వీఆర్వో కక్కుర్తి.. రైల్వే ఉద్యోగికి శాపం!


Fri,July 12, 2019 01:22 AM

Farmers Meets Namaste Telangana Dharmaganta

-సాదాబైనామా ద్వారా దొంగపట్టాలు చేసిన రెడ్డిపల్లి వీఆర్వో
-ఫిర్యాదుచేసినా పట్టించుకోని వీణవంక రెవెన్యూ అధికారులు
-న్యాయంచేయాలని ధర్మగంటను ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రెవెన్యూ సిబ్బంది కాసులకు కక్కుర్తిపడితే.. తిమ్మిని బమ్మిని చేసేస్తారు. అలాంటి ఒక అవినీతి రెవెన్యూ ఉద్యోగి లంచం తీసుకొని రైల్వే మాజీ ఉద్యోగి జీవితాన్ని కష్టాలపాలుచేశాడు. పిల్లల భవిష్యత్‌కు భరోసా ఉంటుందన్న ఉద్దేశంతో విడుతలవారీగా డబ్బు చెల్లించి కొన్న భూమిని.. కాసులకు కక్కుర్తిపడిన వీఆర్వ్తో సాదాబైనామా ద్వారా ఇతరులకు దొంగ పట్టాచేశారు. విషయాన్ని ఆలస్యంగా తెలుసుకొన్న బాధితుడు తాసిల్దార్ కార్యాలయం లో ఫిర్యాదుచేసినా పట్టించుకొనే నాథుడే కరువయ్యాడు. కరీంనగర్ జిల్లా వీణవంక మండలం రెడ్డిపల్లికి చెందిన ఒడ్డేపల్లి రాజ య్య దీనగాథ ఆయన మాటల్లోనే.. నా పేరు ఒడ్డేపల్లి రాజయ్య. రైల్వే ఉద్యోగం చేస్తూ 1985లో కరీంనగర్ జిల్లా వీణవంక మం డలం రెడ్డిపల్లి పరిధిలోని సర్వే నంబర్ 195 లో మూడెకరాల భూమిని కురిమిల్ల శంకరయ్య, గుంటి స్వామి వద్ద రూ.29,712 చెల్లించి కొన్నాను. ఉద్యోగరీత్యా వేర్వేరు ప్రాంతాల్లో ఉండటం, రెడ్డిపల్లికి రాలేకపోవడం వంటి కారణాలను అలుసుగా తీసుకొని కొందరు నా భూమిపై కన్నేశారు. దాసారపు రమ్య అనే మహిళ సాదాబైనామా ద్వారా ఎకరం భూమిని పట్టా చేయించుకోగా.. మరో రెండెకరాలను ఒడ్డేపల్లి ఓదెలు దొంగ పట్టా చేయించుకొన్నారు. ప్రస్తుతం జిల్లా మెజిస్ట్రేట్ కోర్టులో కేసు పెండింగ్‌లో ఉన్నది. అదేవిధంగా 1986లో మాడ మల్లారెడ్డి వద్ద సర్వే నంబర్ 191లో 28 గుంట లు, 1987లో మాడ వెంకటరాజిరెడ్డి వద్ద రెండెకరాలు, మాడ సంజీవరెడ్డి వద్ద 32 గుంటల భూమిని కొన్నాను.

రెవెన్యూ అధికారులు 191సీ అనే కొత్త సర్వే నంబర్ సృష్టించి ఫోర్జరీ సంతకాలతో ఒడ్డేపల్లి లక్ష్మి అనే మహిళ పేరిట రెండెకరాలను సాదాబైనామా పట్టా చేశారు. ఒడ్డేపల్లి భారతమ్మ అనే మహిళ మరో 2.20 ఎకరాలను పట్టా చేయించుకొన్నారు. దీనిపై జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదుచేయగా ప్రస్తుతం ఆయన వద్ద పెండింగ్‌లో ఉన్నది. ఒడ్డేపల్లి సంపత్‌కుమార్ అనే రౌడీషీటర్.. నన్ను, నా కుమారుడు గోపీనాథ్‌ను విపరీతంగా కొట్టి నా పేరిట ఉన్న 192 సర్వే నంబర్‌తోపాటు 192ఏ, 193, 194 భూములను దున్నకుండా అడ్డుకొంటున్నారు. రెడ్డిపల్లి వీఆర్వో శంకరయ్య పలువురి నుంచి లంచం తీసుకొని దొంగ పట్టాలుచేశారు. నా భూములకు సంబంధించి విచారణ జరిపి దొంగ పట్టాలను రద్దుచేసి నాకు న్యాయంచేయాలి. సర్వే నంబర్ 193లోని 4.18 ఎకరాల భూమిని నా కుమారిడి పేరిట పట్టా మార్పిడి చేయడానికి తాసిల్దార్, ఆర్డీవోకు దరఖాస్తు చేసుకొన్నాను. ఆరునెలలైనా పట్టా మార్పిడి చేయడంలేదు. రెవెన్యూ సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు తగిన చర్యలు తీసుకొని నాకు న్యాయంచేయాలని కోరుతున్నాను.

740
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles