సర్వే కోసం సర్వ కష్టాలు


Thu,May 16, 2019 02:33 AM

farmer lingaiah requests for passbook and rythu bandhu

-మూడేండ్లుగా ఎదురుచూపులు
-కలెక్టర్‌కు విన్నవించినా ఫలితం చేకూరలేదు
-మెదక్ జిల్లా పెద్దశంకరంపేట రైతు లింగయ్య ఆవేదన

వారసత్వంగా వచ్చిన 21 గుంటల భూమి సర్వే చేసి పట్టాపాస్‌పుస్తకం ఇవ్వాలని మూడేండ్లుగా వేడుకొంటున్నా రెవెన్యూ అధికారులు కనికరించడం లేదు. పలుమార్లు నేరుగా కలెక్టర్‌కు విన్నవించినా అధికారులు స్పందించలేదు. దీంతో ఆ రైతు పెట్టుబడి సాయాన్ని సైతం అందుకోలేకపోయాడు. మెదక్ జిల్లా పెద్దశంకరంపేటకు చెందిన రైతు ఆవేదన ఇది.

పెద్ద శంకరంపేట: మండల కేంద్రమైన పెద్దశంకరంపేటలోని బుజ్రాన్‌పల్లి రోడ్డు వెళ్లే మార్గంలో సర్వే నంబర్ 239లో చందుబట్ల పోశెట్టికి రెండెకరాల ఆరుగుంటల భూమి ఉన్నది. పోశెట్టికి నలుగురు కుమారులు. ఆ భూమిని చందుబట్ల పెద్ద విఠల్ 35 గుంటలు, చిన్న విఠల్ 34 గుంటలు, సంగయ్య 17 గుంటల భూమిని 1989లో విరాసత్ చేసుకున్నారు. తన వాటా కోసం చందుబట్ల లింగయ్య సోదరులను నిలదీయగా.. వారు 21 గుంటల భూమిని నాలుగు దిక్కులా హద్దులను తెలియజేస్తూ రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చారు. ఆ తర్వాత భూమి హద్దులను మార్చేశారు. 2009లో లింగయ్య కోర్టును ఆశ్రయించి అన్ని పత్రాలు, ఆధారాలు సమర్పించగా తుది తీర్పు వెలువరించింది. కోర్టు తీర్పు ఆధారంగా భూమి హద్దులు చూపాలని తాసిల్దార్ కార్యాలయంలో దరఖాస్తు చేసుకొన్నారు. భూరికార్డుల ప్రక్షాళన అనంతరం కొత్త పాస్‌పుస్తకంగానీ, రైతుబంధు చెక్కుగానీ లింగయ్యకు అందజేయలేదు.

చలాన్ కట్టి మూడేండ్లు

తమ పట్టా భూమిని చూపించాలని కోరుతూ 2015లో ఆన్‌లైన్‌లో రూ. 285 చలాన్ కట్టి రెవెన్యూ అధికారులకు ఇచ్చానని, 21 డిసెంబర్ 2016లో ల్యాండ్ సర్వే జిల్లా ఏడీ పేరిట రూ. 400 చలాన్ తీసి ఇచ్చినా ఇప్పటి వరకు సర్వే చేయటం లేదని చందుబట్ల లింగయ్య వాపోతున్నారు. 2016 సంవత్సరంలో అప్ప టి జిల్లా కలెక్టర్ భారతీ హోళికేరికి గ్రీవెన్స్‌డేలో కలిసి మొరపెట్టుకోవడంతోపాటు సుమారు ఆరు సార్లు గ్రీవెన్స్‌సెల్‌లో వినతిపత్రాలు ఇచ్చినట్టు వెల్లడించారు. దీంతో పాటు స్థానిక తాసిల్దార్ కార్యాలయ అధికారులను పలుమార్లు కలిసినా ఇప్పటి వరకు సర్వేకు రాలేదని లింగయ్య ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.

ఉన్నతాధికారులతో కలిసి సర్వే చేయాలి

నేను రెండు నెలల క్రితమే పెద్దశంకరంపేటలో విధుల్లో చేరాను. జాతీయరహదారి విస్తరణ పనులు జరుగుతుండటంతో సర్వేయర్‌లు పని ఒత్తిడిలో ఉన్నారు. దీంతో సర్వే జరుగలేదు. పెద్దశంకరంపేట సర్వేయర్‌గా ఉన్న నాగరాణి ఇటీవలే రేగోడ్‌కు బదిలీ అయ్యారు. ఆ పోస్టుఖాళీగా ఉన్నది. సర్వేనంబర్ 239లో వ్యవసాయ భూమి కోసం మెదక్ ఆర్డీవో కార్యాలయ ల్యాండ్ సర్వే ఏడీకి చలాన్ కట్టి సర్వే చేసుకోవాలి.
-కిష్టానాయక్, తాసిల్దార్, పెద్దశంకరంపేట

245
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles