పట్టాలులేక ప్రభుత్వ పథకాలకు దూరం


Tue,June 18, 2019 02:01 AM

farmers are not eligibility for government schemes

-ఏడాదిగా రెవెన్యూ కార్యాలయంచుట్టూ తిరుగుతున్నా ఫలితం శూన్యం
-భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కుంటల్లతండా రైతుల ఆవేదన

టేకులపల్లి: తాతలకాలం నుంచి సాగుచేసుకొంటున్న భూములకు పట్టాలు మంజూరుకాకపోవడంతో గిరిజన రైతులు ప్రభుత్వ పథకాలకు దూరమవుతున్నారు. రైతుబంధు, రైతుబీమా పథకాలతోపాటు బ్యాంకుల్లో పంట రుణాలు పొందులేకపోతున్నారు. రెవెన్యూ అధికారులకు అనేకసార్లు దరఖాస్తు చేసినప్పటికీ.. పట్టాల మంజూరు కలగానే మిగిలిపోయింది. దీంతో రైతులు ధర్మగంటను ఆశ్రయించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి మండలం కుంటల్లతండాలో సుమారు 15 కుటుంబాలు ఆరేడు దశాబ్దాలుగా వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాయి. సదరు భూములు 1960 కంటే ముందు నుంచి కూడా 1-బీలో ఒకరిద్దరు భూస్వాముల పేరిట ఉండటం, ఆ రికార్డులను అప్‌డేట్ చేయకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. ఆ భూములకు సంబంధించిన క్రయవిక్రయాలను కేవలం దస్తావేజుల్లో మాత్రమే జరుపుతూ కాలంవెళ్లదీస్తున్నారు.

తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు, రైతుబీమా పథకాలు అమలుచేస్తున్న నేపథ్యంలో వాటికి దూరమైన రైతులు ఇప్పటికైనా తమకు పట్టాలు మంజూరుచేయాలని ఏడాదిగా రెవెన్యూ కార్యాలయంచుట్టూ తిరుగుతున్నారు. వారు చెప్పిన వివరాల ప్రకా రం.. కుంటల్లతండాకు చెందిన బానోత్ బాలుకు 5 ఎకరాలు, బానోత్ మంగ్యాకు 4 ఎకరాలు, బానోత్ ద్వాళీకి 15 ఎకరాలు, బానోత్ బాలుకు 5.20 ఎకరాలు, బానోత్ బావ్‌సింగ్‌కు 5 ఎకరాలు, బానోత్ వాలుకు 4.30 ఎకరాలు, కేళోత్ గామియాకు 3 ఎకరాలు, ఇస్లావత్ హేమ్లాకు 3 ఎకరాలు, బానోత్ శంకర్‌కు 5 ఎకరాల చొప్పున భూమి ఉన్నది. వీరికి సంబంధిచిన భూములు 170/4 సర్వే నంబర్‌లో నమోదై ఉన్నప్పటికీ వీరికి పట్టాలు మంజూరుకావడంలేదు.

తాతలకాలం నుంచి సాగుచేస్తున్నాం

మా తాతలతండ్రుల కాలం నుంచి భూములను సాగుచేసుకొంటున్నాం. రెవెన్యూరికార్డుల్లో అనాదిగా ఒకరిద్దరి పేర్ల మీద భూములు ఉండటంతో మాకు పట్టాలు రావడంలేదు. ఇప్పటివరకు కంప్యూటర్ పట్టా (ఆన్‌లైన్ పహాణీ) ఎలా ఉంటుందో కూడా మాకు తెలియదు. పట్టాల కోసం పదులసార్లు దరఖాస్తు చేసినం. పట్టాలు రాలేదు. రైతుబీమా, రైతుబంధు ప్రభుత్వ పథకాలకు అర్హత పొందలేకపోతున్నాం. నాకు ఐదెకరాలకు, నా భార్య ద్వాళీ పేరిట రెండెకరాలకు పట్టా రావాలి.
- బానోత్ బాలు, రైతు, కుంటల్లతండా

ఉన్నతాధికారులు స్పందించి పట్టాలివ్వాలి

మా నాన్న పేరిట ఐదెకరాల భూమి ఉన్నది. మేము ఇద్దరం అన్నదమ్ములం. వారసత్వపట్టా కోసం పలుమార్లు దరఖాస్తుచేశాం. ఇంతవరకు రాలేదు. మా గ్రామంలో ఒకరిద్దరికి తప్ప ఎవరికీ పట్టాలులేవు. ఉన్నతాధికారులు స్పందించి మాకు పట్టాలు మంజూరుచేయించాలి.
- బానోత్ హరిలాల్, రైతు, కుంటల్లతండా

పట్టాల కోసం తిరుగుతున్నాం

తరతరాలుగా సాగుచేసుకుంటున్న భూములకు పట్టాలులేకపోవడంతో ప్రభుత్వ పథకాలు అందడంలేదు. చాలా నష్టపోయాం. గత ఏడాదిగా పట్టాల కోసం తిరుగుతున్నా పని కావడంలేదు. పదేపదే తిప్పుతున్నారు. సర్వే నంబర్ 170/4లో 8ఎకరాల భూమికి పట్టా రావాలి. మాకు న్యాయంచేయండి.
- కేళోత్ షక్రు, రైతు, కుంటల్లతండా

సమస్యను పరిష్కరిస్తాం

నేను కొత్తగా బాధ్యతలు తీసుకున్నాను. కుంటల్లతండా రైతుల సమస్య మా దృష్టికి వచ్చింది. గ్రామాల్లో గ్రామసభలు నిర్వహించి రైతుల సమస్యలు పరిష్కరిస్తాం.
- గౌతమ్, టేకులపల్లి తాసిల్దార్

7593
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles