వారసత్వ భూమి మాయం


Fri,July 12, 2019 02:33 AM

Farmers Struggles Revenue Officers Neglect For Pattadar Passbooks

-కాస్తులో ఉన్నా.. ఆన్‌లైన్‌లో లేదు
-4.13 ఎకరాలను మరొకరికి పట్టాచేసిన అధికారులు
-కలెక్టర్ ఆదేశాలను లెక్కచేయని రెవెన్యూ సిబ్బంది
-మనోవేదనతో మంచంపట్టిన వృద్ధ రైతు
-ఏడాదిగా తాసిల్ చుట్టూ కొడుకు ప్రదక్షిణ
-ఆదిలాబాద్ జిల్లా కాన్పమేడిగూడలో రైతు దుస్థితి

తాత ముత్తాతల నుంచి వారసత్వంగా వచ్చిన భూమి రికార్డుల్లో మాయమైంది. కాస్తులో ఉన్నా.. ఆన్‌లైన్‌లో కానరాక రైతుబంధు దూరమైంది. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ వృద్ధ రైతును మంచం పట్టేలాచేసింది. సమస్యను పరిష్కరించాలని స్వయంగా కలెక్టరే ఆదేశించినా తాసిల్ కార్యాలయం అధికారులు పట్టించుకోవడంలేదని ఆదిలాబాద్ జిల్లా జైనథ్ మండలం కాన్పమేడిగూడ గ్రామానికి చెందిన గోపతి కిష్టన్న కుమారుడు నర్సింగ్ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఏడాదిగా పాత పాస్‌పుస్తకం పట్టుకొని తాసిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా స్పందించేవారు కరువయ్యారని చెప్తున్నారు. రెవెన్యూ అధికారులు లంచాలు తిని.. తమ వారసత్వ భూమి 4.13 ఎకరాలను మరొకరికి పట్టాచేశారని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: ఆదిలాబాద్ జిల్లా, జైనథ్ మండలం, కాన్పమేడిగూడ గ్రామానికి చెందిన గోపతి కిష్టన్న వయసు 80 ఏండ్లు. ప్రస్తుతం నడువలేని స్థితిలో ఉన్నారు. ఈయనకు ఒక్కగానొక్క కొడుకు నర్సిం గ్ ఉన్నారు. కిష్టన్నకు గ్రామంలోని సర్వే నంబర్ 19లో వారసత్వంగా వచ్చిన 4.13 ఎకరాల భూమి ఉన్నది. భూరికార్డుల ప్రక్షాళన సమయంలో కిష్టన్నకు కొత్త పాస్‌పుస్తకం అందలేదు. ఈ విషయమై రెవెన్యూ అధికారులను ఆశ్రయించగా, కార్యాలయంలో ఫిర్యాదుచేయాలని గ్రామసభలో సూచించారు. గోపతి కిష్టన్న కొడుకు నర్సింగ్ తాసిల్దార్ కార్యాలయానికి వెళ్లి ఫిర్యాదుచేశారు. ఆన్‌లైన్‌లో పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. సర్వే నంబర్ 19లో 4.13 ఎకరాల భూమి కిష్టన్న పేరిట లేదని చెప్పారు. దీంతో బాధిత రైతు అవాక్కయ్యారు. కలెక్టరేట్‌లోని ప్రజావాణిలో తమ సమస్యను వివరిస్తూ దరఖాస్తుచేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ సమస్యను పరిశీలించాలని ఆర్డీవోను ఆదేశించారు. ఆర్డీవో.. తాసిల్దార్‌కు ఆదేశాలు జారీచేశారు. అయినప్పటికీ తాసిల్దార్ తనకేమీ తెలియదంటూ చేతులెత్తేశారు. కిందిస్థాయి అధికారులు నర్సింగ్‌ను ఏడాదిగా రేపు మాపు అంటూ తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిప్పించుకొంటున్నారు. తమ అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని అధికారులే చేతివాటం ప్రదర్శించి 4.13 ఎకరాలను మరొకరి పేరిట మార్చారని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

కాళ్లు మొక్కినా కనికరం లేదు


గోపతి నర్సింగ్

వారసత్వంగా వచ్చిన 4.13 ఎకరాల భూమి మా నాయిన కిష్టన్న పేరిట ఉన్నది. ఈ భూమి ఆన్‌లైన్‌లో కానరావడం లేదని రెవెన్యూ అధికారులు చెప్తున్నారు. అప్పటినుంచి మా నాయిన మానసిక క్షోభకుగురై మంచం పట్టారు. నేను ఏడాదిగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మేము సాగు చేసుకొంటున్న మా భూమి ఆన్‌లైన్‌లో కనిపించకపోవడం విచిత్రం. ఎన్నోసార్లు అధికారుల కాళ్లు మొక్కిన. కొత్త పాస్‌పుస్తకం వచ్చినంక పైసలు కూడా ఇస్తామన్న. అయినా అధికారులు కనికరిస్తలేరు. గతంలో ప్రజావాణిలో కలెక్టర్‌కు ఫిర్యాదు కూడా చేసిన. సమస్యను పరిష్కరించాలని ఆయన ఆదేశించినా అధికారులు పట్టించుకొంటలేరు. రెవెన్యూ అధికారులే లంచాలు తిని మా భూమిని మరొకరి పేరిట మార్చారు. మాకు తీరని అన్యాయంచేశారు.
- గోపతి నర్సింగ్, కాన్పమేడిగూడ, జైనథ్ మండలం, ఆదిలాబాద్ జిల్లా

పేదలకు మంచిచేస్తున్న సీఎం కేసీఆర్


కాటిపెల్లి రఘపతిరెడ్డి, మెట్‌పల్లి

రెవెన్యూ, పంచాయతీరాజ్‌శాఖల్లో అధికారుల అవినీతిని అరికట్టడానికి సీఎం కేసీఆర్ సార్ చేస్తున్న కృషి అభినందనీయం. రెవెన్యూలో మార్పులు జరిగితే పేదలందరికీ మంచి జరుగుతుంది. రెవెన్యూశాఖలో భూసమస్యలు చాలా ఉన్నాయి. వాటి పరిష్కారం కోసం కార్యాలయానికి ఎప్పుడుపోయినా అధికారులు రేపు మాపు అంటూ పనులు ముందుకు సాగనివ్వడం లేదు. సమస్యలను పరిష్కారించేందుకు సీఎం కేసీఆర్ నడుం బిగించడం శుభ పరిణామం.
- కాటిపెల్లి రఘపతిరెడ్డి, మెట్‌పల్లి, జగిత్యాల జిల్లా

పేద రైతులకు న్యాయం


మామిడి చిన్నారెడ్డి

చాలా గ్రామాల్లో భూసమస్యలు ఏండ్ల తరబడి పేరుకుపోయి ఉన్నాయి. ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో అధికారులు చాలా వరకు సమస్యలు పరిష్కరించారు. ఇంకా చాలా గ్రామాల్లో భూసమస్యలతో బాధపడే రైతులకు ధర్మగంట మంచి అవకాశంగా మారింది. నమస్తే తెలంగాణలో ప్రచురితమవుతున్న కథనాలపై రెవెన్యూ అధికారులు వెంటనే స్పందించి పరిష్కరించడం హర్షణీయం.
- మామిడి చిన్నారెడ్డి, రైతు, మల్లాపూర్, జగిత్యాల జిల్లా

1171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles