ఐదెకరాల ఆసామిని..92 ఎకరాల భూస్వామిని చేశారు


Sun,August 11, 2019 02:25 AM

Farmers Struggles Revenue Officers Neglect For Land Registration

-రంగారెడ్డి జిల్లా కేశంపేటలో రెవెన్యూ అధికారుల నిర్వాకం
-లేని భూమిని ఆన్‌లైన్‌లో ఎక్కించారు
-ఉన్నది ఐదెకరాల 39.50 గుంటలు.. ఆన్‌లైన్‌లో 92 ఎకరాలు
-పంటపెట్టుబడి సాయం అందక అన్నదాత ఆందోళన

ఐదెకరాల సామాన్య ఆసామిని 92 ఎకరాల భూస్వామిని చేశారు రంగారెడ్డి జిల్లా కేశంపేట రెవెన్యూ అధికారులు. రైతుకు సుమారు 87 ఎకరాలు బోనస్‌గా ఇచ్చారు. లేని భూమిని రికార్డుల్లో సృష్టించారు. రికార్డుల ప్రకారం భూములను ఆన్‌లైన్ చేయాల్సిన అధికారులు ఇష్టమొచ్చినట్టుగా వ్యవహరించారు. కేశంపేట మండలం మీనమోనిపల్లి రైతుకు అంకెలగారడీ చూపించి.. రైతుబంధు సాయానికి దూరంచేశారు. అక్రమాస్తుల కేసులో జైలుకెళ్లిన లావణ్య.. తాసిల్దార్‌గా ఉన్న సమయంలోనే ఈ ఘటన చోటుచేసుకోవడం గమనార్హం.
Dharmaganta
కేశంపేట: రంగారెడ్డి జిల్లా కేశంపేట మండలం చౌలపల్లి గ్రామ పరిధిలోని మీనమోనిపల్లికి చెందిన ఆనపోసల బుచ్చయ్య అనే రైతుకు సర్వే నంబర్లు 52, 53, 57, 58, 62, 63లలో ఐదెకరాల 39.50 గుంటల వారసత్వ భూమి ఉన్నది. పాత పట్టాదారు పాస్‌పుస్తకాలతోపాటు రికార్డుల్లో భూమి సరిగ్గానే ఉన్నా ఇటీవల ఆన్‌లైన్‌చేసే క్రమంలో అధికారులు సర్వే నంబర్ 52లో బుచ్చయ్య పేరిట ఉన్న ఎకరంతోపాటు మరో 86 ఎకరాల 28 గుంటలను అదనంగా ఆన్‌లైన్‌లో ఎక్కించారు. దీంతో రైతు 5.39 ఎకరాల నుంచి సుమారు 92 ఎకరాలకు పట్టాదారైపోయారు. వాస్తవానికి 52 సర్వే నంబర్‌లో 19 ఎకరాల భూమి ఉన్నది. ఆ భూమికి సరిపడా పట్టాదా ర్లు ఉన్నారు. బుచ్చయ్య పేరిట ఆన్‌లైన్‌లో ఎక్కిన 86 ఎకరాల 28 గుంటల భూమి లేనేలేదు. గత మార్చిలో బ్యాంకులో లోను కోసం బుచ్చయ్య ఆన్‌లైన్‌లో ఆర్వోఆర్ తీసుకోగా ఈ విషయం తెలిసింది. రైతు వెంటనే అప్పటి తాసిల్దార్ లావణ్య, వీఆర్వో రాములును సం ప్రదించగా.. అదనంగా ఎక్కిన భూమిని సరిచేస్తామని బుజ్జగించారు. బుచ్చయ్య రోజు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా అధికారులు సమస్యను పరిష్కరించడం లేదు. ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం ఐదు నుం చి పదెకరాల భూమి ఉన్న రైతులకు మొదట గా పంట సహాయాన్ని బ్యాంకులో జమచేసిం ది. ఐదు నుంచి 92 ఎకరాల భూమికి యజమానిగా మారిన బుచ్చయ్య వాస్తవ భూమికి పెట్టుబడిసాయం అందలేదు.

అధికారుల నిర్లక్ష్యానికి బలయ్యాను

విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరించి లేని భూమిని అంటగట్టిన అధికారుల వల్లే నాకు పంటసాయం రాకుండా పోయింది. పెట్టుబడి కోసం నానా అవస్థలు పడ్డాను. జరిగిన తప్పును సరిచేయాలని రెవెన్యూ అధికారుల చుట్టూ నెలల తరబడి తిరిగినా ఫలితం లేకపోయింది. ఆర్థిక స్థోమతలేని నాకు పంటసాయం రాకుండాచేసిన తాసిల్దార్ లావణ్య, వీఆర్వో రాములుపై చర్య తీసుకొని న్యాయంచేయాలి.
- ఆనపోసల బుచ్చయ్య, రైతు, మీనమోనిపల్లి, కేశంపేట మండలం


అదనపు భూమిని తొలగిస్తాం

బుచ్చయ్య పేరిట ఆన్‌లైన్‌లో అదనంగా ఎక్కిన 86 ఎకరాల భూమిని తొలగించేందుకు ఉన్నతాధికారులతో మాట్లాడాం. ఆ భూమికి సంబంధించిన వివరాలను ఆర్డీవో లాగిన్‌లో పెట్టాం. అనుమతులు రాగానే ఎక్కువగా ఉన్న భూమిని రైతు ఖాతా నుంచి తొలగిస్తాం. అదనంగా ఆన్‌లైన్‌లో ఎక్కిన భూమికి పంటసాయం ఇవ్వకూడదని వ్యవసాయశాఖ అధికారులకు తెలియజేశాం. రైతుకు వాస్తవంగా ఉన్న ఐదెకరాల 39.50 గుంటల భూమికి రావాల్సిన పంటసాయం గురించి ఉన్నతాధికారులతో మాట్లాడుతాం.
- ఆంజనేయులు, కేశంపేట తాసిల్దార్

రెవెన్యూ ప్రక్షాళన అవసరం

రెవెన్యూశాఖలో అవినీతి పోవాలంటే తక్షణమే ప్రక్షాళనచేయాలి. స్థానిక రెవెన్యూ అధికారులు ఏ చిన్న పనిచేయాలన్నా పైసలు ఇవ్వనిదే ఫైల్ కదిలించని పరిస్థితికి దిగజారారు. అనేక ఏండ్లు ఇదే పరిస్థితి. ప్రాంతాన్ని బట్టి ఎకరానికి ఇంత ఇస్తేనే పనిచేస్తామని చెప్పడం మరీ దారుణం. కడుపు కట్టుకొని ఎండనక, వాననకు, చలి అనక కష్టించి పనిచేసి దేశానికి అన్నంపెట్టే రైతన్నను ఇబ్బందుల పాలుచేయడం సరికాదు. రైతుల బాధలు గుర్తించిన ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు రెవెన్యూశాఖ ప్రక్షాళనకు పూనుకోవడం చాలా సంతోషం. వీలైనంత త్వరగా ఈ పనిచేసి అన్నదాతలకు మేలుచేయాలి.
- మురళీమనోహర్, హైదరాబాద్

ప్రభుత్వ సంస్కరణలు భేష్రాపోలు యాదగిరి, వేములపల్లి, నల్లగొండ జిల్లా

రైతు సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తున్న రెవెన్యూశాఖను ప్రక్షాళన చేయాల్సిన అవసరమున్నది. ఇందుకు ప్రభుత్వం తీసుకొంటున్న నూతన సంస్కరణలను అందరూ స్వాగతించాలి. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యపు వైఖరిని పోగొట్టేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ చర్యలు తీసుకోవడం శుభపరిణామం. ఇప్పటికే ధర్మగంట ద్వారా చాలామంది రైతులకు ఉన్న భూసమస్యలు తీరాయి. రైతులకు అవినీతి అధికారులను దూరం చేయాలనే సదుదేశంతో పనిచేస్తున్న సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి.
కొండంత అండగోవిందు, నందికొండ, నల్లగొండ జిల్లా

భూసమస్యలతో ఇబ్బందులు పడుతున్నవారికి నమస్తే తెలంగాణ చేపట్టిన ధర్మగంట కొండంత అండగా నిలిచింది. ఇందులో ప్రచురితమవుతున్న కథనాలపై అధికారులు తక్షణమే స్పందించి పరిష్కారం చూపుతుండటం సంతోషంగా ఉన్నది. సీఎం కేసీఆర్ తలపెట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో చాలా వరకు సమస్యలు తీరాయి. అవినీతి అంతంకావాలంటే రెవెన్యూశాఖను ప్రక్షాళనచేయాల్సిందే.

1820
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles