గడికింత భూమి మాయం!


Wed,June 19, 2019 02:43 AM

Farmers Meets Dharmaganta For Revenue Officer Neglect Land Registration

-అసలైన వారసులకు హక్కులేకుండా చేశారు
-చొప్పదండిలో రెవెన్యూ అధికారుల లీలలు
-ధర్మగంటను ఆశ్రయించిన బాధితులు

భూమి పెరుగును.. అని నిరూపించిన అధికారులను చూశాం! ఇది.. ఉన్న భూమిని క్రమక్రమంగా మాయం చేసిన జాదూల కథ! రెవెన్యూ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనేందుకు మరో ఉదాహరణ! ఒకరి పేరిట ఉన్న భూమిని ఏడాదికి కొంత చొప్పున మరొకరి పేరిట పహాణీలో రాసి.. అసలు పట్టాదారులకు ఏకంగా భూమి లేకుండా చేశారు కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం అధికారులు! పోనీ ఏమైనా ఆధారాలను బట్టి భూమిని ఇతరుల పేరిట రాశారా? అంటే అదీలేదు! తన బిడ్డలకు వారసత్వంగా దక్కాల్సిన భూమి.. ఇతరుల చేతికి వెళ్లడంతో బాధితురాలు.. అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయింది! దీంతో తన ఇద్దరు కుమారులతో కలిసి ధర్మగంటను ఆశ్రయించిన బాధితురాలు.. తమకు జరిగిన అన్యాయాన్ని మొరపెట్టుకున్నారు!

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ : కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన పిల్లలమర్రి చంద్రమౌళికి సర్వేనంబర్ 920లో 17.25 ఎకరాల భూమి ఉన్నది. 1988-89 వరకు రెవెన్యూ రికార్డుల్లో ఇతని పేరిట మొత్తం విస్తీర్ణం వచ్చింది. ఇతనికి సత్తయ్య, బక్కయ్య అనే ఇద్దరు కుమారులున్నారు. అయితే చంద్రమౌళి తమ్ముడు కములయ్యకు సంతానం లేకపోవడంతో అతనికి చిన్నకుమారుడైన బక్కయ్యను దత్తత ఇచ్చారు. తమ్ముడి ఆస్తి చిన్నకుమారునికి, తన ఆస్తి పెద్దకుమారునికి అనుకుని సర్దుబాటు చేసుకున్నారు. సత్తయ్యకు బాపు ఒక్కడే కుమారుడు. కాలక్రమేణా వీరంతా మరణించారు. ఇపుడు చంద్రమౌళి ఆస్తికి వారసులుగా బాపు భార్య పిల్లలమర్రి లక్ష్మి, ఆమె సంతానమైన మారుతి, నరేశ్ ఉన్నారు. తాత ఆస్తి తమకే దక్కాలని భావించిన వీరిద్దరు బాపు బతికి ఉన్నప్పుడే తమ పేరిట విరాసత్ చేయించుకునేందుకు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ ఫలితం లేకపోయింది. పైపెచ్చు రెవెన్యూ అధికారులు బాపు పేరిట ఉన్న భూమిని చనిపోయిన బక్కయ్య పేరిట ఏటా కొంత చొప్పున క్ర మంగా మార్చుకుంటూ వచ్చారు. 1988-89లో చంద్రమౌళి పేరిట ఉన్న 17.25 ఎకరాల భూమి లో 5.02 ఎకరాలను 1996-97 నాటికి బక్క య్య పేరిట మార్చిన రెవె న్యూ అధికారులు.. 1998-99లో చంద్రమౌళి పేరిట కేవలం 1.10 ఎకరాలు మాత్రమే రాశారు. అప్పటికి బక్కయ్య పేరిట 5.02 ఎకరాలు ఉన్నట్టు చూపిన అధికారులు మిగతా భూమిని ఎవరి పేరిటా రాయలేదు. ఇక 2003-04 నుంచి 2018-19 వరకు చంద్రమౌళి పేరిట 1.10 ఎకరాలు, బక్కయ్య పేరిట 15.02 ఎకరాలు ఉన్నట్టు రాస్తూ వస్తున్నారు. విచిత్రం ఏమిటంటే చంద్రమౌళి తండ్రి పేరును నర్సయ్యగా, బక్కయ్య తండ్రి పేరును కములయ్యగా పహాణీలో రాస్తున్నారు. 1988-89 నుంచి ఇప్పటివరకు ఈ భూమి కాస్తు కాలంలో మాత్రం బాపు పేరిటనే వస్తున్నది.
Dharmaganta

అభ్యంతరం ఎందుకో?

తమకు చెందాల్సిన భూమిని బక్కయ్య పేరిట నమోదు చేసుకుంటూ వచ్చిన రెవెన్యూ అధికారులు.. కాస్తు కాలమ్‌లో మాత్రం తన భర్త పేరునే చూపుతున్నారని, అలాంటపుడు ఆ భూమి కబ్జాలో ఉన్నట్టుగా పరిగణించి తనపేరిట రాయడంలో రెవెన్యూ అధికారులకు అభ్యంతరం ఏమిటని బాపు భార్య లక్ష్మి ప్రశ్నిస్తున్నారు. అదే సర్వేనంబర్ 921లో చంద్రమౌళి పేరిట ఉన్న ఎకరా భూమిని తనపేరిట పట్టాచేసి ఇచ్చిన అధికారులు.. సర్వేనంబర్ 920లో ఉన్న భూమిని పట్టా చేయడంలో తీవ్రమైన ఇబ్బందులకు గురిచేస్తున్నారని లక్ష్మి, ఆమె కుమారులు మారుతి, నరేశ్ వాపోతున్నారు. తమ ముత్తాత చంద్రమౌళికి, తాత సత్తయ్యకు తాము మాత్రమే వారసులమని, ఇదే భూమి విషయమై ఇతరులతో తగాదా వచ్చినపుడు కోర్టు కూడా స్పష్టమైన తీర్పు ఇచ్చిందని, ఈ తీర్పు ప్రతిని కూడా సమర్పించినప్పటికీ రెవెన్యూ అధికారులు కనికరించడంలేదని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. చంద్రమౌళి పేరిట ఉన్న ఆస్తిలో బక్కయ్య వారసులకు ఎలాంటి వాటా రాదని వారు చెప్తున్నారు. బక్కయ్య వారసులు చంద్రమౌళి పేరిట ఉన్న ఇతర భూములను కూడా పంచుకున్నారని, ఇది పూర్తిగా తమ వాటా కిందికి వస్తుందని లక్ష్మి ఆమె కొడుకులు పేర్కొంటున్నారు. ఇప్పటికీ ఇదే భూమిలో పంటలు సాగుచేస్తున్న తమకు బక్కయ్య వారసుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేదని, అధికారులు కావాలనే తమను మానసిక క్షోభకు గురిచేస్తున్నారని లక్ష్మి వాపోతున్నారు. ఇప్పటికైనా తమ భూ మిపై పూర్తిస్థాయిలో విచారణ జరిపి తమకు న్యాయం చేయాలని జిల్లా ఉన్నతాధికారులను కోరుతున్నారు.

ధర్మగంట మోగుతూనే ఉండాలి


లింగంపెల్లి నాగరాజు

నమస్తే తెలంగాణ ధర్మగంటలో వస్తున్న కథనాలతో రెవెన్యూ అధికారుల పనితీరు క్రమంగా మారుతున్నది. అధికారుల తీరుతో భూ సమస్యలు ఎదురై ఎంతమంది ఎలా వేధింపులకు గురవుతున్నారో ప్రత్యేక కథనాలతో ప్రచురిస్తుండటం చాలా గొప్ప విషయం. దీనివల్ల అధికారులు.. రైతుల వద్దకే వెళ్లి పనులు పూర్తి చేస్తున్నారు. అదంతా ధర్మగంట పుణ్యమే. ముఖ్యమంత్రి కేసీఆర్ తీసుకున్న రెవెన్యూ ప్రక్షాళన నిర్ణయం సరైనదే. గ్రామాల్లో పేరుకుపోయిన రైతుల సమస్యలు పూర్తిస్థాయిలో పరిష్కారమయ్యే వరకు ఈ ధర్మగంట మోగుతూనే ఉండాలి. రెవెన్యూ అధికారులు సోమరితనం, లంచగొండి తనం వదిలి రైతులకు సేవచేసేలా కృషిచేస్తున్న ముఖ్యమంత్రికి, నమస్తే తెలంగాణ పత్రికకు ధన్యవాదాలు.
- లింగంపెల్లి నాగరాజు, న్యాయవాది (గునుకుల కొండాపూర్,గన్నేరువరం మండలం, కరీంనగర్ జిల్లా)

కొత్త చట్టం తీసుకురావాల్సిందే


భైరి సుధాకర్, జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షుడు

రెవెన్యూ వ్యవస్థ ప్రక్షాళన కోసం సీఎం కేసీఆర్ కొత్త రెవెన్యూ చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. రెవెన్యూలో పాతకాలపు చట్టాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పైసా ఇవ్వనిదే పని జరుగడంలేదు. భూ సమస్యలన్నీ పరిష్కరించేలా కొత్త చట్టం తెస్తే స్వాగతిస్తాం. రైతులకు నష్టం జరుగకుండా రెవెన్యూ రికార్డులను సరిచేయాలి. సుంకరి నుంచి వీఆర్వో అయిన వారికి చదువు రాక, భూ లెక్కలు తెలియక, అవగాహన లేకపోవడంతో తేడాలు వస్తున్నాయి. ఒకరి పేరుకు మరొకరి పేరు రావడం, ఉన్న భూమికి తక్కువగానీ, ఎక్కువగానీ వేసి బుక్కులు అందించడంతో రైతులు ఆఫీసుల చుట్టూ తిరుగాల్సి వస్తున్నది. వెంటనే తప్పులను సరిచేసి రైతులకు మళ్లీ పాస్ బుక్కులు అందించాలి.
- భైరి సుధాకర్, జిల్లా ఎకనామిక్స్ ఫోరం అధ్యక్షుడు,కాంట్రాక్టు అధ్యాపకుడు, హుజూరాబాద్‌టౌన్, కరీంనగర్ జిల్లా


అధికారుల్లో చలనం వచ్చింది


నారి నాగేందర్, మోటకొండూర్

ధర్మగంటతో రెవెన్యూ అధికారుల్లో చలనం వచ్చింది. గతంలో రెవెన్యూ సమస్యల పరిష్కారానికి వెళ్లే రైతులను అధికారులు అరిగోస పెట్టేవారు. రేపు మాపు అంటూ కాలం వెళ్లదీసేవారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళనతో అధికారుల్లో బాధ్యత పెరిగితే, ధర్మగంటతో చలనం రావడంతోపాటు సమస్యలు త్వరితగతిన పరిష్కారమవుతున్నాయి.
- నారి నాగేందర్, మోటకొండూర్, యాదాద్రి భువనగిరి జిల్లా

1557
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles