మాజీ సైనికుడి భూమికీ రక్షణలేదు


Wed,May 22, 2019 02:13 AM

Farmers Suffering In Telangana For Pattadar Passbooks

-1973లో ప్రభుత్వం కేటాయించిన ఐదెకరాల భూమి ఆక్రమణ
-1బీ, పహాణీ, పాత పాస్‌బుక్ ఉన్నా కొత్త పాస్‌పుస్తకం ఇవ్వని అధికారులు
-పదేండ్లుగా కాళ్లరిగేలా రెవెన్యూ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు

హుస్నాబాద్, నమస్తే తెలంగాణ: ఓ మాజీ సైనికుడి భూమికే రక్షణ లేకుండాపోయింది. ప్రభుత్వం ఇచ్చిన ఐదెకరాల భూమి ఆక్రమణకు గురైంది. తన భూమి తనకు ఇప్పించాలని దశాబ్దకాలంగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా.. అధికారులు మాత్రం కనికరించడంలేదు. ఆర్డీవో, జేసీ, డీఆర్వోను కలిసినా ఫలితం లేకుండాపోయింది. సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి కలెక్టర్‌కు ఆదేశాలు వచ్చినా.. అవి అక్కరకు రాకుండా పోయాయంటే రెవెన్యూ సిబ్బంది తీరు ఎంత నిర్లక్ష్యంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం గట్ల నర్సింగాపూర్‌కు చెందిన ఆదిమూలపు రామస్వామి ఆర్మీ మద్రాస్ ఇంజినీరింగ్ గ్రూప్‌లో హవల్దార్‌గా పనిచేసి రిటైర్మెంట్ తీసుకొన్నాడు. ప్రస్తుతం ఆయన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్‌లో నివసిస్తున్నాడు.
Dharmaganta
ఈయనకు సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం చౌటపల్లి శివారు 312/36 సర్వే నంబర్‌లోని ఐదెకరాల బంచరాయి భూమిని ప్రభుత్వం 1973లో కేటాయించింది. 1986లో శేత్వార్ ప్రకారం సర్వేయర్ సమక్షంలో చౌటపల్లికి చెందిన ఇద్దరు పంచ్‌ల ఎదుట పంచనామాచేసి శాశ్వత హద్దులు పాతారు. 1995, మే 20న 182 ఖాతా నంబర్‌తో రామస్వామికి పట్టాదారు పాస్‌పుస్తకం కూడా ఇచ్చారు. కొన్నిరోజుల తర్వాత కొందరు హద్దులు పీకేసి భూమిని ఆక్రమించుకొని సాగుచేయడం ప్రారంభించారు. ఇదేమిటని అడిగితే ఈ భూమి మాదే.. మేమే దున్నుకుంటాం.. ఏమి చేసుకుంటావో చేసుకో అని బెదిరింపులకు దిగారు. తన భూమిని ఇప్పించాలంటూ అప్పటినుంచి హుస్నాబాద్ రెవెన్యూ కార్యాలయం, కరీంనగర్ కలెక్టరేట్, ఆర్డీవో, డీఆర్వోకు ఆర్జీలు పెట్టినా ఫలితం లేకపోయింది. 2017 మార్చి 6వ తేదీన జరిగిన సిద్దిపేట కలెక్టర్‌కు ప్రజావాణిలో ఫిర్యాదుచేయగా.. పోలీసుల సమక్షంలో హద్దులు నిర్ణయించాలని హుస్నాబాద్ ఆర్డీవో, అక్కన్నపేట తాసిల్దార్‌కు ఆదేశించారు. కలెక్టర్ ఆదేశాలను స్థానిక అధికారులు బేఖాతర్ చేయడంతో.. 2018 ఫిబ్రవరి 22వ తేదీన ముఖ్యమంత్రి కార్యాలయంలో ఫిర్యాదుచేశాడు. స్పందించిన సీఎంవో అధికారులు.. ఫిబ్రవరి 24న సిద్దిపేట కలెక్టర్‌కు ఆదేశాలిచ్చారు. మూడురోజుల్లో సమస్య పరిష్కరించాలని హుస్నాబాద్ ఆర్డీవోకు మార్చి 3న కలెక్టర్ లేఖ పంపారు. సీఎం కార్యాలయం నుంచి ఆదేశాలు అంది మూడు నెలలైనా రెవెన్యూ అధికారులకు చీమకుట్టినైట్లెనా లేదు.

అన్ని సక్రమంగా ఉన్నా..


ఆదిమూలపు రామస్వామి, మాజీ సైనికుడు

ప్రభుత్వమిచ్చిన భూమికి సంబంధించి అన్ని డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్నా.. రెవెన్యూ అధికారులు కొత్త పట్టాదారు పాస్‌బుక్ ఇవ్వడం లేదు. పహాణీలోగానీ, 1బీ సర్టిఫికెట్లోగానీ ఈరోజు వరకు ఐదెకరాల భూమి నా పేరు మీదనే ఉన్నది. నిరుపేదనైన నేను ఇద్దరు వికలాంగ కుమారులు, అనారోగ్యం పాలైన భార్యను సాకేందుకు ప్రభుత్వం ఇచ్చిన ఈ భూమే ఆదరువుగా ఉన్నది. పదేండ్లుగా తిరుగుతున్నా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. మా సమస్యను నమస్తే తెలంగాణ ధర్మగంట గుర్తించినందుకు ధన్యవాదాలు.
పరిష్కారానికి కృషిచేస్తా..


దశరథ్‌సింగ్ రాథోడ్

మాజీ సైనికుడి భూమికి సంబంధించిన అంశంపై నాకు పూర్తిగా అవగాహన లేదు. అయినా రామస్వామి భూమికి సంబంధించి అన్ని విధాలుగా విచారణ జరిపించి సమస్యను పరిష్కరించేందుకు కృషిచేస్తా. భూమి హక్కుకు సంబంధించిన అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉంటే భూమిని అప్పగించేందుకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ప్రస్తుతం కబ్జాలో ఉన్నారని చెప్తున్న వారికి ఏమైనా డాక్యుమెంట్లు ఉన్నాయా అనే కోణంలోనూ విచారణచేస్తాం.
- దశరథ్‌సింగ్ రాథోడ్,అక్కన్నపేట ఇంచార్జి తాసిల్దార్
పాస్‌బుక్‌లో 20 గుంటలు ఎక్కించలేదు


నర్సింహులు

రెవెన్యూసిబ్బంది చేసిన తప్పు మహిళారైతుకు శాపంగా మారింది. సమస్యను పరిష్కరించాలని కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రానికి చెందిన తోడేటి లక్ష్మి, ఆమె కుమారుడు తేడేటి నర్సింహులు తెలిపిన వివరాల ప్రకారం.. బీబీపేటలోని సర్వే నంబర్లు 107(6)లో 20 గుంటలు, 107(5బీ)లో 9 గుంటల భూమి తోడేటి లక్ష్మి పేరున ఉన్నది. ఈ మేరకు పాత పాస్‌పుస్తకాల్లో నమోదై ఉన్నది. కానీ కొత్త పాస్‌పుస్తకంలో 20 గుంటల భూమిని ఎక్కించలేదు. అప్పటినుంచి తప్పుదిద్దాలని గ్రామ రెవెన్యూ అధికారి చుట్టూ తిరిగినా, తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లినా ఫలితంలేదు. మీసేవలో పహాణీలో తమ భూమి వివరాలు కనిపిస్తున్నాయని, తమకు రైతుబంధు డబ్బులు కూడా వస్తున్నాయని చెప్పారు. కొత్త పాస్‌పుస్తకంలో 20 గుంటల భూమిని ఎక్కించకపోవడంతో, బ్యాంక్‌లో వ్యవసాయరుణం ఇవ్వడంలేదని వాపోతున్నారు.
వీఆర్వో బెదిరిస్తున్నాడు


ఆరుట్ల సుధాకర్, రైతు

నేను 2003లో సంగా రెడ్డి జిల్లా సదాశివపేట మండలం వెల్టూర్‌లో 752/ఈ2 /1 సర్వేనంబర్‌లో 2.13 ఎకరాలు కొనుగోలుచేశా. పాస్‌పుస్తకం కోసం దరఖాస్తుచేయగా అప్పట్లో రూ.3 వేలు తీసుకొని పాస్‌పుస్తకం ఇచ్చారు. ఏడాది క్రితం వరకు ఆన్‌లైన్ రికార్డుల్లో నా పేర భూమి ఉన్నది. కానీ కొత్త పాస్‌పుస్తకం జారీచేయలేదు. ఈ విషయంపై సదాశివపేట రెవెన్యూ కార్యాలయానికి వచ్చి.. తాసిల్దార్‌కు విషయం వివరించి కొత్త పాస్‌పుస్తకం ఇవ్వాలని వేడుకున్నా. గ్రామ వీఆర్వోను మళ్లీ ఒకసారి సంప్రదిస్తే.. ఏం మజాక్ చేస్తున్నావా.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడిస్తే అప్పుడేఇస్తా.. ముఖ్యమంత్రి ఇయ్యంది నేను తయారుచేసి ఇయ్యాల్నా నీ బుక్‌లు.. అని ఇష్టానుసారంగా మాట్లాడుతూ బెదిరిస్తున్నాడు. పాస్‌పుస్తకం రాకపోవడంతో రైతుబంధు, రైతుబీమా, కిసాన్‌సమ్మాన్ పథకాలకు అర్హతలేక నష్టపోతున్నానని వేడుకున్నా వీఆర్వో తీరుమారలేదు. నా భూమి ఆన్‌లైన్‌లో ఉన్నదా లేదా అని తెలుసుకునేందుకు ఏడాది క్రితం చూస్తే 2.13 ఎకరాలు నమోదైనట్టు కనిపించింది. ఇటీవల ఆన్‌లైన్‌లో మరోసారి చూస్తే కనిపించలేదు. రికార్డులు సరిచేసి.. న్యాయంచేయాలి.
- ఆరుట్ల సుధాకర్, రైతు, వెల్టూర్, సదాశివపేట మండలం, సంగారెడిజిల్లాఏండ్లనాటి సమస్యలకు పరిష్కారం


బొర్రా రాంబాబు

నమస్తే తెలంగాణ- ధర్మగంట రైతులకు దారి చూపుతున్నది. చిక్కుముడులతో ఉన్న ఏండ్లనాటి భూ సమస్యలు పరిష్కారం అవుతున్నాయి. ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో సమూల మార్పులు తీసుకొచ్చేలా చేపట్టిన నూతన విధానం పేద రైతులకు అండగా నిలుస్తున్నది. అవినీతికి పాల్పడిన వారిపై కూడా చర్యలు తీసుకుంటున్నారు. అధికారులు ఎవరైనా చర్యలు తీసుకోవడానికి వెనుకాడకుండా రైతులకు అండగా ధర్మగంట ముందుండటం హర్షణీయం. దీనికోసం రైతుల సమస్యలను పరిష్కరిస్తామని ముందుకొస్తున్న నమస్తే తెలంగాణకు అభినందనలు.
- బొర్రా రాంబాబు, రిటైర్డ్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్, భద్రాచలంరెవెన్యూలో మార్పులు అవసరమే


నీరుకొండ హన్మంతరావు

భూముల సమస్యలు సుదీర్ఘకాలంగా పేరుకుపోయాయి. ఇలాంటి చిక్కుముడులు వీడాలంటే రెవెన్యూ వ్యవస్థలో మార్పులు రావాలి. నమస్తే తెలంగాణలో ధర్మగంట పేరుతో మంచి కథనాలు వస్తున్నాయి. సమస్యలుకూడా పరిష్కారం అవుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా చాలామంది పేద రైతులకు ఈ కథనాల ద్వారా పట్టాలిచ్చారు. పూర్వకాలం నుంచి రెవెన్యూ అధికారులు ఒకరి భూములు ఒకరికి తారుమారుచేసి పట్టాలివ్వడం వల్ల చాలామంది నష్టపోయారు. ఇలాంటి సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చరమగీతం పాడుతున్నది. ధర్మగంటను ఆశ్రయించిన రైతులకు న్యాయం జరుగుతున్నది.
- నీరుకొండ హన్మంతరావు, రిటైర్డ్ ఉద్యోగి, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాసీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం


ఆది బలరాం, రిటైర్డ్ లైబ్రేరియన్

రెవెన్యూ శాఖలో అవినీతికి అడ్డుకట్ట వేయాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ ముందుకుసాగడం హర్షణీయం. ప్రభుత్వశాఖలపై ప్రజలకు నమ్మకం కలిగేలా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి తీసుకుంటున్న చొరవ చారిత్రాత్మకం. ఈ మార్పు సుపరిపాలనకు నాంది అవుతుంది.
-ఆది బలరాం, రిటైర్డ్ లైబ్రేరియన్, మెదక్

707
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles