ఒకే డాక్యుమెంట్..ఇద్దరికి పట్టా!


Sat,May 25, 2019 02:57 AM

Farmer Suffering Revenue Officers Neglect For Land Registration

-ఒకరిభూమి మరొకరి పాస్ పుస్తకంలోకి..
-తప్పుజరిగిందని తేల్చిన ఆర్‌ఐ
-తన పుస్తకంలో అదనంగా ఎక్కిందని అంగీకరించిన రైతు
-ఆర్‌ఐ నివేదికను మార్చిన సీనియర్ అసిస్టెంట్
-ఏడాదిగా కాలంగా బాధిత రైతు ప్రదక్షిణలు

ఒకరికి పట్టాచేసిన డాక్యుమెంట్ నంబర్‌పైనే మరొకరికి పట్టాచేశారు.. ఇంకో రైతుకు చెందిన సర్వేనంబర్‌లోని భూమిని ఆ మరొకరి పాస్‌పుస్తకంలోకి ఎక్కించారు.. దీంతో అసలు రైతుకు కాకుండా ఇంకొకరికి రైతు బంధు అందుతున్నది. తన పేరిటఉన్న డాక్యుమెంట్‌కు తనకు సంబంధం లేదని, పాస్‌పుస్తకంలో అదనంగా తనదికాని భూమి ఎక్కింది వాస్తవమేనని ఆ రైతు అంగీకరించాడు.. ఆర్‌ఐ కూడా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. కానీ, సీనియర్ అసిస్టెంట్ ఉన్నతాధికారులకు తప్పుడు నివేదిక ఇవ్వడంతో సమస్య జటిలంగా మారింది.. తప్పు జరిగిందని గుర్తించినా దానిని సరిచేయకుండా ఏడాదికాలంగా తిప్పుకొంటున్నారని కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సీతారాంపూర్‌కు చెందిన అనుమాండ్ల శ్రీనివాస్‌రెడ్డి ధర్మగంటను ఆశ్రయించారు.

కరీంనగర్ ప్రతినిధి, నమస్తే తెలంగాణ: సీతారాంపూర్ గ్రామానికి చెందిన అనుమాండ్ల శ్రీనివాస్‌రెడ్డికి పాతపాస్ పుస్తకంలో సర్వేనంబర్ 1422బీ/ఏలో 1.38, 1413/సీలో 2.08, 1426/బీలో 1.05, 1813/బీలో 0.6 ఎకరాలు కలిపి మొత్తం 5.17 ఎకరాల భూమి ఉన్నది. తండ్రి నుంచి వారసత్వంగా వచ్చిన ఈ భూమిని ఇప్పటికీ సాగుచేసుకుంటూ వస్తున్నారు. అయితే, రికార్డుల ప్రక్షాళనలో భాగంగా రెవెన్యూ అధికారులు 1422బీ/ఏలోని 1.38 ఎకరాల భూమిని చేర్చకుండా 3.19 ఎకరాలకే కొత్త పాస్‌పుస్తకం ఇచ్చారు. తక్కువగా వచ్చిన భూమిని చేర్చాలంటూ రైతు శ్రీనివాస్‌రెడ్డి పలుమార్లు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. తాసిల్దార్ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఫిర్యాదు చేసుకుంటావచ్చారు. 2018 అక్టోబర్ 30న చిగురుమామిడి ఆర్‌ఐ మోఖాపైకి వచ్చి విచారణ జరిపారు. చుట్టుపక్కల రైతులను విచారించి సర్వేనంబర్ 1422బీ/ఏలో 1.38 ఎకరాల విస్తీర్ణంలో మోఖాపై శ్రీనివాస్‌రెడ్డి ఉన్నట్టు గుర్తించారు. ఆ తర్వాత దీనికి సంబంధించిన
కార్యాలయ రికార్డులను పరిశీలించారు. మ్యుటేషన్ జరిగిన తీరులో తప్పుజరిగిందని శ్రీనివాస్‌రెడ్డికి సంబంధించిన భూమి బొట్ల కనకయ్య అనే రైతు పేరిట జారీ అయిన పాస్‌పుస్తకంలోకి ఎక్కిందని గుర్తించారు. ఇందుకోసం గతంలో బొట్ల పుష్ప అనే రైతు పేరిట ఉన్న రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1681/2010 ద్వారానే బొట్ల కనకయ్యకు కూడా 1.38 ఎకరాలు రిజిస్ట్రేషన్ చేసినట్టు వెల్లడయింది. దీనిపై ఆర్‌ఐ 2018 డిసెంబర్ 27న తాసిల్దార్‌కు నివేదిక ఇచ్చారు.
Dharmaganta

డాక్యుమెంట్ నంబర్ ఒకరిది.. భూమి మరొకరిది

1422/బీ/ఏ సర్వేనంబర్‌లోనే 1.38 ఎకరాల భూమి బొట్ల పుష్ప అనే రైతుకు కూడా ఉన్నది. ఈమెకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1681/2010 ద్వారా 2010 జూన్ 4న పట్టా మార్పిడి జరిగింది. ఇక్కడివరకు బాగానే ఉన్నా.. బొట్ల పుష్పకు సంబంధించిన రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నంబర్ 1681/2010 ద్వారానే 2010 జూన్ 4వ తేదీనే మరోరైతు బొట్ల కనకయ్య పేరిట 1.38 ఎకరాలు పట్టామార్పిడి జరిగినట్టు ఉన్నది. దానిప్రకారమే 2018 ఏప్రిల్‌లో రెవెన్యూ అధికారులు అతడికి కొత్త పట్టాదార్ పాస్‌పుస్తకం జారీచేశారు. నిజానికి 1681 రిజిస్ట్రేషన్ డ్యాక్యుమెంట్ ద్వారా సర్వేనంబర్ 1422బీ/ఏలో బొట్ల పుష్పకు మాత్రమే 1.38 ఎకరాలు రిజిస్ట్రీ జరిగింది. ఆమె 2010లోనే పట్టామార్పిడి చేసుకున్నది. ఇదే డాక్యుమెంట్ నంబర్‌ను బొట్ల కనకయ్యకు కూడా ఇచ్చి పట్టా మార్పిడి చేశారు. కనకయ్యకు సంబంధించిన అసలు రిజిస్ట్రేషన్ పత్రాలు చూపించమని ఆర్‌ఐ కోరగా తన వద్ద లేవని చెప్పినట్టు, ఈ రిజిస్ట్రేషన్ పత్రాలు తప్పు అని తేలినట్టు తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు.

ఈ విషయంపై కరీంనగర్ రెవెన్యూ డివిజనల్ అధికారికి లేఖ నంబర్ బీ/74/2019 ద్వారా గత ఏప్రిల్ 30న చిగురుమామిడి తాసిల్దార్ నివేదిక ఇచ్చారు. ఆర్‌ఐ నివేదికలో బొట్ల కనకయ్య రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు తప్పుడువని స్పష్టంగా పేర్కొంటే.. ఆర్డీవోకు తాసిల్దార్ సమర్పించిన నివేదికలో మాత్రం ఆ పదం ఎక్కడా కనిపించలేదు. దీంతో నివేదిక ఇచ్చినా ఫలితం లేకుండాపోయిందని బాధిత రైతు శ్రీనివాస్‌రెడ్డి వాపోతున్నారు. నివేదికను మార్చడంపై ఆర్‌ఐని ప్రశ్నించగా.. తాను ఇచ్చిన నివేదకను సీనియర్ అసిస్టెంట్ ఉన్నది ఉన్నట్టు రాయలేదని, తాసిల్దార్ అలాగే ఆర్డీవోకు పం పించారని చెప్తున్నారని నమస్తే తెలంగాణకు తెలిపారు. చిగురుమామిడి తాసిల్ కార్యాలయంలో అధికారులు కావాలనే ఉద్దేశపూర్వకంగా నివేదిక మార్చారని శ్రీనివాస్‌రెడ్డి ఆరోపిస్తున్నారు. ఒకే డాక్యుమెంట్ నంబర్‌తో ఇద్దరికి ఎలా పట్టా చేస్తారని, పైగా వారికి ఆ సర్వేనంబర్‌లో ఎంత భూమి ఉన్నదో ఆ మేరకే చేస్తే తన కు అన్యాయం జరిగేది కాదని వాపోతున్నారు. పాత పాస్‌పుస్తకంలో ఉన్న మొత్తం భూమిని కొత్త పాస్‌పుస్తకంలో చేర్చాలని కోరుతున్నారు.

సామాన్యుడి అభివృద్ధే సీఎం లక్ష్యం


నీలి శ్రీనివాస్, టేకులపల్లి

ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా అభివృద్ధికోసమే. రెవెన్యూ వ్యవస్థలో పేరుకుపోయిన అవినీతి, సామాన్యుడికి జరుగుతున్న అన్యాయాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఎంత త్వరగా రెవెన్యూలో మార్పులుచేస్తే అంత బాగుంటుంది. సామాన్యుడి అభివృద్ధే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం.
-నీలి శ్రీనివాస్, టేకులపల్లి, మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లా
సీఎం కేసీఆర్ ఏదిచేసినా పేదలకోసమే


దొడ్డి నర్సింహులు, మోమిన్‌పేట మండలం

కొత్త రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఎన్నో మార్పులు తీసుకొచ్చిన సీఎం కేసీఆర్.. రైతుల బాగుకోసం రెవెన్యూలో మార్పులు తీసుకురావడం ఆయనకే సాధ్యం. ఏండ్లకు ఏండ్లుగా పేరుకుపోయిన సమస్యలు పరిష్కరించాలని కార్యాలయాల చుట్టూ తిరిగి తిరిగి అలసపోయిన రైతన్నల గోస తెలుసుకొని మార్పు వస్తేనే అభివృద్ధి సాధ్యమని భావించిన నాయకుడు కాబట్టి రెవెన్యూలో మార్పులకు శ్రీకారంచుడుతున్నారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సార్ ఏదిచేసినా పేదలకోసమే.
- దొడ్డి నర్సింహులు, మోమిన్‌పేట మండలం, వికారాబాద్ జిల్లాసీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం


నాయకపు వెంకటేశ్ ముదిరాజ్

రెవెన్యూలో లోటుపాట్లను సవరించడానికి సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం చారిత్రాత్మకం. అవినీతికి వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో మేమంతా సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటాం. లంచగొండి అధికారుల వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తున్నది. ప్రభుత్వ అధికారుల్లో మార్పు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ చేస్తున్న కృషి అభినందనీయం. పేదలకు సహాయం చేయాల్సిన అధికారులు ఇష్టానుసారంగా వ్యవహరించి ప్రభుత్వానికి చెడ్డపేరు తీసుకురావడం అన్యాయం.
- నాయకపు వెంకటేశ్ ముదిరాజ్, కీసర, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా

2569
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles