కల్తీ కల్లుతాగి 15 మందికి అస్వస్థతMon,April 16, 2018 02:40 AM

-హైదరాబాద్‌లోని కామినేనికి నలుగురు తరలింపు
-నల్లగొండ ప్రభుత్వ దవాఖానలో 11మందికి చికిత్స
-ఘటనపై ఎక్సైజ్ అధికారుల ఆరా
-విష ప్రయోగమనే కోణంలో దర్యాప్తు
Adulteration-toddy
గుర్రంపోడు, హాలియా: కల్తీ కల్లు తాగి 15మంది అస్వస్థతకు గురయ్యారు. వీరిలో నలుగురి పరిస్థితి విషమించడంతో హైదరాబాద్‌లోని కామినేని దవాఖానకు తరలించారు. గ్రామస్థులు, బాధితుల కథనం ప్రకారం.. నల్లగొండ జిల్లా గుర్రంపోడు మండలం పోచంపల్లికి చెందిన వ్యవసాయ కూలీలు శనివారం సాయం త్రం పనులు ముగించుకొని ఇంటికి తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యంలో అదే గ్రామానికి చెందిన కల్లుగీత కార్మికుడు కుంభం యాదయ్య అడ్డా వద్ద కల్లు కొనుగోలు చేశారు. దానిని తమ వద్ద ఉన్న సీసాల్లో నింపుకొని ఇంటికి చేరుకు న్నారు. ఇంటి వద్ద కల్లు తాగిన కొద్దిసేపటికే గుండెబోయిన పాపయ్య, గుండెబోయిన లక్ష్మమ్మ, యాదమ్మ, భిక్షమయ్య, సత్తయ్య, పూల ఈదయ్య, పూల లక్ష్మమ్మ, జాల మల్లయ్య, గుండెబోయిన బక్కమ్మ, జ్యోతి, ధనమ్మ, నారయ్య, ముక్కమల్ల యాదమ్మ, లక్ష్మీప్రసన్న, పోల ఏశమ్మ వాంతులు, విరేచనాలతో తీవ్ర అస్వస్థకు గురయ్యారు. దీంతో వారిని 108 వాహనంలో గుర్రంపోడులోని ప్రభుత్వ దవాఖానకు తరలించారు. ప్రథమ చికిత్స అందించి నల్లగొండ ప్రభుత్వ దవాఖానకు తరలించారు.

తీవ్ర అస్వస్థతకు గురైన భిక్షమయ్య, లక్ష్మమ్మ, మల్లయ్య, సత్తయ్య అనే నలుగురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కామినేని దవాఖానకు తరలించినట్టు ఎక్సైజ్ డీసీ జీవన్‌సింగ్ తెలిపారు. ఆదివారం ఎక్సైజ్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పోచంపల్లికి చెందిన కుంభం యాదయ్యకు కల్లు గీత కార్మికుల సంఘంలో ఎలాంటి సభ్య త్వం లేదని చెప్పారు. యాదయ్య విక్రయించిన కల్లులో చెక్రిన్ పౌడర్, నిమ్మ ఉప్పు కలిపినట్టు ప్రాథమికంగా నిర్ధారించినట్టు తెలిపారు. దాని వల్ల ఎలాంటి అనర్థాలు జరుగవన్నారు. యాదయ్య, వారి బంధువుల మధ్య కొన్ని భూతగాదాలు ఉన్నాయని, దీంతో ఎవరైనా కల్లులో పురుగుల మందు కలిపి ఉండవచ్చనే అనుమానం వ్యక్తంచేశారు. ఆ కోణంలో విచారణ జరుగుతుందని తెలిపారు. కల్లును పరీక్ష నిమిత్తం వరంగల్ ల్యాబ్‌కు పంపించామన్నారు. ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతున్న బాధితుల నుంచి సేకరించిన రక్తపరీక్షల్లో పెస్టిసైడ్స్ ఆనవాళ్లు ఉన్నాయని వైద్యులు తెలిపారన్నారు. వీఆర్వో కృష్ణయ్య ఫిర్యాదు మేరకు గీత కార్మికుడు కుంభం యాదయ్యపై కేసు నమోదు చేశామన్నారు.

1482

More News

VIRAL NEWS