సుప్రసిద్ధ కవి, సినీ రచయిత ఆచ్చి వేణుగోపాలాచార్య కన్నుమూత


Sat,February 27, 2016 03:31 AM

Film writer venugopalacharyulu passes away

-పట్నంలోశాలిబండ, నమో వేంకటేశా గీతాలతో ప్రసిద్ధి
చిక్కడపల్లి/హైదరాబాద్, నమస్తే తెలంగాణ: సుప్రసిద్ధ తెలంగాణ పాటలరచయిత, కవి, పండితుడు, గ్రంథ పరిష్కర్త, బహుముఖ ప్రజ్ఞాశాలి ఆచ్చి వేణుగోపాలాచార్యులు (91) శుక్రవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, ముగ్గురు కుమారులు. ఒక కుమార్తె ఉన్నారు. పట్నంలోశాలిబండ, పేరైన గోలుకొండ, ఎవరీ చక్కనిచుక్క వంటి హుషారెత్తించే పాటలతో పాటు నమో వేంకటేశా, నమో తిరుమలేశా వంటి ఆధ్యాత్మిక దివ్యభావనలతో మనస్సులను పారిమార్థిక చింతనవైపు మళ్లించగల విలక్షణ పాటలను అందించిన ప్రతిభాశాలి ఆచార్యులు. సినిమా రంగంలోని కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం వంటి అన్ని రంగాలలో విలక్షణతను కనబరిచి బహుముఖప్రజ్ఞాశాలిగా నిలిచారాయన. సీమాంధ్ర పెత్తందారీస్వభావ రచయితలు సినిమారంగాన్ని గుప్పిట్లో పెట్టుకున్న 50వ దశకంలోనే తెలంగాణ కలంలోని సజీవచైతన్యాన్ని చాటిచెప్పిన ధీశాలి.1930 జూన్12న ఆయన కుత్బుల్లాపూర్‌లో జన్మించారు. పాఠశాల విద్యను ఉర్దూమీడియంలో అభ్యసించారు. 1952లో ఉపాధ్యాయులుగా ఉద్యోగంలో చేరారు. 1952-1953 తెలంగాణ ఇడ్లీసాంబార్ గోబ్యాక్ ఉద్యమంలో, 1969 తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు.

Achi-venugopalacharyuluఉద్యమకారులకు తనవంతు సాయం అందించారు. జూన్ 2, 2014న కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ రాష్ట్రం సిద్ధించిన తర్వాత సంతోషంతో ఉక్కిరిబిక్కిరి అయ్యారు. కేసీఆర్‌ను నిండుమనసుతో ఆశీర్వదించారు. ఆరుదశాబ్దాల కలనెరవేరిందని ఆయన తన సంతోషాన్ని మిత్రులతో పంచుకున్నారు. తెలుగు, ఇంగ్లీషు, హిందీ, సంస్కృతం, ఉర్దూ భాషలలో సమాన వైదుష్యాన్ని ప్రదర్శించారు. బతుకమ్మ, బతుకమ్మ ఉయ్యాలో.. బంగారు బతుకమ్మ ఉయ్యాలో వంటి పాటలను రాసి తెలంగాణ వైతాళికుల జాబితాలో చేరిన సాహితీవేత్త ఆయన. సౌభాగ్యవతి, అమాయకుడు, దేవుడున్నాడు, రాఘవేంద్ర మహిమలు సినిమాలకు దర్శకత్వం వహించారు. ఆ సినిమాలకు పాటలు కూడా రాశారు. కేబి తిలక్ దర్శకత్వంలో వచ్చిన ముద్దుబిడ్డ సినిమాలో ఆయన రాసిన చుక్కల చీరకట్టుకొని జానపదగీతం బహుళ ప్రజాదరణ పొందడంతో పేరువచ్చింది. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వీరి కుటుంబానికి ఇలవేల్పు. యాదగిరిగుట్ట బ్రహ్మోత్సవాలతోపాటు ప్రతి ఉత్సవానికి వీరి కుటుంబానిదే బృహస్పతి స్థానం. ఆరు దశాబ్దాలుగా గుట్టలో బ్రహ్మస్థానంలో కూర్చొని వరుసగా బ్రహోత్సవాలు నిర్వహిస్తూ వచ్చారు. పాంచరాత్ర ఆగమ సంప్రదాయాలపైన ఆయనది సాధికారిక ప్రజ్ఞ. వేదపండితులు, పంచాంగకర్తలు, సిద్ధాంతులు ఆయనతో సంభాషించి తమ సందేహాలను నివృత్తి చేసుకునేవారు. నువ్వు చారి అనే పేరుతో సినిమాఫీల్డులో నిలదిక్కుకోలేవు అని ఎన్టీఆర్ సలహా ఇవ్వడంతో సినిమాల వరకు ఆయన పేరును వేణుగోపాల్‌గా మార్చుకున్నారు. పలు ఆధ్యాత్మిక గ్రంథాలను సులభమైన తెలుగులో అనువదించారు. శ్రీ వేంకటేశ్వర సుప్రభాతాన్ని తెలుగుపద్యాలలోకి అనువదించారు.

వేణుగోపాల్ కలం నుంచి జాలువారిన గీతాలలో కొన్ని..


పట్నంలో శాలిబండ.. పేరైన గోలకొండ (అమాయకుడు)
చుక్కల చీర కట్టుకుని (ముద్దుబిడ్డ)
శ్రీవేంకటేశా దయాసాగరా (తిరుపతమ్మకథ)

ప్రైవేటు గీతాలు


ఏడుకొండల స్వామి ఎక్కడున్నావయ్యా
నీకొండకు నీవే రప్పించుకో
నమో వేంకటేశా.. నమో తిరుమలేశా
ఓ తిరుపతి వేంకటేశా..
జయజయజయ శ్రీ వేంకటేశా

2923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS