భూపరిహారం కోసం ఆత్మహత్యాయత్నం


Tue,June 18, 2019 02:05 AM

farmer ilesh attempts suicide over Land compensation

-కుటుంబంతోసహా ఒంటిపై కిరోసిన్ పోసుకున్న ఇబ్రహీంపట్నంవాసి
-ఎనిమిదేండ్లుగా పోరాడుతున్నా న్యాయం దక్కలేదని ఆవేదన
-తన పరిహారాన్ని అధికారులు కాజేశారని ఆరోపణ

ఇబ్రహీంపట్నం, నమస్తే తెలంగాణ/ఖైరతాబాద్: భూపరిహారం కోసం ఓ వ్యక్తి కుటుంబంతోసహా ఆత్మహత్యాయత్నంచేశారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన మాశమోని ఐలేశ్ సోమవారం భార్య అనురాధ, పిల్లలు అక్షిత (7), మణితేజ (6), వేణుతేజ (4)తో కలిసి హైదరాబాద్‌లోని ప్రగతి భవన్ సమీపంలోకి చేరుకొన్నారు. వెంట తెచ్చుకొన్న కిరోసిన్‌ను మీద పోసుకొని ఆత్మహత్యకు యత్నించారు. అక్కడే ఉన్న పోలీసులు అడ్డుకొని వారిని పంజాగుట్ట స్టేషన్‌కు తరలించారు. అనంతరం బాధితుడు మీడియా ఎదుట గోడు వెల్లబోసుకున్నారు. తన తండ్రి వెంకయ్యకు 1979లో ఇబ్రహీంపట్నం సమీపంలోని సర్వేనంబర్ 58లో భూదాన్‌బోర్డు ఐదెకరాల భూమి కేటాయించిందన్నారు. 2010లో ఆ సర్వేనంబర్‌లోని భూమిని నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ (ఎన్‌ఎస్‌జీ)కు కేటాయించగా, అందులో తన భూమి కూడా ఉన్నదని చెప్పారు. పరిహారంగా ప్రభుత్వం ఎకరాకు రూ.5.40 లక్షలు చెల్లించిందని తెలిపారు. అయితే అప్పటి వీఆర్వో రాంరెడ్డి, తాసిల్దార్ విక్టర్, ఆర్డీవో రాజేందర్, మరో ముగ్గురు ఉద్యోగులు, భూదాన్ బోర్డు చైర్మన్ కలిసి తమ భూమికి దొంగ పత్రాలు సృష్టించి పరిహారాన్ని కాజేశారని ఆరోపించారు.

ఈ విషయమై నిలదీస్తే నంబర్ తప్పు పడిందని, మరోచోట భూమి చూపిస్తామని రెండు మూడేండ్లు వారి చుట్టూ తిప్పుకొన్నారని వాపోయారు. అనంతరం డబ్బు ఖర్చవుతుందని సుమారు రూ.8 లక్షల వరకు తన నుంచి లాగారని చెప్పా రు. 2014లో భూదాన్ బోర్డు రద్దు కావడంతో తాము ఏమీ చేయలేమంటూ సదరు అధికారు లు చేతులెత్తేశారని ఆవేదన వ్యక్తంచేశారు. 2017 నవంబర్‌లో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదుచేయగా, ఎఫ్‌ఐఆర్ సైతం నమోదుచేశారని, కానీ నేటికీ వారిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. రాచకొండ సీపీతోపాటు రెవెన్యూ ఉన్నతాధికారులను కూడా కలిశానని తెలిపారు. అదే క్రమంలో వీఆర్వో రాంరెడ్డి తన వద్దకు వచ్చి లారీతో గుద్దించి చంపేస్తానని బెదిరించారని ఆరోపించారు. ప్రస్తుతం తన కుటుంబం అర్థాకలితో అలమటిస్తున్నదని, దీంతో జీవితంపై విరక్తిచెంది ఆత్మహత్యకు యత్నించినట్టు వాపోయారు. తనకు ప్రాణహాని ఉన్నదని ఆందోళన వ్యక్తంచేశారు. అనంతరం పోలీసులు వారిని ఇబ్రహీంపట్నం ఠాణాకు తరలించారు.

బాధితుడి ఫిర్యాదుపై గతంలోనే కేసు నమోదు

తనకు రావాల్సిన పరిహారాన్ని అధికారులు ఇతరులతో కుమ్మక్కై కాజేశారని బాధితుడు ఐలేశ్ చేసిన ఫిర్యాదు మేరకు అప్పటి ఆర్డీవో, తాసిల్దార్, వీఆర్వోతోపాటు పరిహారాన్ని పొందిన మరో ముగ్గురిపై ఇబ్రహీంపట్నం పోలీసులు కేసు నమోదుచేశారు. బాధితుడు పూర్తి ఆధారాలను సమర్పించినందున ఉన్నతాధికారులు వెంటనే కేసు నమోదుచేయాలని ఆదేశించడంతో 2017 డిసెంబర్‌లో ఐపీసీ 420, 468, 471సెక్షన్ల కింద కేసు నమోదుచేసినట్టు పోలీసులు తెలిపారు.

276
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles