పారిశ్రామిక విప్లవం

Wed,December 4, 2019 02:52 AM

-టీఎస్ ఐపాస్ నేటితో ఐదేళ్లు
-ఐదేండ్లలో 11,609 పరిశ్రమలు
-రూ.1.73 లక్షల కోట్ల పెట్టుబడులు
-13 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు
-ఏటేటా పెరుగుతున్న పరిశ్రమలు
-సీఎం కేసీఆర్‌కు జేజేలు పలుకుతున్న పారిశ్రామికవేత్తలు
-నేటితో టీఎస్‌ఐపాస్‌కు ఐదేళ్లు

మీకు ప్రత్యేకరాష్ర్టాన్నిస్తే పాలించుకోవడం రాదు. హైదరాబాద్‌లోని పరిశ్రమలన్నీ తరలిపోతాయి. ఒక్క కొత్త కంపెనీ కూడా రాదు. ఉన్న ఉద్యోగాలు పోతాయి. కొత్త ఉద్యోగాలు రావు.. ఇలా ఎన్ని బెదిరింపులు.. ఎన్ని అనుమానాలు.. ఎన్నెన్ని అవమానాలు.. అపోహలు కల్పించి.. ఇలా భయాలు సృష్టించి తెలంగాణకు తుదకంటా మోకాలడ్డిన వాళ్లు ఇప్పుడు గుడ్లు తేలేస్తున్నారు. రాష్ట్రం ఏర్పడిన ఐదేండ్లలో అనూహ్యంగా కనిపిస్తున్న మార్పును చూసి విస్మయం చెందుతున్నారు. రాష్ట్రం ఏర్పడినప్పుడు ఎద్దేవా చేసిన వాళ్లందరూ ఆశ్చర్యపడేలా జరిగిన పారిశ్రామిక అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో అమల్లోకి తెచ్చిన పారిశ్రామిక విధానమే కారణం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు మదిలో పురుడుపోసుకున్న ఆలోచనే.. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక ప్రాజెక్టుల ఆమోదం.. స్వీయ ధ్రువీకరణ వ్యవస్థ (తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ప్రాజెక్ట్ అప్రూవల్ అండ్ సెల్ఫ్ సర్టిఫికేషన్ సిస్టం - టీఎస్‌ఐపాస్). ఈ చట్టం బూజుపట్టిన పాత విధానాలన్నింటికీ స్వస్తిపలికింది. కేవలం ఐదేండ్లలో 11వేలకు పైగా పరిశ్రమలు అనుమతులుపొందాయి. దాదాపు 13 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. 1.73 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు సమకూరాయి. ఐదేండ్లలో టీఎస్‌ఐపాస్ సాధించిన విజయమిది.

నెలకుర్తి శ్రీనివాస్ రెడ్డి, నమస్తే తెలంగాణ ప్రతినిధి : తెలంగాణ ప్రజల ప్రధాన ఆకాంక్షలైన నీళ్లు.. నిధులు.. నియామకాల్లో మూడో ఆకాంక్ష నెరవేరాలంటే.. ఉన్న పరిశ్రమలు విస్తరించాలి. కొత్త పరిశ్రమలు పుష్కలంగా రావాలి. తద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడాలి. ఆదాయం పెరిగి రాష్ట్రం ఆర్థికంగా పరిపుష్టమవుతుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని సీఎం కేసీఆర్.. ఐదేండ్ల క్రితం ఇదేరోజున టీఎస్‌ఐపాస్‌కు శ్రీకారంచుట్టారు. ఈ చట్టం కాగితాల్లోంచి రాలేదు. పారిశ్రామికవేత్తలు, పారిశ్రామిక సంఘాలు, నిపుణుల సలహాలు, ఆలోచనల మేరకు తీసుకొచ్చిన చట్టమిది. సాధారణ జీవోలు, సర్కులర్ల రూపం లో కాకుండా ఏకంగా చట్టమేచేశారు. 2014 డిసెంబర్ 4న టీఎస్‌ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చింది. పరిశ్రమలశాఖ మంత్రిగా కే తారకరామారావు ఈ చట్టాన్ని పక్కాగా అమలుచేశారు. మొదట్లో 13 శాఖల పరిధిలో 17 అనుమతులు ఇచ్చేవారు. తర్వాత చట్టాన్ని మరింత విస్తృతంచేసి 27 శాఖలను, 35 సర్వీసులను అందుబాటులోకి తేవడంతో రాష్ట్రంలో పారిశ్రామికీకరణ మరింత సౌకర్యవంతంగా మారింది. టీఎస్‌ఐపాస్ అమల్లోకి వచ్చిన తర్వాత ఐదేండ్లలో అన్ని జిల్లాల్లో కలిపి మొత్తం 11,609 పరిశ్రమలకు అనుమతులు లభించాయి. వీటిద్వారా రాష్ర్టానికి రూ.1.73లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 13.02 లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించాయి. అనుమతులు లభించిన పరిశ్రమల్లో 8,964 పరిశ్రమలు ప్రారంభంకాగా మరో 769 పరిశ్రమలు ప్రారంభానికి సిద్ధమయ్యాయి.

ఇప్పటికే ఉపాధి పొందిన వారి సంఖ్య 6.22లక్షలు కాగా అతి త్వరలో మరో 2.87లక్షల మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి. పరిశ్రమల స్థాపనకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే విధానాన్ని తీసుకొచ్చారు. టీఎస్‌ఐపాస్ ప్రారంభించిన 2014 నుంచి 2019 డిసెంబర్ 2 వరకు ఏటేటా రాష్ట్రంలో పరిశ్రమలు స్థాపించే వారి సంఖ్య పెరుగుతూనే వస్తుంది. 2014లో డిసెంబర్ 4న చట్టం అమల్లోకి వచ్చాక ఆ ఆర్థిక సంవత్సరంలో 175 పరిశ్రమలురాగా ఆ తర్వాత వరుస సంవత్సరాల్లో 1538, 1781, 3002, 3017 పరిశ్రమలు వచ్చాయి. 2019-20 డిసెంబర్ 2 నాటికే 2,096 పరిశ్రమలు అనుమతి తీసుకున్నాయి. జిల్లాలవారీగా పరిశ్రమలను పరిశీలిస్తే అత్యధిక పరిశ్రమలు వచ్చిన జిల్లాగా మేడ్చల్ నిలిచింది. ఇక్కడికి 2,950 పరిశ్రమలు వచ్చాయి. 2014 నుంచి ఐదేండ్లలో వరుసగా రూ.1806.66 కోట్లు, రూ.28994.60 కోట్లు, రూ. 34942.94 కోట్లు, రూ.58201.12 కోట్లు, రూ. 35,667.12 కోట్లు, రూ.14,015.17 కోట్ల మేర పెట్టుబడులు వచ్చాయి. 2014 నుంచి గత ఐదేండ్లలో సంవత్సరాలవారీగా 5,076, 94,480, 1,12,298, 2,80,766, 6,08,923, 2,01,118 ఉపాధి అవకాశాలు లభించాయి.
TS-iPASS1

అధ్యయనం చేసిన ఇతర రాష్ర్టాలు

టీఎస్‌ఐపాస్ విధానం దేశమంతటినీ ఆకర్షించింది. కేంద్రంతోసహా దాదాపు అన్ని రాష్ర్టాలు అధ్యయనంచేశాయి. తమ రాష్ర్టాల్లో పేరు మార్చి అమలుచేయడం ప్రారంభించాయి. జాతీయస్థాయిలోనూ ఈ తరహా విధానాన్ని తేవాలని కేంద్రం ఆలోచిస్తున్నట్టు సమాచారం. ఈ పారిశ్రామిక విధానానికి ఉన్న ప్రత్యేకతల వల్ల సులభవాణిజ్య విధానం (ఈవోడీబీ)లో తెలంగాణ తొలిర్యాంక్ సాధించగలిగింది. టీఎస్‌ఐపాస్‌ను ప్రధాని మోదీ, ఐటీసీ చైర్మన్ దేవేశ్వర్ సహా పలువురు ప్రముఖులు ప్రశంసించారు. తమకు అతి తక్కువ సమయంలో అనుమతులొచ్చాయని మైక్రోమాక్స్ ఎండీ రాజేశ్ అగర్వాల్ హర్షం వ్యక్తంచేశారు.

నేడు శిల్పకళావేదికలో కార్యక్రమం

టీఎస్‌ఐపాస్ చట్టం రూపుదాల్చి ఐదేండ్లయిన సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని రాష్ట్రప్రభుత్వం నిర్ణయించింది. బుధవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్ మాదాపూర్ శిల్పకళావేదికలో జరిగే ప్రధాన కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు హాజరుకానున్నారు. ఇందులో హోంమంత్రి మహమూద్ అలీ, విద్యుత్‌శాఖ మంత్రి జీ జగదీశ్‌రెడ్డి, అటవీశాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి పాల్గొంటారు. టీఎస్‌ఐపాస్‌ను విజయవంతంగా అమలుచేస్తున్న వారిని ఎంపికచేసి సన్మానిస్తారు. ఉత్తమప్రతిభ కనబర్చిన జిల్లాలు, శాఖల అధికారులను సత్కరిస్తారు. టీఎస్‌ఐపాస్ ద్వారా అనుమతిపొందిన వారందరినీ ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు.
TS-iPASS2

వినూత్నమైన పాలసీ

టీఎస్‌ఐపాస్ వినూత్న పాలసీ. అనేక శాఖల అనుమతులను ఈ విధానంలోకి తీసుకొచ్చాం. అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. పారిశ్రామికవేత్తల అభిప్రాయాలు తీసుకొని ఇంకా ముందుకువెళ్తాం.
- నదీమ్ అహ్మద్, పరిశ్రమల శాఖ కమిషనర్

సులువుగా అనుమతులు

టీఎస్‌ఐపాస్ ద్వారా మా కంపెనీకి చాలా సులువుగా అనుమతులు లభించాయి. దరఖాస్తు చేసుకున్నాక.. పెద్దగా ఫాలోఅప్ చేయకుండానే అనుమతులన్నీ ఇచ్చారు. ఈ విధానం చాలా బాగుంది.
- రాజేశ్ కోస్లా, ప్రెసిడెంట్ సీఈవో, పీపీడీ, గార్డెన్ పాలిమర్స్, హెచ్‌ఎస్‌ఐఎల్

పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధానమైన పాత్ర

టీఎస్‌ఐపాస్ పెట్టుబడులను ఆకర్షించడంలో ప్రధానమైన పాత్ర పోషిస్తున్నది. ఈ పాలసీతో వేల పరిశ్రమలు రాష్ర్టానికి వచ్చాయి.
- రాజు, సీఐఐ, తెలంగాణశాఖ అధ్యక్షుడు

కొత్తవారికి ఉపయుక్తం

టీఎస్‌ఐపాస్ చట్టం నోబుల్ యాక్ట్. కొత్తగా పరిశ్రమ పెడుతున్న వారికి ఇది ఎంతో అద్బుతంగా ఉంటుంది. అతితక్కువ సమయంలో అనుమతులు వస్తునాయి.
- కే భాస్కర్‌రెడ్డి , ఎఫ్‌టీసీసీఐ ఉపాధ్యక్షుడు

విప్లవాత్మకమైన మార్పు

టీఎస్‌ఐపాస్ విప్లవాత్మకమైన మార్పు. సీఎం కేసీఆర్ నిర్ణయంతో పారిశ్రామికవేత్తలకు నిర్ణీత కాలవ్యవధిలో అనుమతులు రావడమనేది ఒక్క హక్కుగా మారింది.
- కే సుధీర్‌రెడ్డి, టీఐఎఫ్ అధ్యక్షుడు

1830
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles