చరిత్రను వెలికితీయాలి

Sun,October 13, 2019 01:56 AM

-చరిత్రకెక్కని సమరం
-పుస్తకావిష్కరణలో ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్‌కుమార్

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: దేశంలో తొలి స్వాతంత్య్ర పోరాటాల కంటే ముందే తెలంగాణ నుంచి బ్రిటిష్‌వారిని తరిమికొట్టే ఎన్నో పోరాటాలు జరిగాయని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్ పేర్కొన్నారు. కట్టా శ్రీనివాస్‌రావు రచించిన, బీసీ కమిషన్ సభ్యుడు జూలూరు గౌరీశంకర్ సంపాదకత్వంలో వెలువడిన చరిత్రకెక్కని సమరం (తలవంచని నాగులవంచ) అనే పుస్తకాన్ని వినోద్‌కుమార్ శనివారం హైదరాబాద్‌లోని తన క్యాంప్ కార్యాలయంలో ఆవిష్కరించి మాట్లాడారు. ఖమ్మంజిల్లా నాగులవంచలో 1687అక్టోబర్‌లో వ్యాపారస్థావరాన్ని ఏర్పాటుచేసిన డచ్ వ్యాపారస్థులను ప్రజలు వీరోచిత పోరాటంతో తరిమికొట్టారన్నారు.

విదేశీశక్తుల ఆధిపత్యాన్ని వ్యతిరేకిస్తూ వలసవాద దోపిడీకి ఎదురునిలిచి పోరాడిన చరిత్ర తెలంగాణకు ఉన్నదని తెలిపారు. ఎన్నో కీలక స్వాతంత్య్ర సమర ఘట్టాలు తెలంగాణలో చోటుచేసుకున్నా దురదృష్టవశాత్తు ఆ వీరపోరాటాలు చరిత్రకెక్కలేదని ఆవేదన వ్యక్తంచేశారు. నాగులవంచ ప్రజల వీరపోరాటాన్ని పుస్తకరూపంలో వెలికితెచ్చినవారిని వినోద్‌కుమార్ అభినందించారు. బీసీ కమిషన్ సభ్యుడు గౌరీశంకర్ మాట్లాడుతూ తొలి స్వాతంత్య్ర పోరు ఘట్టాల్లో సగర్వంగా లిఖించదగ్గ పోరుఘట్టం నాగులవంచలో జరిగిందన్నారు.కార్యక్రమంలో బీసీ కమిషన్ సభ్యులు ఆంజనేయగౌడ్, రామానంద తీర్థ సంస్థల డైరెక్టర్ నారాకిశోర్‌రెడ్డి పాల్గొన్నారు.

200
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles