ఉమ్మడి ఆస్తి.. ఒక్కరికే పట్టా


Wed,May 22, 2019 02:10 AM

farmer yadagiri chary requests for passbook

-వృద్ధులతో రెవెన్యూ అధికారుల చెలగాటం
-ముగ్గురు తాసిల్దార్లు మారినా జరుగని న్యాయం
-ఆందోళనలో నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి బాధితులు

దేవరకొండ, నమస్తే తెలంగాణ: 70 ఏండ్ల వయసులోనూ ఆ వృద్ధులు తమ వారసత్వ భూమి కోసం పోరాడుతున్నారు. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన 20.27 ఎకరాల ఉమ్మడిఆస్తిని ముగ్గురి పేర చేయాల్సి ఉండగా.. రేపు మాపు అంటూ తిప్పుకున్న తాసిల్దార్ చివరకు ఒక్కరి పేరునే పట్టాచేశాడు. పలుమార్లు డిక్లరేషన్ ఫారాలు, అఫిడవిట్లను సమర్పించినప్పటికీ సదరు అధికారి పట్టించుకోలేదని బాధితులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. నల్లగొండ జిల్లా డిండి మండలం గోనబోయినపల్లి గ్రామానికి చెందిన పిళ్లాచారికి గ్రామ శివారులో సర్వేనంబర్లు 8, 88, 90, 99, 319, 320, 321, 323, 324లలో మొత్తం 20.27 ఎకరాల భూమి ఉన్నది. ఈయనకు ముగ్గురు కొడుకులు రామస్వామి, వెంకటాచారి, యాదగిరాచారి ఉన్నారు. 1953లో పిళ్లాచారి చనిపోగా.. పెద్ద కుమారుడు రామస్వామి స్థానికంగా ఉండి భూమి సాగు చూసుకున్నాడు. మిగతా ఇద్దరు ఉద్యోగరీత్యా మహబూబ్‌నగర్‌కు వెళ్లారు. వారసత్వంగా వచ్చిన ఉమ్మడి ఆస్తిని తమ ముగ్గురి పేరున పట్టాచేయాలని 1975లోనే తాసిల్దార్‌కు వీరు డిక్లరేషన్ ఫారాలు సమర్పించారు. అయితే అప్పట్లో అధికారులు ఎవరిపైనా పట్టా అమలు చేయలేదు.

2007లో రామస్వామి, 2012లో వెంకటాచారి కూడా చనిపోయారు. ఉమ్మడి ఆస్తిని ముగ్గురికి సమానంగా పంచి పట్టాచేయాలని మరోసారి అప్పటి తాసిల్దార్ గోవర్దన్‌ను కలిసి యాదగిరాచారి, వెంకటాచారి భార్య అనసూయమ్మ విన్నవించారు. ఇందుకు కొన్ని సాక్ష్యాలను కూడా తాసిల్దార్‌కు సమర్పించారు. సాక్ష్యాధారాలను పరిశీలించిన తాసిల్దార్ పట్టాచేస్తానని నమ్మించి మోసంచేశారని యాదగిరాచారి, అనసూయమ్మ ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. తాసిల్దార్ ముగ్గురి పేరునచేయాల్సి ఉండగా.. చివరకు ఉమ్మడి ఆస్తినంతా రామస్వామి భార్య రామానుజమ్మ పేరున పట్టాచేశారని వాపోయారు. సదరు అధికారి బదిలీ అయ్యే ముందు రామానుజమ్మతో లాలూచీపడి ఒక్కరోజులోనే ఆమె పేర అక్రమంగా పట్టాచేశారని ఆరోపిస్తున్నారు. 2015 జూన్ 29న ఆమెకు పట్టాచేయగా ఆ మరుసటి రోజే రామానుజమ్మ వేరొకరికి సదరు భూమిని విక్రయించారని వారు చెప్తున్నారు. రెండేండ్లుగా తాసిల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నా.. ముగ్గురు తాసిల్దార్లు మారినా తమకు న్యాయం జరుగలేదని బాధితులు వాపోతున్నారు.


యాదగిరాచారి, బాధితుడు

రెండేండ్లుగా తిరుగుతున్నా..

తాసిల్దార్ గోవర్దన్ మమ్మల్ని మోసంచేశారు. ఆ తర్వాత ఇద్దరు తాసిల్దార్లు మారినా మా సమస్య పరిష్కారానికి నోచుకోలేదు. ఆర్డీవో, కలెక్టర్‌కు కూడా ఫిర్యాదుచేశాం. వృద్ధాప్యంలోనూ రెండేండ్లుగా అధికారుల చుట్టూ తిరిగినా న్యాయంచేసే వారు కరువయ్యారు. ఉమ్మడి ఆస్తిని ఒక్కరి పేరునే ఎలాచేస్తారని నెత్తినోరు బాదుకున్నా రెవెన్యూ అధికారులు మానవత్వం చూపడంలేదు. ధర్మగంటతోనైనా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.
- యాదగిరాచారి, బాధితుడు

సరిచేసే అధికారం మాకు లేదు

ఒక తాసిల్దార్ అమలుచేసిన పట్టాను మరో తాసిల్దార్ సరిచేసే అధికారం లేదు. బాధితులు ఆర్డీవోకు అప్పీల్ చేస్తే.. మళ్లీ విచారణ నిర్వహించి బాధితులకు న్యాయచేస్తాం.
- బాల్‌రాజు, తాసిల్దార్, డిండి

892
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles