భద్రతా వలయంలోకి బీఆర్కే భవన్!


Fri,July 12, 2019 02:15 AM

Focus on fire safety at BRKR Bhavan

- అవసరమైనచోట్ల బారికేడ్ల ఏర్పాటు
- సెక్యూరిటీ ఏర్పాట్లపై పోలీసుల అధ్యయనం.. రెండురోజుల్లో నివేదిక
- ఎమ్మెల్యే క్వార్టర్స్‌లో పార్కింగ్‌కు చర్యలు
- డోయిజర్ ఫైళ్ల భద్రతకు ప్రత్యేక గది


హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బూర్గుల రామకృష్ణారావు భవన్, దాని పరిసరాలు హైసెక్యూరిటీ జోన్‌లోకి వెళ్లనున్నాయి. ముఖ్యమంత్రి, మంత్రులు, ప్రధానకార్యదర్శితోపాటు, వివిధశాఖల కార్యదర్శులు ఇక్కడ కొలువుదీరనుండటంతో.. భద్రతాఏర్పాట్లపై పోలీస్ ఉన్నతాధికారులు అధ్యయనం చేస్తున్నారు. భవనం ముందున్న మూడురోడ్లను మూసివేసి.. ట్రాఫిక్‌ను మళ్లించనున్నారు. వీవీఐపీల రక్షణ, పార్కింగ్ స్థలం ఏర్పాటు తదితర అంశాలపై నివేదిక సమర్పించాలన్న ప్రభుత్వం సూచన మేరకు పోలీస్ అధికారులు ఒకట్రెండురోజుల్లో పూర్తి నివేదికను అందజేయనున్నారు. సమీకృత కొత్త సచివాలయ నిర్మాణం నేపథ్యంలో ప్రస్తుతం సచివాలయంలో ఉన్న శాఖల్లో ప్రధానమైన వాటిని బీఆర్కేభవన్‌కు తరలించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. బీఆర్కేభవన్‌లో ఉన్న కార్యాలయాలన్నింటినీ తరలించగానే సచివాలయంలోని శాఖల తరలింపు మొదలవుతుంది. పోలీసుశాఖకు చెందిన వివిధ బృందాలు ఇప్పటికే పలుసార్లు బీఆర్కే భవన్, దాని పరిసర ప్రాంతాలను సందర్శించాయి. ఈ సందర్భంగా భవనం పరిసరప్రాంతాల్లో వివిధరకాల ఆంక్షలను ప్రభుత్వానికి ప్రతిపాదించనున్నారు. అటు జీహెచ్‌ఎంసీ గేట్ దగ్గర, ఇటు రిట్జ్ హోటల్ కింద కళాంజలి సమీపంలో, మధ్యలో ఎమ్మెల్యే క్వార్టర్స్ పక్కనేఉన్న రోడ్డులోని హోప్ దవాఖాన వద్ద బారికేడ్లు ఏర్పాటు చేయనున్నారు. తెలుగుతల్లి ైఫ్లెఓవర్ కింద బీఆర్కేభవన్ వైపు వెళ్లే జంక్షన్‌లో కూడా బారికేడ్లు ఏర్పాటుచేసి వాహన రాకపోకలను నిలువరించనున్నారు.

పార్కింగ్ ప్రధాన సమస్య..

సచివాలయంలోని శాఖలను బూర్గుల రామకృష్ణారావుభవన్‌కు తరలితే వాహనాల పార్కింగ్ ప్రధానసమస్యగా మారనున్నది. బీఆర్కే భవన్‌లో కొన్ని, దానిముందు రోడ్డుపై మరికొన్ని వాహనాలు పార్క్‌చేసే వెసులుబాటు ఉన్నది. వీటితోపాటు పక్కనేఉన్న ఎమ్మెల్యే క్వార్టర్స్‌లోని ఖాళీస్థలాన్ని సైతం పార్కింగ్ కోసం ఉపయోగించుకునే విధంగా ట్రాఫిక్ పోలీసులు ప్రభుత్వానికి సూచనలు చేయనున్నారు. భవనం చుట్టుపక్కల ఎలాంటి పరిస్థితులు నెలకొని ఉన్నాయి. దానిచుట్టూ ఎలాంటి రక్షణ వలయం ఏర్పాటు చేయాలి? వీవీఐపీలకు ఏవిధమైన భద్రతా ఏర్పాట్లు చేయాలి? లాంటి సున్నిత అంశాలను కూడా పోలీసుశాఖ తన నివేదికలో పేర్కొననున్నది.

డోయిజర్ ఫైళ్లకోసం ప్రత్యేక గది

సచివాలయంలోని వివిధ విభాగాల ఫైళ్లు, ఇతర సరంజామా ప్యాకింగ్ ప్రక్రియ ముమ్మరంగా సాగుతున్నది. ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్‌ఎస్ అధికారుల సంపూర్ణ సమాచారం నిక్షిప్తమై ఉండే కీలక డోయిజర్ ఫైళ్లను జాగ్రత్తగా తరలించి, భద్రపరిచేందుకు కొత్త ప్రాంగణంలో ప్రత్యేక గదిని ఏర్పాటుచేయనున్నారు. ప్రసు ్తతం ఈ ఫైళ్లను ప్రభుత్వ ప్రధానకార్యదర్శి నియంత్రణలో, సీ బ్లాక్, 6 వ అంతస్తులోని ఓ ప్రత్యేక గదిలో భద్రపరిచారు. బూర్గుల రామకృష్ణారావు భవనంలో ప్రస్తుతం ఉన్న కార్యాలయాలను ఖాళీచేసే ప్రక్రియ చివరిదశకు చేరుకున్నది. అయితే, 4వ అంతస్తులో ఉన్న డాటాసెంటర్‌ను అక్కడే ఉండే అవకాశాలు ఉన్నాయి. జీవోల జారీ, వివిధ ప్రభుత్వశాఖల ముఖ్యమైన అప్లికేషన్ల వినియోగం, రోజువారీ పరిపాలనకు అసౌకర్యం కలగకుండా ఆ డాటా సెంటర్‌ను సచివాలయ అవసరాల కోసం వాడుకోనున్నారు.

623
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles