అసైన్డ్‌భూముల్లో చిచ్చు!


Mon,July 22, 2019 02:52 AM

Farmers Suffering assigned lands Pattadar Passbook

-అక్రమార్కుల చెరలో వందల ఎకరాలు
-దళితుల పట్టాభూములూ దర్జాగా కబ్జా
-రెవెన్యూచట్టాలకు అధికారుల తూట్లు
-అసైన్డ్‌భూములకూ యథేచ్ఛగా థర్డ్‌పార్టీ రిజిస్ట్రేషన్లు
-బై నంబర్లు వేసి స్థానికేతరులకు కొత్త పాస్‌పుస్తకాలు
-జేసీ ఆదేశాలనూ ఖాతరుచేయని తాసిల్దార్
-భూముల కోసం పొడ్చన్‌పల్లి దళితుల ఆందోళన

ఒక్కగుంట కూడా భూమిలేని నిరుపేదలు వారు. ఎన్నో కష్టాలకు ఓర్చి గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న అసైన్డ్‌భూములను చదును చేసుకుని.. సాగుచేసుకుంటూ జీవనంసాగిస్తున్న దళితులు వారు. వారి కష్టాలను గుర్తించి ప్రభుత్వం వారికి పట్టాలు పంపిణీ చేసింది. అలాంటి భూముల్లో రెవెన్యూ అధికారులు చిచ్చుపెట్టారు. దళితులకు కేటాయించిన భూములనే బైనంబర్లు వేస్తూ.. ఆక్రమణదారులకు స్థానికేతరులకు పాస్‌పుస్తకాలు ఇచ్చి ఘర్షణలకు కారణమయ్యారు. రెవెన్యూ చట్టాలను తుంగలో తొక్కి అసైన్డ్ భూములను స్థానికేతరులకు పట్టాలు చేశారు. ఇటు దళితులు, అటు ఆక్రమణ దారుల మధ్య చిచ్చు రాజేసి చోద్యం చూస్తున్నారు. రెవెన్యూశాఖలో కొందరు అధికారుల తప్పిదాలకు దాదాపు 170 దళిత కుటుంబాలు రోడ్డునపడే పరిస్థితి నెలకొన్నది. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం పొడ్చన్‌పల్లి గ్రామ దళితుల దీనగాథపై ప్రత్యేక కథనం..

మెదక్ మున్సిపాలిటీ: మెదక్ జిల్లా పాపన్నపేట మండ లం పొడ్చన్‌పల్లి గ్రామ శివారులోని సర్వే నంబర్ 1168/29లో 492 ఎకరాల 28 గుంటల అసైన్డ్ భూమి ఉన్నది. గ్రామానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న ఆ భూమిని గ్రామానికే చెందిన దళితులు ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చదునుచేసి.. 1958 నుంచి సాగు చేనుకొంటున్నారు. వారిలో అర్హులైన నిరుపేద దళితులకు 1970, 1984, 2003, 2009 సంవత్సరాల్లో అప్పటి ప్రభుత్వాలు విడుతలవారీగా పట్టాలు పంపిణీ చేశాయి. అయితే, కాలం కలిసిరాక పట్నంబాట పట్టిన వారి భూములపై అక్రమార్కుల కన్నుపడింది. ఖాళీగా ఉన్న అసైన్డ్ భూముల నుంచి మొదలైన వీరి ఆక్రమణల పర్వం.. 2003, 2004 నాటికి దళితులకు పంపిణీచేసిన భూములను చెరపట్టడం వరకు చేరింది. రెవెన్యూ అధికారుల అండతో పట్టాలు పొందడమూ మొదలయింది.
MDK-MUNICIPALITY1

2003-04 నుంచి పట్టాలు మార్పిడి

పొడ్చన్‌పల్లి గ్రామ దళితులకు 1970లో పట్టాలు మంజూరైనప్పటి నుంచి ఆ భూములను వారే సాగుచేసుకొంటున్నారు. 1989-90 ఆర్వోఆర్‌లోనూ, 2000-2001 వరకు పహాణీలో వారిపేర్ల మీదనే భూములు ఉన్నట్టు రికార్డులు చెప్తున్నాయి. అయితే, 2003-2004 నుంచి వీఆర్వోలు దళితుల పేర్లను క్రమంగా తొలగిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం పహాణీల్లో ఉన్న కొద్దిమంది దళితుల భూములనూ వివాదాల్లో ఉన్నవిగా పరిగణిస్తూ వాటిని పక్కనపెట్టారు. కానీ అక్రమార్కుల చెరలో ఉన్న భూములకు మాత్రం ఎలాంటి అభ్యంతరాలు చెప్పకుండానే.. పాస్‌పుస్తకాలు సైతం జారీచేశారు. ఇక్కడే రెవెన్యూ అధికారులు మరో చిచ్చురాజేశారు. 1168/29లో కొందరు దళితులకు కొత్త పాస్‌పుస్తకాలు ఇస్తూనే.. బై నంబర్లు చేర్చి ఆక్రమణదారులకు కూడా పాస్‌పుస్తకాలు జారీచేశారు. దీంతో ఈ భూమి నాదంటే నాదంటూ అటు ఆక్రమణదారులు, ఇటు దళితులు పంచాయితీ పెట్టుకొంటున్నారు. 1186/29 సర్వే నంబర్‌లో 492 ఎకరాలు ఉంటే రెవెన్యూ అధికారులు సుమారు 600 ఎకరాల భూములకు పాస్‌పుస్తకాలు జారీచేసినట్టు సమాచారం. అదీగాక కొందరికి నకిలీ పట్టా సర్టిఫికెట్లు సైతం జారీచేశారన్న ఆరోపణలు ఉన్నాయి. అసైన్డ్ భూములను స్థానికేతరులకు కేటాయించకూడదనే నిబంధనలను కూడా పూర్తిగా ఉల్లంఘించినట్టు తెలుస్తున్నది. అలాగే అసైన్డ్ భూములకు పట్టాలు పొందినవారు అమ్మకాలు సాగించడానికి వీలులేదనే నిబంధనను కూడా విస్మరించారు. థర్డ్‌పార్టీ పట్టాలు చెల్లవని తెలిసినా వారిని కొనసాగిస్తూ వస్తున్నారు.

అప్పనంగా బొక్కేశారు..

ఒకప్పుడు సాధారణంగా ఉన్న వ్యక్తి అసైన్డ్ భూముల్లో పాగావేసి.. అందులోనే ఇల్లీగల్ దందాలు చేస్తూ నేడు అందనంత ఎత్తుకు ఎదిగినట్టు తెలుస్తున్నది. బడా రాజకీయ నాయకులనే శాసించే స్థాయికి చేరుకొన్నాడు. అధికారుల అండదండలు పుష్కలంగా ఉండటంతో అతని ఆగడాలకు అడ్డు లేకుండా పోయిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. ముందుగా మైనార్టీ వ్యక్తివద్ద తన భార్య పేరిట 1.18 ఎకరాల అసైన్డ్ భూమిని కొనుగోలు చేశాడు. అక్కడి నుంచి ఈ భూముల్లో ఆధిపత్యం చెలాయిస్తూ వస్తున్నాడని చెప్తున్నారు. పక్క గ్రామానికి చెందిన మరొకరు దాదాపు 13 ఎకరాల అసైన్డ్ భూమిని గుప్పిట్లో పెట్టుకొన్నట్టు తెలుస్తున్నది. ఆక్రమించిన భూములకు కబ్జాదారుడి కూతురు, అల్లుడు, మరో ఇద్దరి పేరిట ఇటీవల రెవెన్యూ అధికారులు కొత్త పాస్‌పుస్తకాలను మంజూరుచేశారు. ఈ భూములన్నీ మెదక్-బొడ్మట్‌పల్లి ప్రధాన రహదారికి పక్కనే ఉండటం, ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఏడుపాయలకు అతి సమీపంలో ఉండటంతో వీటి విలువ కోట్ల రూపాయలకు చేరింది. ప్రభుత్వ భూముల్లో అక్ర మ కార్యకలాపాలు చేపట్టొద్దు. కానీ ఈ భూముల్లోనే సదరు నేత నిబంధనలకు విరుద్ధంగా ఇటుక బట్టీలను నిర్వహిస్తున్నారు. వందల ట్రాక్టర్ల మట్టిని తరలించి అసైన్డ్ భూమిలో ఇటుక బట్టీలు చేపడుతూ సొమ్ము చేసుకొంటున్నాడు. స్థానికేతరుల వద్ద ఉన్న భూములను బడాబాబుల వద్ద పట్టాలకు మించి ఉన్న స్థలాలను ప్రభుత్వం స్వాధీనం చేసుకొని గ్రామంలోని అర్హులైన దళితులకు కేటాయించాలని వారు పోరాడుతున్నారు.

పత్తాలేని సర్వే రిపోర్టు?

అన్యాక్రాంతమైన తమ భూమిని తిరిగి ఇప్పించాలని కోరుతూ దళితులు ఈ ఏడాది మార్చి 29న పాపన్నపేట తాసిల్దార్, జిల్లా జాయింట్ కలెక్టర్ నగేశ్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. స్పందించిన జేసీ వెంట నే సర్వే చేపట్టాలని ఆదేశాలు జారీచేశారు. కానీ తాసిల్దార్ మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆరోపిస్తూ బాధితు లు ఈ నెల 18న ఆ భూముల్లో ధర్నా కూడాచేశారు. అయితే కబ్జాదారులు, స్థానికేతరుల వద్ద ఉన్న పట్టా లు, వారికి ఎలా వచ్చాయి అన్న విషయాన్ని తెలుసుకోకుండా.. మీవే భూములు అనడానికి ఆధారాలు చూపించండి అని దళితులనే తాసిల్దార్ ప్రశ్నించడం గమనార్హం. 1964 నుంచి తమవద్ద ఉన్న ఫైనల్ పట్టా సర్టిఫికెట్లను, ఆధారాలను, ఆర్వోఆర్, పహాణీల నకళ్ల ను దళితులు సమర్పించారు. అయినప్పటికీ తాసిల్దార్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో తమ ఆందోళనను ఉధృ తం చేస్తామని స్పష్టంచేస్తున్నారు.

ఆక్రమించిన వారిని ఉపేక్షించం


నగేశ్, జిల్లా జాయింట్ కలెక్టర్

పొడ్చన్‌పల్లి గ్రామంలో అసై న్డ్ భూములను ఆక్రమించిన ఎవరినీ ఉపేక్షించం. రికార్డుల ప్రకారం ఎవరికి భూ ములు ఉన్నాయో వారికే కేటాయిస్తాం. ప్రభుత్వం ఒకవేళ ఆ భూములకు సంబంధించి దళితులకు పట్టాలు ఇస్తే వారికే దక్కేలా చర్యలు తీసుకుంటాం. ఒక కుటుంబానికి అసైన్డ్ భూములు కలుపుకొని 5 ఎకరాలకు మించి ఉంటే వారినుంచి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుంది. ఇప్పటికే పొడ్చన్‌పల్లి గ్రామానికి చెందిన అసైన్డ్ భూముల వ్యవహారంపై చర్యలు ప్రారంభించాం. అసైన్డ్‌భూములను కొన్నా, అమ్మినా నేరంగానే పరిగణింపబడుతుంది. ఆ భూముల్లో నిబంధనలకు వ్యతిరేకంగా ఇటుక బట్టీలు నిర్వహించడం, ఇతర కార్యకలాపాలు నిర్వహించడం మా దృష్టికి వచ్చింది. వారిపై కఠినచర్యలు తీసుకుంటాం.ఈ భూములను మేమే సాగుచేసుకున్నాం


తుడుం సంజీవు

రాళ్లు, ముళ్లపొదలతో ఉన్న ఈ భూములను 1968లో ఎన్నో కష్టనష్టాలకు ఓర్చి చదునుచేసి సాగు చేసుకున్నాం. 1970లో అందోల్ తాలూకా కార్యాలయంలో మాకు పట్టాలు జారీచేశారు. ఈ భూముల్లో పంటలు పండించుకుంటూ పిల్లలను సాదుకున్నం. తీవ్ర కరువు ఏర్పడటంతో జీవనోపాధి కోసం కొన్నేండ్లు పట్నం వెళ్లివచ్చేటప్పటికి భూములను పొరుగూరోళ్లు ఆక్రమించారు. అప్పటి నుంచి మా భూములు మాక్కావాలంటూ అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నం.సర్కారోళ్లే మాకు న్యాయం జేయాలే


రెగోటి పద్మారావు

అడివిలెక్క ఉన్న ఈ భూములను పిల్లజల్లా కలిసి మంచిగ జేసుకున్నం. జిట్టపులులు తిరుగంగా పానాలు చేతపట్టుకొని ఎవుసం జేసినం. మాకు చాతగాక ఇడుసవెట్టినం. మా పిల్లలేమో గింతదూరం అప్పుడప్పుడు అచ్చిపోయేటోళ్లు. కానీ ఇప్పుడు మా పొలాలను ఓలో కబ్జా జేసి ఇప్పుడు ఆగమాగం జేస్తుండ్రు. సర్కారోళ్లే మాకు న్యాయం జేయాలే.అక్రమాలకు రెవెన్యూ అధికారుల వత్తాసు


తుడుం భూమన్న

మా తాతలు, తండ్రులు ఈ భూములను సాగు చేశారు. మాకు బుద్ధితెలిసాక కూడా పంటలు పండించారు. కానీ ఇప్పుడు వీటిలో స్థానికేతరులు తిష్టవేశారు. స్థానికేతరులకు అధికారులు పాస్‌పుస్తకాలు ఇచ్చారు. ఫైనల్ పట్టా సర్టిఫికెట్లు లేకుండా కేవలం కాస్తులో ఉన్నారన్న కారణం చూపిస్తూ స్థానికేతరులను ప్రోత్సహిస్తున్నారు. ఓ పక్క ప్రభుత్వం రెవెన్యూ ప్రక్షాళనకు శ్రీకారం చుడితే అధికారులు ఇష్టారీతిగా వ్యవహరించడం దారుణం.

1472
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles