విపక్షాల డిమాండ్ అహేతుకమైనది


Tue,April 16, 2019 01:24 AM

Former CEO TS Krishnamurthy comment on the 50 per cent polling count

-ఈవీఎంలలో ఎవరూ ఎలాంటి లోపాల్ని గుర్తించలేకపోయారు
-50 శాతం వీవీప్యాట్ల లెక్కింపుపై మాజీ సీఈసీ టీఎస్ కృష్ణమూర్తి వ్యాఖ్య
హైదరాబాద్, ఏప్రిల్ 15: లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలన్న విపక్షాల డిమాండ్ అహేతుకమైనదని మాజీ ప్రధాన ఎన్నికల అధికారి(సీఈసీ) టీఎస్ కృష్ణమూర్తి తప్పుపట్టారు. వీవీప్యాట్లు లేకున్నప్పటికీ ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు (ఈవీఎంలు) విశ్వసనీయమైనవేనని స్పష్టం చేశారు. ఇది తాను చెప్పడం లేదని, సాంకేతిక నిపుణులే దీనిని నిర్ధారించారని చెప్పారు. ఇప్పటివరకు ఈవీఎంలలో ఎవరూ ఎలాంటి లోపాలనూ గుర్తించలేకపోయారని గుర్తు చేశారు. అయితే యంత్రాలలో మానవ తప్పిదాలు జరిగే అవకాశం ఉందని సోమవారం పీటీఐ వార్తాసంస్థతో పేర్కొన్నారు. 2004 లోక్‌సభ ఎన్నికలు కృష్ణమూర్తి పర్యవేక్షణలోనే జరిగాయి. వీవీప్యాట్లకు సంబంధించినంత వరకు, విపక్షాలు ఎన్నికల్లో ఓడిపోతే గనుక 50 శాతం కూడా సరిపోదు.. వంద శాతం లెక్కించాలని కోరుతాయి. ఆ తర్వాత వీవీప్యాట్లు సరిగా లేవు అంటాయి. ఇది ముగింపు లేని ఆట. దురదృష్టకరమైన విష యం. చట్ట నిబంధనలను గౌరవించడం విపక్షాలు నేర్చుకోవాలి అని కృష్ణమూర్తి వ్యాఖ్యానించారు. తిరిగి పేపర్ బ్యాలెట్ పద్ధతివైపు మళ్లాలనే డిమాండ్ సరికాదని, ఈ విధానం గతంలో అత్యంత దుర్వినియోగం అయిందని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో హింస, ద్వేషం, దౌర్జన్యం చెలరేగే భారత్ లాంటి దేశంలో బ్యాలెట్ విధానాన్ని తిరిగి అనుసరించడం వల్ల ఎలాంటి విపరిణామాలు ఎదురవుతాయో రాజకీయ పార్టీలు గుర్తెరగడం లేదని విచారం వ్యక్తం చేశారు. ఈ లోక్‌సభ ఎన్నికల్లో కనీసం 50 శాతం వీవీప్యాట్లను లెక్కించాలని డిమాండ్ చేస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కాంగ్రెస్, టీడీపీ, ఆప్, ఎస్పీ, సీపీఐ, సీపీఎం తదితర ప్రతిపక్ష పార్టీలు ఆదివారం ఢిల్లీలో నిర్వహించిన సంయుక్త సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే.

722
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles