సొంత తమ్ముడికే మోసం


Thu,May 23, 2019 01:51 AM

farmer satyanarayana meets dharmaganta over land problem

-తండ్రి పంచి ఇచ్చిన స్థలాన్ని లాక్కున్న అక్కాబావ
-సహకరించిన పంచాయతీ, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది

భీమదేవరపల్లి: తోడ పుట్టిన సోదరే తమ్ముడి గొంతు కోసింది. తండ్రి పంచి ఇచ్చిన భూమికి దొంగపత్రాలు సృష్టించి తనొక్కతే సొంతం చేసుకొన్నది. భవిష్యత్‌లో తమ్ముడు అడ్డుపడకుండా ఉండేందుకు ఆ స్థలాన్ని తన కూతుళ్ల పేరిట విరాసత్ పట్టా చేసింది. ఈ కుట్రలో గ్రామపంచాయతీ, రిజిస్ట్రేషన్లశాఖ సిబ్బంది సహకరించడం విశేషం. వరంగల్ అర్బన్ జిల్లా భీమదేవరపల్లి మండలం ములుకనూరు గ్రామానికి చెందిన ఎర్రోజు శంకరయ్యకు ముగ్గురు కూతుర్లు, కుమారుడు ఉన్నారు. కుమారుడు సత్యనారాయణ ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్ గ్రామంలో స్థిరపడ్డాడు. శంకరయ్యకు ములుకనూరులోని పోచమ్మ దేవాలయం సమీపంలోని సర్వేనంబర్ 82లో 242 గజాల స్థలం ఉన్నది. ఈ స్థలాన్ని కూతురు రమాదేవి, కొడుకు సత్యనారాయణకు 121 గజాల చొప్పున ఇద్దరికి సమానంగా సాదాబైనామా ద్వారా 1990లో పంచి ఇచ్చాడు. తమ్ముడు గ్రామంలో లేకపోవడాన్ని అలుసుగా తీసుకొన్న అక్క రమాదేవి, ఆమె భర్త గుడికందుల శ్రీనివాస్ 2019లో దొంగపత్రాలు సృష్టించి మొత్తం స్థలాన్ని పట్టా చేసుకున్నారు.

ఇదేమిటని ప్రశ్నించిన శంకరయ్య, సత్యనారాయణను అల్లుడు నానా దుర్భాషలాడాడు. తండ్రి శంకరయ్య సంతకం లేకుండా భూమిని ఎలా రిజిస్ట్రేషన్ చేశారని సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో సంప్రదించిన సత్యనారాయణ విషయం తెలుసుకొని కంగుతిన్నాడు. తన 121 చదరపు గజాల స్థలాన్ని అక్క రమాదేవి కూతుళ్ల పేరిట దానపత్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేసింది. ఈ విషయంపై సబ్‌రిజిస్ట్రార్ కార్యాలయంలో అధికారులను ప్రశ్నించగా.. గ్రామపంచాయితీ కార్యాలయం ఇచ్చిన యాజమాన్య ధ్రువీకరణపత్రం ద్వారా రిజిస్ట్రేషన్ చేసినట్లు వెల్లడించారు. ఇదే విషయంపై ములుకనూరు గ్రామపంచాయితీ సిబ్బందిని ప్రశ్నించగా.. తాము ఇల్లు ఉన్నట్టు మాత్రమే యాజమాన్య ధ్రువీకరణపత్రం ఇచ్చామని సెలవిచ్చారు. తమ అనుమతి లేకుండా గ్రామపంచాయితీ, రిజిస్ట్రార్ కార్యాలయం సిబ్బంది ఇష్టానుసారంగా వ్యవహరించారని, ఒకరిపై మరొకరు పరస్పర ఆరోపణలు చేసుకొంటున్నారే కాని తనకు న్యాయం చేయడం లేదని బాధితుడు సత్యనారాయణ వాపోయారు. తన అక్కాబావ చేసిన మోసాన్ని నమస్తే తెలంగాణ ధర్మగంట దృష్టికి తీసుకొచ్చి.. తనకు న్యాయంగా రావాల్సిన 121 చదరపు గజాల భూమిని ఇప్పించాలని సత్యనారాయణ విజ్ఞప్తిచేశారు.

746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles