4.16 ఎకరాలు మాయం


Wed,May 22, 2019 02:06 AM

farmer ramavath hemla requests for passbook

-రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యంతో 4.24 ఎకరాలకు రికార్డుల్లోకి ఎక్కింది 8 గుంటలే
-విన్నవిస్తున్నా స్పందించని యంత్రాంగం
-సాగుకు దూరమైన నల్లగొండ జిల్లా బిల్డింగ్‌తండా రైతు

చందంపేట: రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఓ రైతుపాలిట శాపమైంది. పైసాపైసా కూడబెట్టి కొనుగోలు చేసిన భూమి రికార్డుల్లో మాయమైంది. అధికారుల చుట్టూ తిరిగినా స్పందన కరువైంది. సర్కారు అందజేస్తున్న రైతుబంధు సాయం దూరమైంది. ఆవేదనతో రైతు సాగుకే స్వస్థి పలికాడు. నల్లగొండ జిల్లా చందంపేట మండలం బిల్డింగ్‌తండాకు చెందిన రమావత్ హేమ్ల సాధారణ రైతు. ఇంటివద్ద ఓ చిన్నపాటి కిరాణ షాపు నడుపుకొంటూ.. పైసాపైసా కూడబెట్టాడు. తండా పక్కనే ఉన్న పోలేపల్లి గేటు వద్ద సర్వేనంబర్ 162లో 3.36 ఎకరాలు, 102/ ఈ-2లో గుంట, 106/అ-4లో 8 గుంటలు, 106/అ-5లో 16 గుంటలు, 102లో 3 గుంటలు కలిపి మొత్తం 4.24 ఎకరాల భూమి కొనుగోలు చేశాడు. సంబంధించిన పాత పాస్‌బుక్‌లు ఉన్నాయి.

మూడేండ్లుగా సాగుచేసుకుంటూనే.. మరోవైపు షాపు చూసుకుంటున్నాడు. భూరికార్డుల ప్రక్షాళనలో రెవెన్యూ అధికారులు రికార్డుల్లో మొత్తం భూమిని నమోదుచేయలేదు. ఆన్‌లైన్‌లో కేవలం 8 గుంటల భూమి మాత్రమే ఉన్నట్టు చూపిస్తున్నది. అధికారుల తప్పిదం వల్ల రైతు హేమ్లకు చెందిన 4.16 ఎకరాల భూమి మాయమైంది. తన భూమిని పూర్తిగా నమోదు చేసి కొత్త పాస్‌పుస్తకం అందించాలని హేమ్ల.. ఏడాదిపాటు అధికారుల చుట్టూ తిరిగినా ఫలితం దక్కలేదు. మొత్తం భూమి నమోదుకాక.. కొత్త పాస్‌పుస్తకాలు అందక రాష్ట్ర ప్రభుత్వం అందించిన రైతుబంధును సైతం కోల్పోయాడు. చివరకు అధికారుల చుట్టూ తిరుగడంపైనే దృష్టిపెట్టిన హేమ్ల.. వ్యవసాయా న్ని వదిలిపెట్టి కిరాణ షాపుపైనే పూర్తిగా ఆధారపడ్డాడు.

ఆన్‌లైన్‌లో నమోదు చేశాం: శ్రీనివాస్‌రెడ్డి, వీఆర్వో, పోలేపల్లి

కంప్యూటర్‌లో భూ వివరాలు తప్పుగా నమోదు కావడం వల్ల హేమ్లకు అన్యాయం జరిగిన మాట వాస్తవమే. హేమ్ల భూమిని సర్వేనంబర్ ఆధారంగా ఆన్‌లైన్‌లో నమోదుచేశాం. త్వరలో కొత్త పాస్‌పుస్తకాలు అందిస్తాం.


రమావత్ హేమ్ల, రైతు

ముప్పుతిప్పలు పెడుతుండ్రు

పదేండ్లుగా కిరాణ షాపు నడుపుకొంటూ పైసాపైసా కూడబెట్టి 4 ఎకరాల 24 గుంటల భూమిని రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ల ద్వారా కొనుగోలు చేశా. అధికారులు నిర్లక్ష్యంతో కేవలం 8 గుంటల భూమిని మాత్రమే రికార్డుల్లోకి ఎక్కించారు. మిగతా 4.16 ఎకరాల భూమిని పాస్‌పుస్తకంలోకి ఎక్కించాలని కార్యాలయం చుట్టూ తిరిగినా ఏ ఒక్కరూ కనికరించలేదు. ముప్పుతిప్పలు పెడుతుండ్రు. భూమిపై ఆశలు వదులుకొని కిరాణ షాపు నడుపుకొంటున్నా. కొత్త పాస్‌బుక్ లేక ప్రభుత్వం అందజేసిన పెట్టుబడి సాయాన్ని సైతం కోల్పోయా.
- రమావత్ హేమ్ల, రైతు

530
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles