భూదాన పత్రం సృష్టించి దోచేశారు


Mon,June 17, 2019 01:55 AM

Farmers Meets Dharmaganta For Revenue Officer Neglect Land Registration

-పట్టించుకోవాల్సిన అధికారులే పెడచెవిన పెడుతున్నరు
-బాధితుడికి ప్రొసీడింగ్ ఇచ్చి.. ఆన్‌లైన్‌లో తొలిగింపు
-ధర్మగంటను ఆశ్రయించిన బాధితుడు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: రంగారెడ్డి జిల్లా ఆమన్‌గల్ మండలం చింతలపల్లి గ్రామానికి చెందిన కొప్పు పెద్ద జంగయ్యకు సర్వే నంబర్ 1116 లో 2-16 ఎకరాల భూమి వారసత్వంగా సంక్రమించింది. పెద్ద జంగయ్య 2007లో మరణించడంతో ఆయన కొడుకైన మహేందర్ సదరుభూమిని తన పేరిట విరాసత్‌చేయాలని రెవెన్యూ అధికారులకు దరఖాస్తు చేసుకొన్నారు. దాదాపు ఏడెనిమిదేండ్లు తిప్పుకున్న తర్వాత 2015లో ఎమ్మార్వో సదరు భూమి మహేందర్‌కే చెందుతుందని విరాసత్ ప్రొసీడింగ్ జారీచేశారు. ఎమ్మార్వో ప్రొసీడింగ్ జారీచేసిన కొద్దిరోజులకు దాయాది అయిన కొప్పు ఎల్లయ్య కొడుకులైన బలరాం, నర్సింహ ఈ భూమిపై వివాదం సృష్టించారు. సర్వే నంబర్ 1116 లోని 2.16 ఎకరాల్లో 1.10 ఎకరాల భూమి తమదంటూ అధికారులకు ఫిర్యాదుచేశారు. పెద్ద జంగయ్యే 1998లో తమకు భూదాన సెటిల్‌మెంట్ కింద రూ.12,500 లకు భూమిని విక్రయించారని పేర్కొన్నారు. దీంతో మహేందర్ విరాసత్ ఆగిపోయింది. భూమిపై వివాదం తలెత్తిన నేపథ్యంలో వీఆర్వోతో చింతలపల్లి గ్రామంలో భూమి పంచనామా నిర్వహించారు. పంచనామా అనంతరం విరాసత్ ప్రొసీడింగ్ ఇచ్చిన ప్రకారం సదరు భూమిని మహేందర్ పేరిట ఆన్‌లైన్ రికార్డులో నమోదుచేయడమే సమంజసమని వీఆర్వో నిర్ధారించారు. దీన్ని ఆధారంగా చేసుకొని బాధితుడు మహేందర్‌రెడ్డి ఎన్నిసార్లు రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరిగినా అధికారులు పట్టించుకోలేదు. 2015లో సదరు భూమి మహేందర్‌కే చెందుతుందని ఎమ్మార్వో జారీచేసిన విరాసత్ ప్రొసీడింగ్‌ను 2016లో రెవెన్యూ అధికారులే రద్దుచేశారు. 2017 నవంబర్ వరకు 1116 సర్వేనంబర్‌లోని 2.16 ఎకరాలు భూమి పెద్ద జంగయ్య పేరుపైనే 1-బీలో నమోదై ఉన్నది. రికార్డుల ప్రక్షాళన సందర్భంగా 1.10 ఎకరాలను బలరాం పేరిట పాస్‌పుస్తకాలు జారీచేశారు. మిగిలిన 1.06 ఎకరాల భూమిని మహేందర్‌కు కేటాయించారు.

పోరాడే ఆర్థిక స్థోమత లేదు


మహేందర్, బాధితుడు

నేను పేదవాడిని. రోజూ కష్టంచేస్తేనే కుటుంబం గడుస్తుంది. ఈ భూమి కోసం పోరాడే ఆర్థికస్థోమత కూడా నాకు లేదు. సదరు భూమిని మా తండ్రి అమ్మినట్టు భూదాన్ సెటిల్మెంట్ పత్రాలు సృష్టించారు. వాటిపై మా తండ్రి వేలిముద్రలు ఉన్నాయి. మా తండ్రికి సంతకం చేయడం వచ్చు. ఆ భూమిపై ఇప్పటికీ నేనే కాస్తులో ఉన్నా. నా తండ్రి భూమిని దోచేయాలని చూసే వారికి రెవెన్యూ అధికారులే సపోర్ట్ చేస్తున్నారు. నాకు న్యాయంచేసి నా భూమిని తిరిగి ఇప్పించాలి.


ప్రొసీడింగ్ రద్దుచేశారు

ఈ సమస్య ఎన్నో ఏండ్ల నుంచి కొనసాగుతున్నది. భూదాన్ సెటిల్మెంట్ దస్తావేజు ప్రకారం పెద్దజంగయ్య పేరిట ఉన్న 2.16 ఎకరాల్లో నుంచి 1.10 ఎకరాలు తొలిగించి కొప్పు బాలరాం పేరిట ఆన్‌లైన్ చేశారు. ఈ సమస్య గురించి నాకు పూర్తిగా తెలియదు. మేం ఏం చేయలేం. మహేందర్ పేరిట 2015లో ఉన్న ఎమ్మార్వో విరాసత్ ప్రొసీడింగ్ ఇచ్చారు. తర్వాత పొరపాటు జరిగిందని రద్దుచేశారు.
- లక్ష్మయ్య, వీఆర్వో, చింతలపల్లి

సమస్య మా పరిధిలో లేదు

మహేందర్‌కు సంబంధించిన ఫైలును కలెక్టర్ దగ్గరికి పంపాం. ఆర్డీవోకు అప్పీల్‌కు వెళ్లమని మెమో వచ్చింది. సమస్య మా పరిధిలో లేదు. ఆర్డీవో అప్పీల్‌కు వెళ్తే సదరు భూమి సమస్యపై నోటీసు జారీచేసి పరిష్కరిస్తారు. గతంలోని ఎమ్మార్వోలు చేసిన తప్పిదం ఇది. ఒక ఎమ్మార్వో ఇచ్చిన ఆర్డర్‌లో వేరే ఎమ్మార్వో జోక్యంచేసుకోవడానికి వీల్లేదు. ఆర్డీవో అప్పీల్‌కు వెళ్లిన తర్వాత ఆయన ఆదేశిస్తే సమస్యను పరిశీలిస్తాం. భూదాన్ సెటిల్మెంట్ దస్తావేజుపై ఏవైనా ఆరోపణలుంటే సివిల్‌కోర్టుకు వెళ్లాలి.
-శ్రీనివాస్, ఎమ్మార్వో, ఆమనగల్

171
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles