దేశంలోనే అతిపెద్ద మేకర్స్‌స్పేస్


Wed,September 12, 2018 01:48 AM

FirstBuild sets up base in Hyderabad

-హైదరాబాద్‌లో ప్రారంభించనున్న ఫస్ట్‌బిల్డ్
-జీఈ అప్లయెన్సెస్, టీవర్క్స్ మధ్య ఒప్పందం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రాష్ట్ర ప్రభుత్వంతో మరో ప్రతిష్ఠాత్మక సంస్థ ఒప్పందం కుదుర్చుకున్నది. ఐటీశాఖ పరిధిలోని టీవర్క్స్‌కు, జీఈ అప్లయెన్సెస్‌కు చెందిన ఫస్ట్‌బిల్డ్ సంస్థ మధ్య కుదిరిన ఒప్పందంలో భాగంగా దేశంలోనే అతిపెద్ద మేకర్స్ స్పేస్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించనున్నారు. దీంతో రాష్ట్రంలోని ఆవిష్కర్తలు, ఉత్పత్తిదారులు తమ ఆలోచనలకు రూపమిచ్చే అవకాశం లభిస్తుంది. ఇందుకు సంబంధించిన అవగాహనాపత్రాలపై మంత్రులు కేటీఆర్, జూపల్లి కృష్ణారావు సమక్షంలో టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి, జీఈ అప్లయెన్సెస్ సీవోవో మెలానీ కుక్ సంతకాలు చేశారు. వేలాది మంది ఆవిష్కర్తలతో ప్రపంచవ్యాప్తంగా తన ఆవిష్కరణల పర్వాన్ని కొనసాగిస్తున్న ఫస్ట్‌బిల్డ్.. ఈ ఒప్పం దం ద్వారా మనదేశంలోని డిజైనర్లు, ఇంజినీర్లు, ఇన్నోవేటర్ల ఆవిష్కరణలను వెలుగులోకి తెచ్చి గృహసముదాయాలకు తగిన ఉత్పత్తులను అందుబాటులోకి తేనున్నది.

ప్రస్తుతం ఈ సంస్థ అమెరికాలోని లూయిస్‌విల్లే, కెంటకీతోపాటు చైనా వాణిజ్య రాజధాని షాంఘైలో తన కేంద్రాలను నడుపుతున్నది. జీఈ అప్లయెన్సెస్ సీవోవో మెలానీ కుక్ మాట్లాడు తూ.. హైదరాబాద్‌లో ప్రారంభించనున్న మేకర్స్‌స్పేస్ ఆధునిక జీవనశైలికి బీజంవేసే ప్రపంచశ్రేణి ఉత్పత్తులకు కేంద్రం గా నిలుస్తుందని, భారత్‌లో తమ ప్రయాణానికి టీవర్క్స్‌ను సరైన జోడీగా భావించామని తెలిపారు. టీవర్క్స్ సీఈవో సుజయ్ కారంపూరి మాట్లాడుతూ.. మేకిన్ ఇండియాలో భారత్‌ను మరింత ముందుకు తీసుకెళ్లేందుకు నూతన ఆవిష్కరణలు తప్పనిసరని చెప్పారు. కార్యక్రమంలో ఐటీశాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌రంజన్, జీఈ అప్లయెన్సెస్ ఇండియా సీఐవో చంద్రమౌళి తదితరులు పాల్గొన్నారు.

2559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS