బతుకడానికి పట్నం పోతే.. ఉన్నదంతా ఊడ్చేశారు


Thu,May 23, 2019 01:44 AM

Farmers approached  Namaste Telangana Dharmaganta

-అన్యాయానికి గురైన అమ్మనబోలు అంబయ్య కుటుంబం
-కబ్జా చేసిన వారి పేరిటే పహాణీ ఇచ్చిన రెవెన్యూ అధికారులు
-ఒకప్పుడు 91 ఎకరాలు.. ఇప్పుడు సెంటు భూమి లేని పరిస్థితి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఒకప్పుడు 91 ఎకరాల ఆ ఆసామి కుటుంబానికి.. ఇప్పుడు సెంటు భూమి కూడా లేకపోయింది. బతుకు సాగరాన్ని ఈదేందుకు పట్నం వస్తే.. ఊరిలో ఉన్న భూమినంతా ఊడ్చేశారు. తన భూమి ఇతరుల చేతికి ఎలా వెళ్లిందో? ఎటు పోయిందో? తెలియని పరిస్థితిలో పాలుపోని ఆ ఆసామి.. నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించాడు. వివరాల్లోకి వెళితే.. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం నేదునూరు గ్రామానికి చెందిన అమ్మనబోలు అంబయ్యకు నేదునూరు, కందుకూరు గ్రామాల్లో 91 ఎకరాల భూమి ఉన్నది. నలుగురు భార్యలు, ఆరుగురు కొడుకులు కలిగిన అంబయ్య ముందు చూపుతో ఏ ఆస్తి ఎవరికి చెందాలో నిర్ణయిస్తూ 1971లో రిలీఫ్‌మెంట్ డీడ్ చేశారు. అప్పటికి అంబయ్య చిన్నకుమారుడు సురేశ్‌కు 12 ఏండ్ల వయస్సే. పెద్ద భార్య కుమారుడికి సికింద్రాబాద్‌లో ఇల్లు, ఇతర ఆస్తులు ఇచ్చాడు. నేదునూరు, కందుకూరు గ్రామాల్లో ఉన్న భూములను మిగిలిన కొడుకులకు ఇచ్చాడు. కందుకూరులోని సర్వేనంబర్ 746లోని 3 ఎకరాల 33 గుంటల భూమిని ఉంచుకొని మిగిలిన భూమిని ఆర్థిక అవసరాల కోసం విక్రయించాడు.

ఆ తర్వాత కొన్నిరోజులకు అంబయ్య కాలధర్మం చేయడంతో మిగతావారు ఉద్యోగ, వ్యాపారాలరీత్యా ఇతర ప్రాంతాల్లో స్థిరపడ్డారు. చిన్న కుమారుడు సురేశ్ హైదరాబాద్‌లో చిన్న దుకాణం ఏర్పాటుచేసుకొని బతుకు జీవనం సాగిస్తూ భూముల గురించి పట్టించుకోలేదు. దీంతో కందుకూరులో ఉన్న భూమిని కొంత కాలం వీరి అన్న పేరును పహాణీలో రాశారు. అనంతరం ప్రభుత్వ భూమిగా నమోదుచేశారు. గ్రామంలో నివసిస్తున్న సురేశ్ తల్లి చనిపోవడంతో వారసత్వంగా వచ్చిన భూమిని అనుభవించేందుకు గ్రామానికి వెళ్లిన సురేశ్‌కు చుక్కెదురైంది. తమ భూములను ఇతరులు అనుభవిస్తున్నారు. స్థానిక తాసిల్దార్ కార్యాలయంలో విచారించగా కబ్జాలో ఉన్నవారి పేరిట పహాణీ ఉన్నట్టు తేలింది. నేదునూరులోని సర్వేనంబర్ 767లోని 18 ఎకరాల 1 గుంట, 768లోని ఉన్న 28 ఎకరాల 28 గుంటల భూమిని రెవెన్యూ అధికారులు దాదాపు 19 మంది పేరున పట్టాచేసినట్టు సురేశ్ గుర్తించాడు. వాస్తవానికి ఈ భూమిని అంబయ్య కుటుంబం ఎవరికీ విక్రయించలేదు. సురేశ్ కుటుంబం గ్రామంలో లేకపోవడంతో కొంద రు స్థానికులు రెవెన్యూ సిబ్బందితో కుమ్మక్కై తమ పేరిట పట్టా చేయించుకున్నారు.

న్యాయం చేయండి సారూ!


అమ్మనబోలు సురేశ్, నేదునూరు ,కందుకూరు మండలం

వారసత్వంగా వచ్చిన భూమిని కబ్జా చేశారంటూ రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేస్తే.. చూస్తాం.. అంటున్నారే కానీ, ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. ఒకప్పుడు తన తండ్రి 91 ఎకరాల ఆసామి కాగా, ప్రస్తుతం కుటుంబంతో అద్దె ఇంట్లో ఉంటున్నాను. కుటుంబపోషణ కోసం నగరానికి వలస వెళ్తే భూములు ఇతరులకు దారాధత్తం అయ్యాయి. కబ్జా చేసినవారి పేరిటే పహాణీ ఇవ్వడం దారుణం. ఇప్పడు నా కుటుంబం చాలా దీనావస్థలో ఉన్నది. వారసత్వంగా వచ్చిన భూమిని నాకు ఇప్పించాలని కోరుతున్నా.

133
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles