మాజీ ఎమ్మెల్యే మణెమ్మ కన్నుమూత


Mon,September 10, 2018 01:51 AM

Former MP Manemma passes away

-కొంతకాలంగా అనారోగ్యం చికిత్స పొందుతూ దవాఖానలో మృతి
-ముఖ్యమంత్రి కేసీఆర్ సంతాపం
-నేడు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు
-రెండుసార్లు ఎంపీగా.. రెండుసార్లు ఎమ్మెల్యేగా సేవలందించిన మాజీ సీఎం అంజయ్య సతీమణి

బంజారాహిల్స్/ముషీరాబాద్, నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి టంగుటూరి అంజయ్య సతీమణి, సీనియర్ కాంగ్రెస్ నాయకురాలు టీ మణెమ్మ (76) కన్నుమూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె జూబ్లీహిల్స్‌లోని అపోలో దవాఖానలో చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం 11.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. మణెమ్మ మృతికి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం వ్యక్తంచేశారు. ఆమె అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని అధికారులను ఆదేశించారు. 1942 ఏప్రిల్ 29న హైదరాబాద్‌లో జన్మించిన మణెమ్మ వివాహం 1960లో నాటి కాంగ్రెస్ నేత టంగుటూరి అంజయ్యతో జరిగింది. వీరికి కుమారుడు శ్రీనివాస్‌రెడ్డి, కుమార్తెలు విజయలక్ష్మి, పుష్పలత, శోభ, గీత ఉన్నారు. 1986లో భర్త అంజయ్య మరణంతో రాజకీయాల్లోకి వచ్చిన మణెమ్మ సికింద్రాబాద్ లోక్‌సభ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో గెలుపొందారు. 1989 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ నిరాకరించడంతో.. జనతాదళ్ అభ్యర్థిగా పోటీచేసి రెండోసారి ఎంపీగా ఎన్నికయ్యారు. ఆ తరువాత క్రియాశీల రాజకీయాలకు దూరంగా ఉన్న ఆమె 2004 నుంచి మళ్లీ చురుకుగా పాల్గొన్నారు. ముషీరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి 2008లో జరిగిన ఉప ఎన్నికలతోపాటు, 2009 సాధారణ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలుపొందారు. మణెమ్మ పార్థివదేహాన్ని బంజారాహిల్స్ రోడ్ నం 12 ఎమ్మెల్యేకాలనీలోని ఆమె స్వగృహానికి తరలించారు. టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, అపోలో హాస్పిటల్స్ ఎండీ సంగీతారెడ్డి తదితరులు నివాళులర్పించారు. మణెమ్మ పార్థివదేహానికి సోమవారం జూబ్లీహిల్స్‌లోని మహాప్రస్ధానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నట్టు కుటుంబసభ్యులు తెలిపారు.
MANEMMA1

4072
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS