రాబందులు కావాలా..? రైతుబంధు కావాలా?


Thu,September 13, 2018 01:52 AM

Former Speaker Suresh Reddy Speech After Joining In TRS Party

-ఎవరి ప్రభుత్వం కావాలో తేల్చుకునే సమయమిది
-ఒకరు బషీర్‌బాగ్‌లో కాల్చారు.. మరొకరు ముదిగొండలో చంపారు
-ఇద్దరు గడ్డం నాయకులు చంద్రబాబు, ఉత్తమ్ ఒక్కటయ్యారు
-కాంగ్రెస్ వ్యతిరేక టీడీపీ.. కాంగ్రెస్‌కు తోక పార్టీగా మారింది
-తెలంగాణభవన్‌లో జరిగిన సమావేశంలో నిప్పులు చెరిగిన మంత్రి కేటీఆర్
-టీఆర్‌ఎస్‌లో చేరిన మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి, నేరెళ్ల ఆంజనేయులు, బండారి లక్ష్మారెడ్డి తదితరులు
-ప్రగతిభవన్‌లో గులాబీ కండువాలు కప్పిన సీఎం కే చంద్రశేఖర్‌రావు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అరవై ఏండ్ల రాబందుల పాలన కావాలో.. రైతులను ఆదుకుంటూ వారి మనసులు గెలుచుకున్న రైతుబంధు ప్రభుత్వం కావాలో ప్రజలు తేల్చుకోవాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు పిలుపునిచ్చారు. బషీర్‌బాగ్, ముదిగొండలో రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర ప్రతిపక్షాలదయితే.. రైతులకు రైతుబంధు పథకం అమలుచేసిన ఘనత టీఆర్‌ఎస్‌దన్నారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం, ఆత్మాభిమానాలను అమరావతి, ఢిల్లీలో తాకట్టుపెట్టకుండా, మీ గురించి మీ గల్లీల్లోనే ఆలోచించేవారినే ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. కాం గ్రెస్ నేత, మాజీ స్పీకర్ కేఆర్ సురేశ్‌రెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గ నేత, మాజీమంత్రి నేరెళ్ల ఆంజనేయులు, కరీంనగర్ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బిరుదు రాజమల్లు, సత్యనారాయణగౌడ్, కరీంనగర్ జిలాకు చెందిన ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉప్పల్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి బండారి లక్ష్మారెడ్డి, జీహెచ్‌ఎంసీ కార్పొరేటర్ శాంతి సహా నిజామాబాద్, కరీంనగర్ జిల్లాలు, హైదరాబాద్ నగరానికి చెందిన పలువురు నాయకులు బుధవారం టీఆర్‌ఎస్‌లో చేరారు. పార్టీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు ప్రగతిభవన్‌లో వారికి గులాబీకండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
KTR-AT
ఈ సందర్భంగా తెలంగాణభవన్‌లో ఏర్పాటుచేసినసభలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ, నాడు తెలంగాణకు అడ్డంపడ్డ రెండు గడ్డాలు ఇప్పుడు ఏకమవుతున్నాయని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు, టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ను బొందబెట్టేందుకు ఎన్టీఆర్ స్థాపించిన టీడీపీని.. కాంగ్రెస్‌కు తోక పార్టీగా మార్చారని ఎద్దేవాచేశారు. విద్యుత్ కోతలతో సతాయించి, అర్ధరాత్రి కరంటుతో రైతులు చనిపోయేందుకు కారణమైన పార్టీలు ఒకవైపు, 24 గంటలూ ఉచితంగా విద్యుత్ ఇస్తున్న టీఆర్‌ఎస్ మరోవైపు ఉన్నాయని చెప్పారు. 65 ఏండ్ల పాలనలో సరైన తాగునీరు ఇవ్వకుండా నల్లగొండ జిల్లాలో రెండు లక్షలమంది ప్రజలను ఫ్లోరైడ్ బారినపడేసిన కాంగ్రెస్, టీడీపీ ఒకవైపు ఉంటే.. కేవలం నాలుగేండ్లలో ఇంటింటికీ సురక్షిత మంచినీరు అందిస్తున్న టీఆర్‌ఎస్ మరోవైపు ఉన్నదన్నారు. విద్యుత్ షాక్‌లతో నాడు రైతుల చావులకు కారణమైన కాంగ్రెస్, టీడీపీలు ఒకవైపు ఉంటే.. రైతులకు 24గంటలపాటు ఉచితంగా విద్యుత్ అందిస్తున్న దేశంలోనే ఏకైక రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్ మరోవైపు ఉన్నారని చెప్పారు. రైతులను రాబందుల్లా పీక్కుతిన్న పార్టీలు కావాలా? రైతుబంధు పథకాలతో రైతన్నల మనసు గెలుచుకున్న టీఆర్‌ఎస్ కావాలా ప్రజలు తేల్చుకునే సమయం వచ్చిందని చెప్తూ.. ఈ రోజు తెలంగాణ ప్రజలకు స్పష్టమైన ప్రత్యామ్నాయం ఉందని అన్నారు.

రెండు పార్టీలకు కలిపి గుణపాఠం చెప్పాలి

కాంగ్రెస్, టీడీపీ కలువడం తనకు సంతోషంగా ఉందన్న కేటీఆర్.. వీరి కలయికతో జుగుప్సాకర రాజకీయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. ఆ పార్టీలు వేర్వేరుగా వస్తే ప్రజలు వారికి బుద్ధిచెప్పటానికి కష్టపడాల్సివచ్చేదని, కానీ ఒక్కటిగా రావడంతో బంగారంలాంటి అవకాశం దొరికిందని, ఇద్దరినీ కలిపి వాయగొట్టే అవకాశం వచ్చిందని చెప్పారు. కాంగ్రెస్ నాయకులు బయటకు ఎన్నికలకు సిద్ధమని ప్రకటిస్తూ, ఎన్నికల సంఘం సమావేశంలో మాత్రం ఎన్నికలకు తొందరేముందంటూ అడ్డుకుంటున్నారని కేటీఆర్ మండిపడ్డారు. తెలంగాణ ఉద్యమం సమయం నుంచి టీఆర్‌ఎస్‌కు నిజామాబాద్ జిల్లా అండగా ఉన్నదన్న కేటీఆర్.. జిల్లాలో మొత్తంగా గెలుస్తామని విశ్వాసం వ్యక్తంచేశారు.
KTR-AT2

సురేశ్‌రెడ్డి చేరిక మంచి పరిణామం: కే కేశవరావు

అనుభవం, ప్రజలతో అనుబంధం ఉన్న సురేశ్‌రెడ్డి లాంటివారు టీఆర్‌ఎస్‌లో చేరడం మంచి పరిణామమని టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు అన్నారు. ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ మాట్లాడుతూ టీఆర్‌ఎస్ పోరాట పటిమను సురేశ్‌రెడ్డి స్పీకర్‌గా ఉన్న రోజుల్లో అభినందించారని గుర్తుచేశారు. వ్యవసాయమంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ సురేశ్‌రెడ్డి సుదీర్ఘ అనుభవం ఉన్న, హుందాతనం కలిగిన నేత అన్నారు. నిజామాబాద్ ఎంపీ కవిత మాట్లాడుతూ తెలంగాణ భవిష్యత్‌కు కలిసికట్టుగా పనిచేద్దామని పిలుపునిచ్చారు.

తెలంగాణ అభివృద్ధిని నిలువరించే కుట్రలు: సురేశ్‌రెడ్డి

తెలంగాణ అభివృద్ధిని నిలువరించేందుకు కుట్రలు జరుగుతున్నాయని మాజీ స్పీకర్ సురేశ్‌రెడ్డి ఆందోళన వ్యక్తంచేశారు. దీనిలో భాగంగానే సిద్ధాంతాలు మరిచి పొత్తులు పెట్టుకుంటున్నారని కాంగ్రెస్, టీడీపీలనుద్దేశించి విమర్శించారు. రాష్ట్రంలో అభివృద్ధి ఆగొద్దనే.. మూడుతరాలు, వంద ఏండ్ల అనుబంధాన్ని తెంచుకుని టీఆర్‌ఎస్‌లో చేరుతున్నానని చెప్పారు. గతంలో గోదావరి జలాల వినియోగం, పసుపు రైతులపై రూపొందించిన నివేదికల్లోని అంశాలను టీఆర్‌ఎస్ మ్యానిఫెస్టోలో చేర్చాల్సిందిగా కోరుతూ.. వాటిని కేకే, కేటీఆర్‌కు అందజేశారు. కార్యక్రమంలో ఎంపీ మల్లారెడ్డి, తాజా మాజీ ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్‌రెడ్డి, ఏ జీవన్‌రెడ్డి, షకీల్, బాజిరెడ్డి గోవర్ధన్, ఏనుగు రవీందర్‌రెడ్డి, గంప గోవర్ధన్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్‌రావు, ఉప్పల్ టీఆర్‌ఎస్ అభ్యర్థి బేతి సుభాష్‌రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. తొలుత.. కొండగట్టు బస్సు ప్రమాదంలో మరణించినవారికి సంతాపసూచకంగా కొద్దిసేపు మౌనం పాటించారు.

టీఆర్‌ఎస్‌లో చేరింది వీరే..

సురేశ్‌రెడ్డితోపాటు ఆర్మూర్, బాల్కొండ నియోజకవర్గాల నుంచి ఆయన అనుచరులు, కాంగ్రెస్ కార్యకర్తలు దాదాపు ఐదువేల మంది తెలంగాణభవన్‌కు వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి నియోజకవర్గానికి చెందిన మాజీ మంత్రి నేరెళ్ల ఆంజనేయులుతోపాటు పీ సాయికుమార్, ఇబ్రహీం గోరి, గడ్డం రవీందర్, అశోక్, గోపాలకాంతం, ఉదయ్‌కుమార్, మాకల నర్సారెడ్డి, అనుగు మోహన్‌రెడ్డి, వందలమంది బీజేపీ, కాంగ్రెస్, టీడీపీ కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కోడూరు సత్యనారాయణగౌడ్‌తోపాటు ఆ పార్టీకి చెందిన మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ ఆకారపు భాస్కర్‌రెడ్డి, రిటైర్డ్ ఆర్డీవో బైరం పద్మయ్యతోపాటు దాదాపు 600 మంది వరకు టీఆర్‌ఎస్‌లో చేరారు.
KTR-AT1

4515
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles