువలేనిది. ఉమ్మడి రాష్ట్రంలో ముస్లిం రిజర్వేషన్ల రూపకల్పనలోనూ కృష్ణన్ ప్రముఖ పాత్రపోషించారు.

సీఎం కేసీఆర్ సంతాపం

రిటైర్డ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ మృతి పట్ల సీఎం కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. సామాజిక సంక్షేమ విధానాల రూపకల్పనలో కృష్ణన్ ఎనలేని కృషిచేశా రని సీఎం కొనియాడారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఏపీ సీఎం జగన్ సంతాపం

పీఎస్ కృష్ణన్ మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. ఆయన కుటుంబ సభ్యులకు సానుభూతి తెలియజేశారు. 1956 బ్యాచ్ ఐఏఎస్ అధికారి పీఎస్ కృష్ణన్ మృతి పట్ల తెలంగాణ ఐఏఎస్ అధికారుల సంఘం అధ్యక్షుడు, ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్ జనరల్ బీపీ ఆచార్య సంతాపం తెలియజేశారు. రాష్ట్రంలో బడుగు, బలహీన, అణగారిన వర్గాల ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమరంగంలో అనేక పాలసీలు తీసుకువచ్చారన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

194
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles