ఆక్రమణదారుకే అండదండలు!


Thu,June 20, 2019 02:17 AM

Farmer Says Worry that the invader is threatening to kill

-సర్వేచేసి వారసత్వ భూమేనని తేల్చినా.. అప్పగించని అధికారులు
-15 ఏండ్లుగా తిరుగుతున్నా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది
-ధర్మగంటను ఆశ్రయించిన వికారాబాద్ జిల్లా బాధితుడు బోగం నాగయ్య
-ఆక్రమణదారుడు చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఆందోళన

వికారాబాద్ జిల్లాప్రతినిధి, నమస్తే తెలంగాణ: కబ్జాదారులు రెచ్చిపోతున్నారు. అమాయకుల భూముల ఆక్రమణకు పాల్పడుతున్నారు. ఎదురుతిరిగితే చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ బాధితుడు ఏండ్ల తరబడి తిరుగుతున్నా ప్రయోజనం లేకుండా పోతున్నది. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలం సిరిపురం గ్రామంలోని సర్వే నంబర్ 151/అ3లో బోగం నాగయ్య పేరిట 3 ఎకరాల 6 గుంటల భూమి ఉన్నది. వారసత్వంగా వచ్చిన ఆ భూమిలో సిరిపురం గ్రామానికే చెందిన మల్లయ్య ఒకటిన్నర ఎకరాన్ని 2004లో కబ్జాచేశారు. కబ్జా నుంచి భూమిని విడిపించుకునేందుకు నాగయ్య ఎంత మొరపెట్టుకున్నా అధికారులు చర్యలు తీసుకోలేదు. 15 ఏండ్లుగా బాధితుడు తాసిల్దార్, కలెక్టరేట్ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా స్పందించడం లేదు.

2004లో రంగారెడ్డి జిల్లా కలెక్టర్‌గా ఉన్న శేషాద్రిని ఆక్రమించిన వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని, తనకు న్యాయం చేయాలని కోరగా.. స్పందించి ఆయన స్థానిక ఆర్డీవో, తాసిల్దార్, సర్వేయర్లతో సర్వే చేయించడంతో అది బోగం నాగయ్య వారసత్వ భూమి అని తేల్చారు. నాగయ్య భూమిగా అధికారులు సర్వేలో తేల్చినప్పటికీ ఆ భూమి వద్దకు ఆక్రమణదారు రానివ్వడం లేదు. సర్వేతో తమ పని అయిపోయిందన్నట్టు అధికారులు వ్యవహరించడంతో తన భూమిని ఇప్పించాలని నాగయ్య అధికారుల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. మరోసారి సర్వే చేయాలని దరఖాస్తు చేసుకోగా, సర్వే చేయనివ్వడం లేదని, చంపేస్తామని బెదిరిస్తున్నాడని బాధితుడు ఆవేదన వ్యక్తంచేశారు. ఈ ఏడాది మార్చి 19న జిల్లా కలెక్టర్‌తోపాటు ఆర్డీవో, మర్పల్లి తాసిల్దార్‌కు ఫిర్యాదుచేసినా ఫలితం లేకుండాపోయింది. భూమి తనదేనని చెప్తున్న అధికారులు ఆక్రమణదారుడి నుంచి విడిపించడంలో ఆసక్తి చూపడం లేదని, తాసిల్దార్‌తోపాటు వీఆర్వోలు అతనికే మద్దతుగా నిలుస్తున్నారని, తాను ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని బాధితుడు వాపోయారు. భూమిని ఆక్రమించిన వ్యక్తితో తనకు ప్రాణభయం ఉన్నదని, ఆక్రమణదారుపై చర్యలు తీసుకొని, తనకు న్యాయంచేయాలని బాధితుడు నాగయ్య రెవెన్యూ అధికారులను వేడుకున్నారు.

ఏడాదినుంచి తిరుగుతనే ఉన్న..


చిన్న మల్లయ్య, లింగసానిపల్లి, నాగర్‌కర్నూల్ జిల్లా

నా పేరు చిన్న మల్లయ్య. మాది నాగర్‌కర్నూల్ జిల్లా బిజినేపల్లి మండలంలోని లింగసానిపల్లి గ్రామం. నాకు మా గ్రామ శివారులోని సర్వే నంబర్లు 287/27లో పది గుంటలు, 287/35లో పది గుంటలు, 287/41లో పది గుంటలు మొత్తం కలిపి 30 గుంటల భూమి ఉన్నది. ఈ భూమి సమగ్ర సర్వే కంటే ముందువరకు ఆన్‌లైన్‌లో ఉన్నది. కానీ ఇప్పటివరకు రెవెన్యూ అధికారులు నాకు కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వలేదు. ఈ భూమిని నేను కొనుగోలు చేశా. దానికి సంబంధించిన పాత పట్టాదారు పాస్‌పుస్తకం, రిజిస్ట్రేషన్ కాగితాలు, ఆర్వోఆర్ పహాణీలు మొత్తం ఉన్నాయి. ఈ భూమిలో ఇప్పటికీ మేమే సాగు చేసుకుంటూ మోఖాపై ఉన్న. పాస్‌పుస్తకాల కోసం ఏడాదిగా రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడంలేదు. దీంతో న్యాయం కోసం నేను ధర్మగంటను ఆశ్రయించిన. కనీసం ఉన్నతాధికారులైనా స్పందించి మా భూమి మాకుచేసి కొత్త పట్టాదారు పాస్‌పుస్తకం ఇవ్వాలని కోరుతున్న.

483
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles