పలుకరించని తొలకరి


Wed,June 19, 2019 02:38 AM

Focused on the cultivation of short term crops

-వర్షాల కోసం తప్పని ఎదురుచూపులు
-సీజన్ ప్రారంభమై రెండువారాలైనా కరుణించని వరుణుడు
-వానకాలం పంటల సాగుపై వాతావరణ ప్రభావం
-పడిపోయిన రాయితీ విత్తనాలు, ఎరువుల అమ్మకాలు
-స్వల్పకాలిక పంటల సాగుపై దృష్టి!

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వానకాలం సీజన్ ప్రారంభమై రెండు వారాలైనా వరుణుడు కరుణించడం లేదు. వర్షాలు ఎప్పుడు కురుస్తాయా అని రైతులకు ఎదురుచూపులు తప్పడం లేదు. ఇది వానకాలం పంటల సాగుపై ప్రభావం చూపుతుందని ఆం దోళన వ్యక్తంచేస్తున్నారు. జూన్ మూడోవారం వచ్చినప్పటికీ ఎండల తీవ్రత ఏ మాత్రం తగ్గ డం లేదు. జూన్ మొదటి పక్షంలో రాష్ట్రంలో 27 సెంటీమీటర్ల వర్షపాతం కురియాల్సి ఉన్నా.. 24.3 సెంటీమీటర్లు మాత్రమే నమోదైంది. వానకాలం సీజన్ కోసం వ్యవసాయశాఖ 7.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను రాయితీపై విక్రయించేందుకు జిల్లాలకు పంపింది. అందుకు సరిపడా ఎరువులను కూడా సిద్ధం చేసింది. వర్షాభావ పరిస్థితుల నేపథ్యంలో ఈ విత్తనాలు, ఎరువుల విక్రయాలు బాగా పడిపోయాయి.

గతేడాదితో పోలిస్తే రాయితీ విత్తన విక్రయాలు 42 శాతం తగ్గినట్టు వ్యవసాయశాఖ తాజాగా విడుదల చేసిన నివేదిక లో వెల్లడించింది. ఇక ఎరువులైతే అడిగేవారే లేరు. ఒకవైపు వర్షాలు లేకపోవడం, మరోవైపు అధిక ఎండలతో విత్తనాలు వేసినా మొలకెత్తే అవకాశాలు లేవని రైతులు ముందుకు రావడం లేదు. సాధారణంగా జూన్ మొదటివారంలో తొలకరి వర్షాలు కురిస్తే తెలంగాణలో పత్తి, సోయాతోపాటు మొక్కజొన్న, పప్పు ధాన్యాలు విత్తుతారు. మూడు నుంచి నాలుగు నెలల పంటకాలం ఉన్న సన్నరకం వరి వంగ డం సాంబమసూరి నార్లు ఇప్పటికే పోయాలి. కానీ, ఆలస్యం కావడంతో నార్లు పోయవద్దని వ్యవసాయాధికారులు చెప్తున్నారు. ఈ సీజన్‌కోసం 2.80 లక్షల క్వింటాళ్ల వరి విత్తనాలను రాయితీపై విక్రయానికి ఉంచితే.. 13,914 క్వింటాళ్లు మాత్రమే రైతులు కొనుగోలు చేసినట్టు సమాచారం. గతేడాది ఇదే సమయానికి 70,704 క్వింటాళ్లు అమ్ముడయ్యాయి.

స్వల్పకాలిక పంటలకు ప్రణాళిక

వర్షాభావ పరిస్థితులు ఇలానే కొనసాగితే స్వల్పకాలిక పంటలపై దృష్టి సారించాలని, ఈ మేరకు ప్రణాళిక సిద్ధం చేయాలని కేంద్ర వ్యవసాయశాఖ తాజాగా అన్ని రాష్ట్రాలనూ ఆదేశించింది. రాష్ట్ర వ్యవసాయశాఖ, జాతీయ మెట్ట పంటల పరిశోధనా కేంద్రం(క్రిడా), ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం కలిసి ఈ ప్రణాళిక తయారీకి కసరత్తు ప్రారంభించాయి. తక్కువకాలంలో పండే కాటన్‌దొర సన్నాలు, కూనారం సన్నాలు వంటి విత్తనాలను జిల్లాల్లో అందుబాటులో ఉంచాలని వ్యవసాయశాఖ యోచిస్తున్నది. మరికొన్ని రోజులు వర్షాభావం ఇలాగే కొనసాగితే ప్రభుత్వం ఇప్పటికే సబ్సిడీపై పంపిణీ చేసి న విత్తనాలను పక్కకు పెట్టి.. స్వల్పకాలంలో పంటనిచ్చే విత్తనాలను జిల్లాలకు పంపేందుకు వ్యవసాయశాఖ ఏర్పాట్లు చేస్తున్నది.

3260
Follow us on : Facebook | Twitter
Tags

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles