ఐసీయూలో అగ్ని

Tue,October 22, 2019 03:33 AM

- ఎల్బీనగర్‌ షైన్‌ పిల్లల దవాఖానలో దారుణం
- నిలువునా కాలిపోయిన పసికందు
- నలుగురు శిశువులకు తీవ్రగాయాలు
- ఇంక్యుబేటర్‌కు షార్ట్‌సర్క్యూట్‌
- ఐసీయూలో కమ్ముకున్న పొగలు
- ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌
- దర్యాప్తునకు మంత్రి ఈటల ఆదేశం
- దవాఖానను సీజ్‌చేసిన అధికారులు
- పోలీసుల అదుపులో నిర్వాహకుడు?

ఒక్క నిర్లక్ష్యం.. నూరేండ్ల భవిష్యత్తు ఉన్న నాలుగు నెలల చిన్నారిని చిదిమేసింది! అమ్మ కడుపులాంటి ఇంక్యుబేటర్‌లో వెచ్చగా నిదురిస్తున్న ఆ పసికందుపాలిట ఆ ఇంక్యుబేటర్‌ మృత్యుపాశమైంది. ఇంక్యుబేటర్‌కు షార్ట్‌సర్క్యూట్‌తో రాజుకున్న మంటలు.. ఆ శిశువును నిలువునా కాల్చేశాయి. మరో నలుగురు చిన్నారులను చావుబతుకుల్లోకి నెట్టాయి! దాదాపు 42 మంది చిన్నారులు చికిత్స పొందుతున్న ఓ దవాఖానలో సోమవారం తెల్లవారుజామున చోటుచేసుకున్న అగ్నిప్రమాదం.. తల్లిదండ్రుల గుండె లు జలదరింపజేసింది. వారం వ్యవధిలో అదే ఐసీయూలోని ఇంక్యుబేటర్‌ రెండుసార్లు షార్ట్‌సర్క్యూట్‌కు గురైనా.. పట్టించుకోని సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యం.. నిండుప్రాణాన్ని బలితీసుకున్నది. ఐసీయూలో పిల్లల్ని ఉంచి.. బయట వేచిఉన్న తల్లిదండ్రులు ఈ ఘటనతో తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. తామే చొరవచేసి.. పొగలుకమ్మేసిన ఐసీయూలోకి వెళ్లి.. పిల్లలను వెలుపలికి తీసుకొచ్చారు.

హైదరాబాద్‌ సిటీబ్యూరో/ ఎల్బీనగర్‌, నమస్తే తెలంగాణ/ హస్తినాపురం: చిన్నారికి ప్రాణం బాగోలేదని దవాఖానలో చేర్చితే.. ఆ దవాఖాన సిబ్బంది, యాజమాన్యం నిర్లక్ష్యం ఆ చిన్నారిని మృత్యుముఖంలోకి నెట్టింది. ఎల్బీనగర్‌ నుంచి నాగోల్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై నాలుగు అంతస్థుల భవనంలో సునీల్‌కుమార్‌ అనే వైద్యుడు నిర్వహిస్తున్న షైన్‌ పిల్లల దవాఖానలో సోమవారం తెల్లవారుజామున సంభవించిన అగ్నిప్రమాదంలో ఒక చిన్నారి మృత్యువాతపడగా, మరో నలుగురు చిన్నారులు తీవ్రంగా గాయపడ్డారు. ఐసీయూ నుంచి పొగలు వస్తున్న విషయాన్ని గుర్తించిన తల్లిదండ్రులు.. తామే స్వయంగా ఐసీయూలోకి వెళ్లి.. చిన్నారులను బయటకు తీసుకువచ్చారు. వారిని వివిధ దవాఖానలకు తరలించగా.. అందులో ఒక చిన్నారి అప్పటికే చనిపోయినట్టు వైద్యులు ధ్రువీకరించారు. ఈ దవాఖానలో మూడో అంతస్థులో ఐసీయూ నిర్వహిస్తున్నారు. ఈ ఐసీయూలో ఉన్న ఇంక్యుబేటర్లలో ఆదివారం రాత్రి ఐదుగురు చిన్నారులు చికిత్స పొందుతున్నారు. సోమవారం తెల్లవారుజామున 2:50 గంటల ప్రాంతంలో సూర్యాపేట జిల్లా పెన్‌పహాడ్‌ మండలం దూర్‌పాడ్‌ గ్రామానికి చెందిన పోలీస్‌ కానిస్టేబుల్‌ నరేశ్‌, మానస దంపతుల నాలుగు నెలల కుమారుడు చికిత్స పొందుతున్న ఇంక్యుబేటర్‌ వద్ద షార్ట్‌సర్క్యూట్‌ సంభవించి మంటలు చెలరేగాయి. వెంటనే పొగలు రావడంతో బయట ఉన్న తల్లిదండ్రులకు అనుమానం వచ్చి పెద్దగా అరిచారు.

దవాఖాన సిబ్బంది తేరుకొనేలోపే మంటలు సమీపంలో ఉన్న మంచాలకు అంటుకున్నాయి. తల్లిదండ్రులే ఐసీయూలోకి వెళ్లి పిల్లలను బయటకు తీసుకొచ్చారు. అప్పటికే ఐసీయూలో మంటలు వ్యాపించాయి. పిల్లల తల్లిదండ్రులు మంటలను ఆర్పుతూనే పోలీసులకు సమాచారం అందించారు. తీవ్రంగా గాయపడిన నాలుగు నెలల చిన్నారిని చింతల్‌కుంటలోని రెయిన్‌బో దవాఖానకు తరలించగా.. అప్పటికే ఆ చిన్నారి మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. మరో నలుగురు చిన్నారులను దీక్ష, అంకుర్‌, లోటస్‌, రెయిన్‌బో, మలక్‌పేటలోని సేఫ్‌ దవాఖానలకు తరలించారు. ప్రమాద సమయంలో దవాఖానలో మొత్తం 42 చిన్నారులు చికిత్స పొందుతున్నారు. తల్లిదండ్రులు అద్దాలను పగులగొట్టి పిల్లలను బయటకు తీసుకొచ్చే ప్రయత్నంచేశారు. ఎల్బీనగర్‌ పోలీస్‌స్టేషన్‌కు సమీపంలో ప్రమాదం చోటుచేసుకోవడంతో అప్రమత్తమైన పోలీసులు తమ వంతు సహకారం అందించారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఎనిమిది నిమిషాల వ్యవధిలోనే ఘటనాస్థలానికి చేరుకొని సహాయ చర్యలు చేపట్టారు. ప్రమాద సమయంలో ఇద్దరు నర్సులు, ఇద్దరు ఆయాలు మాత్రమే విధుల్లో ఉన్నారని, డ్యూటీ డాక్టర్‌ పరారయ్యాడని ప్రత్యక్ష సాక్షులు ఆరోపిస్తున్నారు.

రెండు గంటలు ఉద్రిక్తం

దవాఖానకు 25 పడకలవరకే అనుమతి ఉన్నా, ఇటీవల వ్యాధులు పెరుగటంతో దవాఖానపై ఒత్తిడి పెరిగింది. దీంతో పరిమితికి మించిన సంఖ్యలో పిల్లలను చికిత్స నిమిత్తం చేర్పించుకున్నారు. ఆగ్నిప్రమాదం సంభవించిన వెంటనే ఐసీయూలోని పిల్లల తల్లిదండ్రుల అరుపులతో ఆందోళన నెలకొన్నది. పై అంతస్థులో మంటలు అంటుకున్నాయనే విషయం తెలుసుకున్న కింది రెండు అంతస్థుల్లోని పిల్లల తల్లిదండ్రులు ఏమి జరిగిందోనని తెలుసుకొనే ప్రయత్నంచేయడంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. మంటలు కిందకు కూడా వ్యాపిస్తాయనే భయంతో అందరూ తమ చిన్నారులతో అక్కడి నుంచి బయటకు పరుగులుతీశారు. వారు బయటకు వెళ్లేందుకు పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది సహకరించారు. తెల్లవారుజామున 3 నుంచి ఉదయం 5 గంటలవరకు దవాఖాన ఆవరణలో తీవ్ర భయాందోళనకర పరిస్థితులు కన్పించాయి.

దవాఖాన సీజ్‌

ప్రమాదం జరిగిన వెంటనే దవాఖానలో చికిత్స పొందుతున్న చిన్నారులను రక్షించాల్సిన సిబ్బంది, యజమాన్యం పరారయ్యింది. పోలీసులు అందరినీ ఖాళీచేయించి, దవాఖానను సీజ్‌చేశారు. నిర్వాహకుడు సునీల్‌కుమార్‌ అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు. అతడిని సోమవారం రాత్రి ఎల్బీనగర్‌ పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. దీనిని పోలీసులు ధ్రువీకరించలేదు.

మూడోసారి షార్ట్‌ సర్క్యూట్‌

ఈ దవాఖానలో వారం వ్యవధిలో ఇప్పటికే రెండుసార్లు షార్ట్‌సర్క్యూట్‌ సంభవించిందని చిన్నారుల బంధువులు తెలిపారు. మృతిచెందిన చిన్నారి చికిత్స పొందిన ఇంక్యుబేటర్‌ సమీపంలోనే శుక్రవారం షార్ట్‌సర్క్యూట్‌ సంభవించిందని చెప్పారు. దానికి మరమ్మతులు చేసి, తిరిగి దానినే ఉపయోగించడం వల్లే ఈ ప్రమాదం సంభవించిందని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎందుకు షార్ట్‌సర్క్యూట్‌ జరిగిందో గుర్తించి ఉంటే తమ బిడ్డ ప్రాణాలు నిలిచేవని నరేశ్‌, మానస దంపతులు విలపించారు. ప్రమాదానికి షార్ట్‌సర్క్యూటే కారణమని స్పష్టమవుతున్నదని రంగారెడ్డి జిల్లా అగ్నిమాపక అసిస్టెంట్‌ డిస్ట్రిక్ట్‌ ఫైర్‌ అధికారి ప్రసాద్‌ తెలిపారు. షార్ట్‌సర్క్యూట్‌తో ప్రమాదం జరుగడంతో పొగలు కమ్ముకున్నాయన్నారు. పొగ బయటకు వెళ్లేందుకు అద్దాలను పగులగొట్టాల్సి వచ్చిందని చెప్పారు.

ఘటనపై వైద్యారోగ్యశాఖ సీరియస్‌

పిల్లల దవాఖానలో సంభవించిన అగ్నిప్రమాద ఘటనను వైద్యారోగ్యశాఖ సీరియస్‌గా తీసుకున్నది. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి, తగిన చర్యలు తీసుకోవాలని మంత్రి ఈటల రాజేందర్‌ అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి జిల్లా వైద్యశాఖ అధికారులు దవాఖాన వద్దకు వచ్చి ప్రాథమిక వివరాలు సేకరించారు. నిబంధనలకు విరుద్ధంగా భవానాన్ని నిర్మించి, అందులో పిల్లల దవాఖానను నిర్వహిస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ కూడా గుర్తించింది. 2012 నుంచి ఇప్పటివరకు షైన్‌ దవాఖాన యాజమాన్యం జీహెచ్‌ఎంసీ నుంచి ఫైర్‌సేఫ్టీ కోసం ఎలాంటి అనుమతులు తీసుకోలేదని ఫైర్‌సేఫ్టీ అధికారి గోవర్ధన్‌రెడ్డి తెలిపారు. భవనం కూడా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించినట్టు తెలుస్తున్నదన్న జీహెచ్‌ఎంసీ అధికారులు, దీనిపై లోతైన దర్యాప్తు జరుపుతున్నారు. భవనానికి సంబంధించిన అనుమతులు ఏమున్నాయో తమకు అందించాలని నోటీసులు జారీచేశారు. కాగా, మున్ముందు ప్రమాదాలు సంభవించకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఆయా దవాఖానలకు నోటీసులు జారీచేస్తున్నట్టు జీహెచ్‌ఎంసీ విపత్తుల నిర్వాహణ డైరెక్టర్‌ విశ్వజిత్‌ తెలిపారు.

1201
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles