రికార్డులను సరిచేయండి సారూ..


Mon,August 12, 2019 01:33 AM

Farmers Struggles Revenue Officers Neglect For Land Registration

-వారసత్వ భూమి 35 ఎకరాలు మాయం
-అధికారుల చుట్టూ తిరిగి అలిసిపోయాం
-మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లివాసి అనిల్ ఆవేదన

హైదరాబాద్ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: వారసత్వంగా వస్తున్న అసైన్డ్ భూమి 35 ఎకరాలను రికార్డుల నుంచి తొలగించి తమ కుటుంబానికి అన్యాయంచేశారని మెదక్ జిల్లా తూప్రాన్ మండలం నర్సంపల్లివాసి ఎడ్ల అనిల్ ఆవేదన వ్యక్తంచేశారు. సర్వే నంబర్ 69లో ఎడ్ల రుక్కయ్యకు 35 ఎకరాల భూమి ఉండగా, అతని తదనంతరం ఆయన కుమారులైన సూర్యప్రకాశ్, మహేందర్, చంద్రమౌళి, రామ్మోహన్ (భాస్కర్), శ్రీకాంతయ్య, అనీల్‌కుమార్, నవీన్‌కుమార్ వారసులుగా ఉన్నారు. అయితే మూడు దశాబ్దాలుగా వీరి పేరిట ఉన్న భూమిని అధికారులు రికార్డుల నుంచి తొలగించారు. తమ భూరికార్డులను తొలగించారని అధికారుల చుట్టూ తిరిగి, వినతిపత్రాలు ఇవ్వగా.. క్షేత్రస్థాయి పరిశీలనకు వచ్చిన వీఆర్వో, సర్వేయర్‌కు గ్రామస్థులు వాస్తవాలు వివరించినప్పటికీ సరిచేయడం లేదని బాధితుడు పేర్కొన్నారు. 2005-06 వరకు తమ పేరిట రికార్డులు ఉన్నప్పటికీ అనంతరం వాటిని మాయం చేశారని వాపోయారు.

ఈ విషయమై అనేకసార్లు తాసిల్దార్‌ను కలిసినప్పటికీ పట్టించుకోవడం లేదని, ఈ అక్రమాలకు స్థానిక వీఆర్వో సూత్రధారి అని ఆరోపించారు. వారసులకు ఒక్కొక్కరికీ ఐదెకరాల భూమి గత రికార్డుల్లో ఉండగా, వాటిని తొలగించారని, దీంతో తాము రైతుబంధు కోల్పోతున్నామని అన్నారు. గతంలో ఈ భూములకు సంబంధించి గజ్వేల్ తాసిల్ కార్యాలయం 3 డిసెంబర్ 1969లో భూమంజూరీ పట్టా సర్టిఫికెట్ ఫైల్ నంబర్ ఏ-/5738/68తో నర్సంపల్లి శివారులో 5 ఎకరాల భూమి రుక్కయ్య కుమారుడు శ్రీకాంతయ్యకు, 23 డిసెంబర్ 1969న సూర్యప్రకాశ్, మహేందర్, చంద్రమౌళి, రామ్మోహన్, అనీల్‌కుమార్, నవీన్‌కుమార్‌కు భూమంజూరీ పట్టా సర్టిఫికెట్ అందజేశారని చెప్పారు. అయితే వీటిని రికార్డుల్లో నుంచి తొలగించారన్నారు. దీనిపై 1996లో తూప్రాన్‌లోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి లోన్ కూడా తీసుకున్నట్టు తెలిపారు. 2009లో అకస్మాత్తుగా రుక్కయ్య, కొంతకాలానికి శ్రీకాంతయ్య కూడా మృతి చెందడంతో ఈ భూ బాధ్యతలు చంద్రమౌళి అలియాస్ చంద్రమోహన్ తీసుకొని సాగుచేస్తున్నారని వివరించారు. ఈ క్రమంలో అధికారులు రికార్డులను మాయంచేసి ఇబ్బందులకు గురిచేస్తున్నారని వాపోయారు. రికార్డులను సరిచేసి తమ భూమిని ఇప్పించి న్యాయంచేయాలని బాధితుడు కోరుతున్నారు.

రీ అసైన్‌చేశారు

ఎడ్ల రుక్కయ్య వారసులు మాపై చేస్తున్న ఆరోపణల్లో వాస్తవం లేదు. క్షేత్రస్థాయి పరిశీలనలో సర్వే నంబర్ 69లో భూమి ఉన్న మాట వాస్తమేనని తేలింది. గతంలో తూప్రాన్ మండలంలో భూమి లేదు. ఇది గజ్వేల్ మండలం నుంచి బదలాయించబడింది. కనీసం 15 ఏండ్ల క్రితమే వీరి పేర్లు రికార్డుల్లో నుంచి తొలగించి, ఆ భూములు ఇతరులకు అసైన్ చేశారు. మోఖాలో ఇతర రైతులున్నారు. పాస్‌పుస్తకాలు కూడా ఉన్నాయి. మేము రికార్డు అధారంగా రెవెన్యూ చట్టాలకు అనుగుణంగా పనిచేస్తున్నాం. మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోగానే విచారణ చేపట్టాం. ఇక్కడ భూమి తక్కువగా ఉన్నది. వాస్తవ భూమికంటే పాస్‌పుస్తకాల్లో ఎక్కువగా నమోదైంది.
- వెంకటేశ్, వీఆర్వో

274
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles