కన్నవారి భూమిని కాజేశాడు


Sat,June 15, 2019 02:41 AM

Farmer Suffering Revenue Officers Neglect For Land Registration

-కాసుల కోసం సహకరించిన రెవెన్యూ అధికారులు
-దొంగ పట్టా.. నకిలీ పంచనామా
-పైసలిస్తే ఏ పనైనా చేస్తున్న అధికారులు
-ప్రజావాణిలో ఫిర్యాదుచేసినా పట్టని వైనం
-న్యాయంచేయాలంటున్న నాగర్‌కర్నూల్ జిల్లా కల్వకోలు బాధితులు

తల్లిదండ్రులు, ఇద్దరు తోబుట్టువుల భూమి 4.27 ఎకరాలను అధికారులతో కుమ్మక్కై దొంగచాటుగా తన పేరిట పట్టాచేసుకున్నాడు ఆ ఇంటి పెద్దకొడుకు. తల్లిదండ్రులు అప్పటికే ఉన్న భూమిని ఇద్దరు కొడుకులకు సమానంగా పంచి ఇచ్చారు. అది చాలదన్నట్టు వీరి పెద్దకొడుకు అందరి భూమిలో ఎకరం, రెండెకరాలు, అర ఎకరం అక్రమమార్గంలో పట్టాచేసుకున్నాడు. ఇదేమని తండ్రి నిలదీస్తే, అతని తల పగులగొట్టాడు. దీంతో న్యాయంచేయాలని నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన బాధితులు గడ్డమీది బిచ్చమ్మ, కృష్ణయ్య దంపతులతో వారి కుమార్తెలు ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. అయినా అధికారులు పట్టించుకోకపోవడంతో బాధితులు ధర్మగంటను ఆశ్రయించారు.

కొల్లాపూర్, నమస్తే తెలంగాణ: నాగర్‌కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం కల్వకోలు గ్రామానికి చెందిన గడ్డమీది బిచ్చమ్మ, కృష్ణయ్య దంపతులకు అదే గ్రామ శివారులో కొంత భూమి ఉండగా, కొడుకులకు సమానంగా పంచారు. బిచ్చమ్మ పేరిట ఆమెకు పసుపుకుంకుమ కింద వచ్చిన ఇదే గ్రామంలోని సర్వేనంబర్ 155లో 5.14 ఎకరాల భూమి ఉన్నది. ఇందులోనుంచి 2.27 ఎకరాలను వీరి పెద్దకొడుకైన గడ్డమీది కుర్మయ్య ఏడాదిన్నర క్రితం దొంగచాటుగా పట్టాచేసుకున్నాడు. అలాగే తండ్రి గడ్డమీది కృష్ణయ్య పేరిట సర్వేనంబర్ 71లో ఉన్న 13 గుంటల భూమిని, మరో సర్వేనంబర్ 88లో ఉన్న 12 గుంటల భూమిని కుర్మయ్య దొంగ పంచనామాతో గుట్టుగా పట్టాచేసుకొన్నాడు. ఇంతటితో ఆగని కుర్మయ్య తమ తోబుట్టువులైన చెన్నమ్మ (కల్వకోలు), ఎల్లమ్మ (పెంట్లవెల్లి) పేరిట కల్వకోలు శివారులోని సర్వేనంబర్ 93లో ఉన్న 1.15 ఎకరాల భూమిని కూడా దొంగచాటుగా పట్టాచేయించుకున్నాడు.

రెవెన్యూ అధికారులతో కుమ్మకై తమ తల్లిదండ్రులు, చెల్లెండ్ల భూమి 4.27 ఎకరాలను అక్రమంగా పట్టాచేసుకున్నాడు. గడ్డమీది బిచ్చమ్మ భర్త కృష్ణయ్య పేరిట సర్వేనంబర్ 93/6లో ఉన్న 2.30 ఎకరాల భూమిని తేదీ 23/01/2015న వీరి కుమార్తెలైన జీ చెన్నమ్మ, టీ ఎల్లమ్మ రిజిస్ర్టేషన్ డాక్యుమెంట్ నంబర్ 301/15 ద్వారా కొనుగోలు చేశారు. సదరు డాక్యుమెంట్ ద్వారా 29/04/2015 ప్రొసీడింగ్ నంబర్ ఆర్వోఆర్ /3/15 ద్వారా ఆర్వోఆర్‌లో అమలుచేసుకొని పాస్‌పుస్తకాలు కూడా పొందారు. సమగ్ర భూసర్వే సందర్భంగా పాస్‌పుస్తకాలు కూడా వచ్చాయి. అధికారులు ఈ భూమిలో నుంచి కూడా 1.15 ఎకరాలను కుర్మయ్య పేరిట ఆన్‌లైన్‌చేసి కొత్త పాస్‌పుస్తకాన్ని జారీచేశారు. దీంతో బాధితులు గడ్డమీది బిచ్చమ్మ, కృష్ణయ్య, ఎల్లమ్మ, చెన్నమ్మ ఈ నెల 3, 10వ తేదీల్లో జిల్లా, మండల కార్యాలయాల్లో నిర్వహించే ప్రజావాణిలో ఫిర్యాదుచేశారు. తమ భూములను దొంగచాటుగా కుర్మయ్యకు పట్టాచేశారని, అందుకు బాధ్యులైన అధికారులపై చర్యలుతీసుకోవాలని కోరారు. విచారణకు గ్రామానికి అధికారిని పంపుతామంటూ ఉన్నతాధికారులు దాటవేస్తున్నారని బాధితులు బుధవారం ధర్మగంటకు ఫిర్యాదుచేశారు.

మా భూమి మాకుకావాలె


గడ్డమీది బిచ్చమ్మ

మా తల్లిదండ్రులకు నేను ఒక్కదాన్నే సంతానం. మా తల్లిదండ్రుల పేరిట కల్వకోలు శివారులో ఉన్న సర్వేనంబర్ 155లో 5.14 ఎకరాల భూమిని నా పేరు మీద పట్టాచేశారు. ఈ భూమిలోనుంచి 2.27 ఎకరాలను నా పెద్దకొడుకు కుర్మయ్యకు అధికారులు దొంగచాటుగా పట్టాచేసిండ్రు. అధికారులు చేసిన తప్పులను సవరించి మాకు న్యాయంచేయాలి.నిలదీస్తే తలపగులగొట్టాడు


గడ్డమీది కృష్ణయ్య

నా పేరు మీద ఉన్న సర్వేనంబర్ 71లోని భూమిలో నుంచి 13 గుంటలను నాకు తెలియకుండానే నా పెద్దకొడుకు కుర్మయ్య రెవెన్యూ అధికారులతో కుమ్మకై పట్టాచేసుకున్నాడు. ఈ విషయమై నా కొడుకును నిలదీస్తే నా తలపగులగొట్టాడు. పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేస్తే మా ఊరి పెద్ద మనుషులు వచ్చి కేసుకాకుండా చేసిండ్రు. నా భూమి నాకు కావాలే. అధికారులు నాకు న్యాయం చేయాలి.నా భూమిని పట్టాచేసుకున్నడు


ఎల్లమ్మ, పెంట్లవెల్లి

నా తల్లి గడ్డమీది బిచ్చమ్మ పేరు మీద ఉన్న 5.14 ఎకరాల్లో నాతోపాటు నా సోదరి చెన్నమ్మకు కలిపి మొత్తం 2.30 ఎకరాల భూమిని పట్టాచేసిచ్చిండ్రు. అయితే ఇందులోనుంచి మా అన్న కుర్మయ్య 1.15 ఎకరాలను మాకు తెలియకుండా అధికారులకు డబ్బులిచ్చి దొంగతనంగా పట్టాచేసుకున్నడు. ఉన్నతాధికారులు చర్యలుతీసుకొని మా భూమిని మాకు పట్టాచేయాలి.అధికారులదే తప్పు


గడ్డమీది ఎల్లయ్య, చిన్న కొడుకు

మా అన్న కుర్మయ్య అధికారులతో మిలాఖతై మా తల్లిదండ్రులతోపాటు మా అక్కలది కలిపి మొత్తం 4.27 ఎకరాలను దొంగతనంగా పట్టాచేసుకున్నడు. అధికారులు మా తల్లితండ్రులకు తెలియకుండానే పట్టాచేయడం నేరంకాదా? ఇదివరకే మా తల్లిదండ్రులు మాకు కొంత భూమిని పంచిఇచ్చారు. అది చాలదని ఇలా దొంగతనంగా పట్టాచేసుకున్నడు.


అక్రమ పట్టాపై విచారణ జరిపిస్తాం

కల్వకోలుకు చెందిన గడ్డమీది బుచ్చమ్మ, ఆమె భర్త కృష్ణయ్య, వారి కుమార్తెలకు చెందిన 4.27 ఎకరాల భూమిని అక్రమంగా పట్టాచేసుకున్న సంఘటనపై విచారణ జరిపిస్తాం. బాధితులకు న్యాయంచేస్తాం.
- దానయ్య, తాసిల్దార్, పెద్దకొత్తపల్లి

1069
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles