సొమ్ములిచ్చినా పనికాలే


Mon,June 17, 2019 01:56 AM

Farmers complaints against Kamepalli VRO

- ఎకరాకు రూ.15 వేలు లంచం డిమాండ్‌చేసిన వీఆర్వో
-ఎకరాకు రూ.5 వేల చొప్పున అడ్వాన్సుగా ఇచ్చిన రైతులు
-వీఆర్వోపై తాసిల్దార్‌కు ఖమ్మం జిల్లా కామేపల్లి గిరిజన రైతుల ఫిర్యాదు

కామేపల్లి: అక్రమాలకు అలవాటుపడిన కొం దరు వీఆర్వోలు అమాయక రైతులతో ఆడుకొంటున్నారు. పాస్‌పుస్తకాల కోసం ఎకరాకు ఇంత లంచం ఇవ్వాలంటూ డిమాండ్‌చేస్తున్నారు. ఖమ్మం జిల్లా కామేపల్లి రెవెన్యూ పరిధిలోని కొంతమంది గిరిజన రైతులు.. పాస్‌పుస్తకాల కోసం స్థానిక వీఆర్వో నాగేశ్వర్‌రావును ఆరు నెలల క్రితం సంప్రదించగా ఎకరాకు రూ.5 వేల నుంచి రూ.10 వేలు ఖర్చవుతుందని తెలిపాడు. దీంతో రెండు విడుతల్లో డబ్బులు చెల్లించేలా వీఆర్వో నాగేశ్వరావుతో ఒప్పం దం చేసుకొని తొలివిడుత డబ్బులు ఇచ్చా రు. అయినప్పటికీ ఇప్పటిదాకా సదరు వీఆర్వో రైతులకు పాస్‌పుస్తకాలు ఇవ్వలేదు. రైతులు అడిగితే రేపు, మాపు అంటూ తిప్పించుకొంటున్నారు. దీంతో విసుగు చెందిన రైతులు ఇటీవల తాసిల్దార్ కార్యాలయంలో నాగేశ్వర్‌రావును నిలదీశారు. అప్పటికీ ఎటువంటి హామీ ఇవ్వకపోవడంతో తాసిల్దార్ పుష్పలతకు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశారు. తమకు భూమి ఉన్నా పాస్‌పుస్తకాలు రాలేదని.. దీంతో ప్రభుత్వం అందించే పెట్టుబడిసాయం కూడా పొందలేకపోతున్నామని వాపోయారు. తమ నుంచి డబ్బులు వసూలుచేసిన వీఆర్వోపై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌చేశారు. తమకు న్యాయం చేయాలని కోరారు. అర్హులైన రైతులకు న్యాయంచేస్తామని త్వరలోనే రైతులకు పాస్‌పుస్తకాలు అందిస్తామని తాసిల్దార్ పుష్పలత హామీఇచ్చారు.

ఫైల్ మాయంచేశారు

నాకు కామేపల్లి రెవెన్యూలోని సర్వేనంబర్ 14/ఆ లో ఎకరం, 19/ఆ లో 15 గుంటలు, 764లో 1.26 ఎకరాల భూమి ఉన్నది. నాకు పాస్‌పుస్తకం రాలేదు. వీఆర్వో నాగేశ్వర్‌రావుకు తెలుపగా ఒక్కో ఎకరాకు రూ.15 వేలు ఖర్చు అవుతుందని అడిగాడు. దీంతో నాకు ఉన్న మూడెకరాలకు గాను మొత్తం రూ.40 వేలు ఇస్తామని తెలిపి మొదటి విడుతగా రూ.20 వేలు నగదు చెల్లించాను. డబ్బులు ఇచ్చి ఆరు నెలలు అవుతున్నది. పాస్‌పుస్తకం రాలేదు. మిగతా డబ్బులు ఇవ్వలేదనే కారణంతోనే నా భూమి పత్రాలకు సంబంధించిన జిరాక్స్ పత్రాలు, దరఖాస్తు ఫారాలను మాయంచేసి పనిచేయకుండా ఆపాడు. ఈ విషయంపై తాసిల్దార్‌కు ఫిర్యాదుచేశాను.
- అజ్మీరా బాబురావు, కామేపల్లి, గిరిజన రైతు

రూ.6 వేలు ఇచ్చా

మాకు సర్వే నంబర్ 162లో 2.20 ఎకరాల భూమి ఉన్నది. పాస్‌పుస్తకం కోసం వీఆర్వోను అడుగగా లంచం డిమాండ్‌చేశాడు. చేబదులుగా తెలిసిన మరో రైతు వద్ద రూ.6 వేలు తీసుకొని వీఆర్వోకు ఇచ్చాను. అయినా కూడా పాస్‌పుస్తకం రాలేదు. ఏమిటని ప్రశ్నిస్తే రేపు, మాపు అంటున్నాడు. వీఆర్వో చుట్టూ తిరిగినా ఫలితం లేకుండా పోయింది. దీంతో తసిల్దార్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదుచేశాను.
- ఆంగోత్ విజయ, కామేపల్లి, గిరిజన మహిళా రైతు

304
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles