సుగంధద్రవ్యాల సాగుపై దృష్టి

Fri,November 8, 2019 02:51 AM

-రైతుల ఆదాయం పెంపు లక్ష్యంగా అవగాహన
-కొరత ఉన్న సుగంధ పంటల సాగుకు ప్రణాళికలు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్రవ్యాప్తంగా లక్ష టన్నులకు పైగా సుగంధద్రవ్యాల కొరత తీర్చేందుకు ఉద్యానశాఖ కసరత్తు మొదలుపెట్టింది. మసాలా దినుసులను సాగుచేసేలా రైతులకు అవగాహన కల్పిస్తున్నది. ఇప్పటివరకు ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతి చేసుకొంటున్న పరిస్థితికి చెక్ పెట్టనున్నది. రాష్ట్రంలో వినియోగంలో ఉన్న ఏడు ప్రధాన సుగంధద్రవ్యాల్లో పసుపు, మిరప పంటలు మిగులు ఉత్పత్తిలో ఉండగా.. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చింతపండు వంటి పంటల ఉత్పత్తిలో 1.05 లక్షల మెట్రిక్ టన్నులు వెనుకబడి ఉన్నదని ఉద్యానశాఖ తెలిపింది. ప్రస్తుతం తెలంగాణలో 3.44 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 8.07 లక్షల మెట్రిక్ టన్నుల మసాలా దినుసులు పండిస్తున్నారు. పసుపుసాగు విస్తీర్ణం, ఉత్పత్తిలో మన రాష్ట్రం దేశంలోనే ప్రథమస్థానంలో ఉన్నది. వాము పంట ఒక్కటే 3,300 ఎకరాల విస్తీర్ణంలో సాగుచేస్తుండగా 1,980 మెట్రిక్ టన్నుల పంట ఉత్పత్తి అవుతున్నది. సంగారెడ్డి, వికారాబాద్, ఆదిలాబాద్ జిల్లాల్లో వాము ఎక్కువగా సాగవుతున్నది.

సగటున 21 గ్రాముల తలసరి వినియోగం

వినియోగ సరళి ప్రకారం సంవత్సరానికి మొత్తం రాష్ట్ర జనాభాకు అవసరమైన సుగంధద్రవ్యాలు 2.31 లక్షల టన్నులు. రాష్ట్రంలో వినియోగిస్తున్న 15 రకాల సుగంధద్రవ్యాల్లో అల్లం 23 శాతం వాటాతో మొదటిస్థానంలో ఉన్నది. చింతపండు 22.23 శాతం, మిరప 15.48 శాతం, వెల్లుల్లి 13.38 శాతం, పసుపు 8.03 శాతం, కొత్తిమీర 6.33 శాతం, జీలకర్ర 4.86 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ప్రధాన సుగంధద్రవ్యాలైన ధనియాలు, జీలకర్ర లోటు 22,480 మెట్రిక్ టన్నులుగా ఉన్నదని ఉద్యానశాఖ వెల్లడించింది. ఆహార వినియోగ సరళిపై వ్యవసాయ విశ్వవిద్యాలయం, నార్మ్ సంయుక్తంగా నిర్వహించిన సర్వే ప్రకారం రాష్ట్రంలో 15 రకాల సుగంధద్రవ్యాలు వినియోగిస్తున్నారు.

వీటి లో పసుపు, మిరప, అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, చింతపండు ఎక్కువగా వినియోగిస్తున్నారు. రాష్ట్రంలో మొత్తం సుగంధ ద్రవ్యాల తలసరి వినియోగం రోజుకు 21 గ్రాములు ఉండగా.. నెలకు 0.64 కిలోలు, ఏడాదికి 7.68 కిలోలు ఉన్నట్టు ఆ సర్వే తెలిపింది. రాష్ట్రంలో ఉద్యాన పంటలు 12.37 లక్షల ఎకరాల్లో సాగవుతుండగా.. ఏటా 56.81 లక్షల టన్నుల ఉత్పత్తి జరుగుతున్నది. ఉద్యాన పంటల ఉత్పత్తిలో స్వయంసమృద్ధి సాధించడానికి, ఇతర రాష్ర్టాల నుంచి దిగుమతులు తగ్గించడానికి వ్యవసాయ, ఉద్యాన పంట కాలనీలను ఏర్పాటుచేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే రైతులకు మెరుగైన రాబడి కోసం ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తున్నది.

1151
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles