అనుభవదారుగా కబ్జాదారు


Mon,August 12, 2019 01:47 AM

Farmers Suffering Revenue Officer Negate The Land Registration

-భూ యజమానికి మొండిచేయి
-పెండింగ్‌లో పట్టాదారు పాస్‌పుస్తకాలు
-ఇచ్చింది తీసుకొని తప్పుకోండంటున్న కబ్జాదారులు
-పట్టించుకోని రెవెన్యూ అధికారులు

భూయజమాని భూమి లేనివాడయ్యారు. కబ్జాదారు ఆ భూమిని సొంతంచేసుకొన్నాడు. కబ్జాదారుడి కాసులకు రెవెన్యూ అధికారులు కక్కుర్తిపడ్డారు. ఇదేమని అడిగితే.. ఎంతో కొంత ఇస్తాం తీసుకోవాలంటూ కబ్జాదారుడు బెదిరిస్తున్నాడు. రెవెన్యూ అధికారులు కబ్జాదారుకే వత్తాసు పలుకుతున్నారు. పట్టా ఉన్నా అతనే కబ్జాలో ఉన్నాడంటూ అధికారులు కరాఖండిగా చెప్తున్నారు. ఏం చేయాలో అర్థంకాక సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం గ్రామానికి చెందిన నగునూరి వెంకటనర్సయ్య ధర్మగంటను ఆశ్రయించారు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: భూరికార్డుల ప్రక్షాళన సందర్భంగా పాస్‌పుస్తకంలో అనుభవదారు కాలమ్‌కు విలువలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టంగా చెప్పినప్పటికీ.. రెవెన్యూ అధికారులు లెక్కచేయడంలేదు. పర్యవసానంగా ఓ పేదరైతు తనకు వారసత్వంగా సంక్రమించిన భూమిని పోగొట్టుకొనే పరిస్థితి ఏర్పడింది. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలం పోతారం గ్రామానికి చెందిన నగునూరి వెంకటనర్సయ్య భూమిని కబ్జాదారులు ఆక్రమిస్తే.. వారి నుంచి భూమిని విడిపించి హక్కుదారుకు అప్పగించాల్సిన అధికారులు.. కబ్జాలో ఉన్నవారికే భూమి సొంతం అంటూ కొత్తరాగాలు తీస్తున్నారు. కబ్జాదారులకు అండగా ఉన్న రెవెన్యూ అధికారుల తీరుతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నానని నంగునూరి వెంకటనర్సయ్య వ్యక్తంచేస్తున్న ఆవేదన ఆయన మాటల్లోనే..పోతారానికి చెందిన నాకు తండ్రి రామయ్య నుంచి వారసత్వంగా గ్రామంలోని సర్వే నంబర్ 207లో 1.10 ఎకరాలు, దీన్ని ఆనుకొని రేగులపల్లి రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 97సీ/బీలో 2.20 ఎకరాల భూమి ఉన్నది. ఈ భూమిని నా తండ్రి రామయ్య డాక్యుమెంట్ నంబర్ 1331/2011, డాక్యుమెంట్ నంబర్ 1332/2011 కింద నాకు గిఫ్ట్ డీడ్‌చేశారు.
Dharmaganta
ఈ మేరకు కరీంనగర్ రూరల్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ అధికారులు ఈ భూమిని 2015లో మ్యుటేషన్‌చేశారు. 1-బీ రికార్డుల్లోకి ఎక్కింది. పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా ఇచ్చారు. నేను 25 ఏండ్లుగా కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ దవాఖానలో కులవృత్తి అయిన బట్టలు ఉతుకుతూ జీవిస్తున్నాను. బతుకుదెరువు కోసం నేను కరీంనగర్‌కు వెళ్లడంతో నా తండ్రి ఈ భూమిని మాజీ సర్పంచ్ నిషాని కనకయ్యకు కౌలుకిచ్చారు. కనకయ్య తనకున్న అధికార పరిచయాలతో ఏకంగా నా భూమిని కబ్జాచేశారు. భూమిని నేను తీసుకొని దున్నుకోవడానికి వెళ్తే.. భూమి మీదకు వస్తే చంపుతానని బెదిరిస్తున్నారు. ఆయన తమ్ముడు లాయర్. నాకు లాయర్ ఉన్నాడు.. నీకు ఎవ్వరూ లేరు.. ఎంతో కొంత ఇస్త.. ఇచ్చింది తీసుకొని భూమిని వదిలిపెట్టు.. నీకు ఎప్పటికీ కూడా భూమి రాదు అని బెదిరిస్తున్నారు. రెవెన్యూ అధికారులేమో ఈ భూమిని కబ్జాదారుడైన కనకయ్యకు కట్టబెట్టారు. ఏకంగా అనుభవదారు కాలమ్‌లో కనకయ్య పేరు ఎక్కించారు. భూరికార్డుల ప్రక్షాళనలో కనీసం నాకు 1-బీ కాగితం ఇవ్వలేదు. ఎందుకు ఇవ్వడం లేదని ఆనాడు ప్రశ్నిస్తే.. వీఆర్వో లేరని జవాబిచ్చారు.

ఆ తర్వాత 2018లో కబ్జాదారు కాలమ్‌లో కనకయ్య పేరు ఎక్కించారు. ఎలాంటి వివాదం లేని నా భూమిని రెవెన్యూ అధికారులు కబ్జాదారుడికి అండగా ఉండి లేని వివాదాన్ని సృష్టించారు. ఏనాడు అనుభవదారు కాలమ్‌లో లేని కనకయ్య పేరును 2018లో రెవెన్యూ అధికారులు ఎక్కించారు. దీనిపై అభ్యంతరం వ్యక్తంచేస్తే సాదాబైనామా కింద మీరు అమ్మేశారు అని నన్నే ఉల్టా అంటున్నారు. సాదాబైనామా కాగితం అడిగితే చూపించడంలేదు. పహాణీలు, ప్రొసీడింగ్స్ అడిగితే ఇవ్వడం లేదు. సర్వే నంబర్లు 207కు 2007 వరకు, 97సీ/బీకి 2012 వరకు పహాణీలు ఇచ్చి చేతులు దులుపుకొన్నారు. ప్రొసీడింగ్స్ ఇవ్వమంటే లేవని ఒకసారి, దొరకవని మరోసారి మండల రెవెన్యూ అధికారులు సమాధానం ఇచ్చారు. ఆర్టీఐ కింద దరఖాస్తుచేసినా ఇవ్వడం లేదు. కలెక్టర్ కార్యాలయం నుంచి విజ్ఞాపన వచ్చినా పట్టించుకోలేదు. నేను పాస్‌పుస్తకాలు తీసుకొన్న తర్వాత బ్యాంకులో రుణం తీసుకొన్నాను. దీనిని రెన్యువల్ చేసుకొందామంటే పహాణీలో పేరు రావడం లేదు. కబ్జాదారుడికి అండగా నిలిచిన రెవెన్యూ అధికారులు నా భూమిని ఒక సర్వే నంబర్‌కు డిస్ప్యూట్ అని, మరో సర్వే నంబర్‌కు రెవెన్యూ కోర్టు కేసు పెండింగ్ ఉన్నదని సీసీఎల్‌ఏ ఆన్‌లైన్‌లో పెట్టారు. ఫలితంగా నాకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం రాలేదు. రైతుబంధు సాయం అందలేదు. రైతుబీమా లేకుండా పోయింది. బ్యాంకులో ఉన్న రుణం రీషెడ్యూల్ కావడం లేదు. భూమిని దున్నుకోవడానికి వెళ్తే చంపుతానని బెదిరిస్తున్నారు. ఎలాగైనా కబ్జాదారుడిని తొలగించి నా భూమిని నాకు ఇప్పించండి.

నాకు తెలియదు

కబ్జాలో నిషాని కనకయ్య ఉన్నారు. 2017లో సాదాబైనామాతో పట్టా కోసం దరఖాస్తు చేసుకొన్నారు. ఈ భూమిని అమ్మలేదని భూ యజమాని నంగునూరి వెంకటనర్సయ్య చెప్తున్నారు. వెంకటనర్సయ్యను భూమి మీదకు వస్తే చంపుతానని బెదిరిస్తున్నారన్న విషయం కూడా మాకు తెలిసింది. తాసిల్దార్ రిపోర్ట్ ఇవ్వమంటే ఇచ్చాను. ఇద్దరికీ నోటీస్‌లు ఇచ్చి హాజరు కావాలని చెప్పారు. ఆ తర్వాత ఏమి జరిగిందో నాకు తెలియదు. ఈ భూమికి అనుభవదారు కాలమ్‌లో కనకయ్య పేరు ఎలా వచ్చిందో నాకు తెలియదు.
- వాణి, పోతారం, రేగులపల్లి వీఆర్వో

పేద రైతులకు న్యాయం


సీహెచ్ మౌనిక, ప్రజ్ఞాపూర్ గజ్వేల్, సిద్దిపేట జిల్లా

ధర్మగంటలో ప్రచురితమవుతున్న కథనాలతో చాలామంది పేద రైతులకు న్యాయం జరుగుతున్నది. రెవెన్యూ అధికారుల అవినీతిని బట్టబయలు చేస్తూ ఏండ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న రైతుల భూసమస్యలకు ధర్మగంట ద్వారా పరిష్కారం చూపుతున్న నమస్తే తెలంగాణకు వందనం. అవినీతి అంతానికి రెవెన్యూశాఖ ప్రక్షాళన తక్షనావసరం. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు నిర్ణయం సరైనదే. మాలాంటి పేద రైతులకు సహాయ పడుతున్న నమస్తే తెలంగాణ యాజమాన్యానికి ధన్యవాదాలు.భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం

ఏండ్లుగా భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్న బాధితులకు సీఎం కేసీఆర్ చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో మేలు జరిగింది. భూసమస్యల శాశ్వత పరిష్కారానికి సీఎం చేస్తున్న కృషి భేష్. పహాణీలో, పాస్‌పుస్తకంలో మార్పులుచేర్పులు చేసుకోవాలంటే కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరుగాల్సి ఉండేది. చెప్పులరిగేలా తిరిగినా అధికారులు వారిని కనీసం పట్టించుకొనేటోళ్లు కాదు. రెవెన్యూ అధికారులు పారదర్శకంగా పనిచేస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండేవికావు. సీఎం కేసీఆర్ మంచి నిర్ణయంతో ముందుకెళ్తున్నా రు. రెవెన్యూ విభాగంలో సంస్కరణలు చేయడం ఒక్క సీఎం కేసీఆర్‌కే సాధ్యమవుతుంది.
- శ్రీకాంత్, గజ్వేల్, సిద్దిపేట జిల్లా

622
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles