సర్వే నంబర్ మాయం


Sat,June 15, 2019 02:28 AM

Farmer Suffering Revenue Officers Neglect For Pattadar Passbook

-రికార్డుల్లోకెక్కని 2.1 ఎకరాల భూమి
-రైతుబంధుకు దూరం.. పట్టించుకోని అధికారులు
-న్యాయం చేయాలంటున్న యాదాద్రి జిల్లా వెల్పుపల్లి రైతు కృష్ణారెడ్డి

యాదగిరిగుట్ట, నమస్తే తెలంగాణ: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం కారణంగా వారసత్వంగా వస్తున్న భూమిలో ఓ సర్వేనంబరే మాయమైంది. అందులోని 2.1 ఎకరాల భూమి రికార్డుల్లోకి ఎక్కలేదు. 6.1 ఎకరాలకు బదులుగా 4 ఎకరాలు మాత్రమే ఉన్నట్టు కొత్త పాస్‌పుస్తకం వచ్చింది. అదేమని అడిగితే ఏడాదిగా అధికారులు పట్టించుకోవడంలేదని, తమకు న్యాయంచేయాలని ధర్మగంటను ఆశ్రయించారు యాదా ద్రి భువనగిరి జిల్లా తుర్కపల్లి మండలం వెల్పుపల్లి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి కృష్ణారెడ్డి. అతని తండ్రి పిన్నపురెడ్డి జోగిరెడ్డికి సర్వేనంబర్ 91లో 2.1 ఎకరాలు, సర్వేనంబర్ 93లో 4 ఎకరాలు మొత్తం 6.1 ఎకరాల భూమి ఉన్నది. కాస్తు కబ్జా లో సైతం పేరు కొనసాగుతూ వస్తున్నది. తండ్రి నుంచి కృష్ణారెడ్డికి భూమి వారసత్వంగా వచ్చింది. తాజాగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం అందజేసిన కొత్త పట్టాదారు పాస్‌పుస్తకాల్లో మాత్రం సర్వేనంబర్ 93లో 4 ఎకరాల భూమి మాత్రమే ఉన్నదని రికార్డు నమోదుచేసి.. సర్వేనంబర్ 91లోని 2.1 ఎకరాల భూమిని మాయంచేశారు. దీంతో రైతుబంధు సైతం అందలేదు. వీఆర్వో, ఆర్‌ఐలను కలిసి సమస్య విన్నవించినా పట్టించుకోవడంలేదని రైతు కృష్ణారెడ్డి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. 15.05.2018 లో స్థానిక తాసిల్దార్‌కు ఫిర్యాదుచేశా.. అయినా ఇప్పటివరకు ఎలాంటి చర్య తీసుకోలేదని, తమకు న్యాయం చేయాలని కృష్ణారెడ్డి విజ్ఞప్తి చేస్తున్నారు.

సర్వేనంబర్ తప్పిపోయింది

భూములను ఆన్‌లైన్‌చేసే క్రమంలో సర్వేనంబర్ 91లోని 2.1 ఎకరాలు తప్పిపోయిన మాట వాస్తవమే. పరిశీలనచేస్తున్నాం. పిన్నపు కృష్ణారెడ్డి పాస్‌పుస్తకంలో మొత్తం భూమిని పొందుపరిచి, కొత్త పాస్‌బుక్ అందజేస్తాం.
- నరేశ్, వీఆర్వో, వెల్పుపల్లి

అవినీతిపై యుద్ధం సీఎం కేసీఆర్‌కే సాధ్యం


కనకటి వెంకన్నగౌడ్, మిర్యాల

రైతులకు సీఎం కేసీఆర్ పెద్దన్న అయ్యారు. రాష్ట్రంలో అవినీతిపై యుద్ధం చేస్తున్నారు. రెవెన్యూశాఖ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టడంతో దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న భూసమస్యలు ఒక్కొక్కటి బయటకు వచ్చి పరిష్కారం అవుతుండటం శుభపరిణామం. రెవెన్యూ అధికారులపై ప్రతి గ్రామంలో వందల సంఖ్యలో ఫిర్యాదులు వస్తున్నాయి. దీంతో రెవెన్యూశాఖలో ఎంత అవినీతి ఉన్నదో అర్థమవుతున్నది.
- కనకటి వెంకన్నగౌడ్, మిర్యాల, నూతనకల్ మండలం, సూర్యాపేట జిల్లా


స్వచ్ఛమైన పాలన సీఎం కేసీఆర్‌కే సాధ్యం


బుర్రి వెంకట్‌రెడ్డి, కల్వకుంట్ల

రెవెన్యూ అధికారులు చేస్తున్న పొరపాట్ల వల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నిజాం హయాంలో మాత్రమే భూరికార్డుల సర్వే జరిగింది. ఉమ్మడి రాష్ట్రం లో ప్రభుత్వాలు వీటిని పట్టించుకోలేదు. దీంతో రాష్ట్రం లో భూసమస్యలు సుదీర్ఘకాలంగా పేరుకుపోయాయి. ఈ సమస్యలను పరిష్కరించేందుకు స్వరాష్ట్రంలో భూరికార్డుల ప్రక్షాళనచేసిన ఘనత టీఆర్‌ఎస్ ప్రభుత్వానికే దక్కింది. రెవెన్యూశాఖలో నూతన విధానాలను ప్రవేశపెట్టే దిశగా రాష్ట్ర ప్రభుత్వంచేస్తున్న ప్రయత్నాలు అభినందనీయం. అవినీతి, అక్రమాలకు ఆస్కారమివ్వకుండా స్వచ్ఛమైన పాలన అందించడం సీఎం కేసీఆర్‌కే సాధ్యమైంది.
- బుర్రి వెంకట్‌రెడ్డి, కల్వకుంట్ల, మునుగోడు మండలం నల్లగొండ జిల్లా


సీఎం కేసీఆర్‌తోనే ఇబ్బందులు దూరం


అమరవరపు చంద్రయ్య, అప్పన్నపేట

రైతుల భూములకు రికార్డుల్లో ఉన్న వివరాలకు అసలు సంబంధంలేకుండా ఉండటంతో అనేక ఇబ్బందులు పడాల్సి వస్తున్నది. ఏండ్లుగా చాలా మంది రైతులు పడుతున్న బాధ ఇది. కానీ సీఎం కేసీఆర్ రెవెన్యూశాఖలో తీసుకొస్తున్న మార్పులతో అటువంటి ఇబ్బందులన్నీ తీరిపోతున్నాయి. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల కరంట్ అందించడం వంటి పనులతో రైతులకు సీఎం కేసీఆర్ భరోసానిచ్చారు. గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా రైతుల కోసం ఇంత మంచి పనులు చేయలేదు. ఇటువంటి వ్యక్తి సీఎంగా ఉండటం మన అదృష్టం.
- అమరవరపు చంద్రయ్య, అప్పన్నపేట, గరిడేపల్లి మండలం, సూర్యాపేట జిల్లా

217
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles