అమ్మింది ఒకరిది.. పట్టా మరొకరిది


Sun,August 25, 2019 02:30 AM

farmer dasharatham reddy meets dharmaganta over revenue officers negligence

-అక్క వాటా అమ్ముకొంటే.. తమ్ముడి వాటాను పట్టాచేశారు
-రికార్డుల్లో నుంచి 2.18 ఎకరాల భూమి మాయం
-నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ రెవెన్యూ అధికారుల నిర్వాకం
-ధర్మగంటను ఆశ్రయించిన చెర్కూర్ రైతు దశరథంరెడ్డి

అది అక్క, తమ్ముడికి వారసత్వంగా వచ్చిన భూమి. అక్క తన వాటా 2.18 ఎకరాల్లో మొదట 1.10 ఎకరాలను అమ్ముకొన్నారు. రెవెన్యూ అధికారులు మాత్రం అక్క వాటాలో నుంచి కాకుండా పక్కనే ఉన్న తమ్ముడి వాటాలోని భూమిని కొనుగోలుచేసిన వ్యక్తికి పట్టాచేశారు. అక్క.. అమ్ముకోగా మిగిలిన భూమితోపాటు అంతకుముందు అమ్మిన భూమిని కూడా మళ్లీ విక్రయించారు. దీంతో తమ్ముడి భూమి వాటా 2.18 ఎకరాలు రికార్డుల్లో నుంచి మాయమైంది. బాధితుడు ఇదేమని అధికారులను అడిగితే.. పొరపాటు జరిగింది సరిదిద్దుతామని చెప్పారు. ఇంతలోనే వీఆర్వో బదిలీ అయ్యారు. కొత్తగా వచ్చిన వీఆర్వోను అడిగితే పాత వీఆర్వోనే అడుగాలని చెప్తున్నారు. డిప్యూటీ తాసిల్దార్ ఆదేశాలను కూడా వీఆర్వో ఖాతరుచేయడంలేదు. దీంతో నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెర్కూర్‌కు చెందిన బాధితుడు గోలి దశరథంరెడ్డి ధర్మగంటను ఆశ్రయించారు.

వెల్దండ: నాగర్‌కర్నూల్ జిల్లా వెల్దండ మండలం చెర్కూర్ గ్రామానికి చెందిన గోలి దశరథంరెడ్డి, ఆయన అక్క విమలమ్మకు గ్రామ శివారులోని సర్వే నంబర్ 533లో 2.18 ఎకరాల చొప్పున వారసత్వంగా భూమి సంక్రమించింది. దశరథంరెడ్డి తన వాటాగా వచ్చిన భూమిని తన భార్య సుమిత్రమ్మకు దానపూర్వకంగా పట్టాచేశారు. దీనిపై వారికి పాస్‌పుస్తకం కూడా వచ్చింది. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకొని సాగుచేసుకొంటున్నారు. భూరికార్డుల ప్రక్షాళన సందర్భంలో 533 సర్వే నంబర్ పూర్తిగా మాయమైంది. రెవెన్యూ కార్యాలయానికి వెళ్లి విచారించగా.. సుమిత్రమ్మ పేరిట ఉన్న భూమి వేరొకరి పేరిట పట్టా అయినట్టు తెలిసింది. దశరథంరెడ్డి అక్క విమలమ్మ తన వాటా కింద వచ్చిన 2.18 ఎకరాల భూమిలో 1.10 ఎకరాలను గతంలో అమ్మేశారు. కాగా ఆ భూమి విమలమ్మ అమ్మిన వ్యక్తికి పట్టా కాలేదు. దీంతో విమలమ్మ అమ్ముకోగా మిగలాల్సిన 1.08 ఎకరాలకు బదులు మొత్తం 2.18 ఎకరాలు ఆమె పేరిటే ఉన్నది. దీంతో విమలమ్మ తనకు మిగిలిన భూమితోపాటు అంతకుముందు అమ్మిన భూమిని (రికార్డుల్లో తనపేరే ఉండటంతో) కూడా తిరిగి అమ్మేశారు.

ఈ భూమిని కొనుగోలుచేసిన వ్యక్తి పట్టాదారు పాస్‌పుస్తకం కోసం దరఖాస్తుచేయగా.. రెవె న్యూ అధికారులు విమలమ్మ పేరిట ఉన్నభూమిని కాకుండా పక్కన ఉన్న సుమిత్రమ్మ (దశరథంరెడ్డి భార్య) భూమిని పట్టాచేశారు. విష యం తెలుసుకొన్న బాధితుడు దశరథంరెడ్డి అప్పటి వీఆర్వో శరత్‌ను అడుగగా.. పొరపాటు జరిగిందని అంగీకరించారు. తర్వాత కొన్నాళ్లకే శరత్ బదిలీ అయి.. కొత్త వీఆర్వో వచ్చారు. ఆయన దృష్టికి కూడా ఈ వ్యవహారాన్ని తీసుకెళ్తే పెద్దగా పట్టించుకోలేదు. రెవెన్యూ కార్యాలయం చుట్టూ రెండేండ్లుగా చెప్పులరిగేలా తిరుగుతున్నా కనికరించడంలేదు. చివరకు వెల్దండ డిప్యూటీ తాసిల్దార్ దృష్టికి తీసుకెళ్లగా.. వీఆర్వో, రైతులను పిలిపించి భూసమస్యను వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కానీ.. వీఆర్వో.. డీటీ ఆదేశాలను కూడా ఖాతరుచేయలేదు. ఫైలు పక్కన పెట్టేశారు. గట్టిగా అడిగితే గతంలో ఉన్న వీఆర్వో చేసిన తప్పునకు తననెందుకు అడుగుతున్నారని.. ఆయన్నే అడుక్కోవాలంటూ దబాయిస్తున్నారు. తన పొలా న్ని తనకు తెలియకుండా వేరొకరికి అమలుచేసి రెవెన్యూ అధికారులు నానా ఇబ్బందులు పెడుతున్నారని దీంతో ప్రభుత్వం అమలుచేస్తున్న రైతు సంక్షేమ పథకాలు అందక నష్టపోతున్నానని వాపోయారు.


గోలి దశరథంరెడ్డి, బాధిత రైతు చెర్కూర్

పాత వీఆర్వోను అడుగాలంట

నా భూమి నాకు తెలియకుండానే ఇతరులకు పట్టాచేశారు. నా భూమి నాకు చేయమంటే నానా ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఉన్న వీఆర్వోను అడిగితే నన్నెందుకు అడుగుతున్నారు.. అప్పటి వీఆర్వోనే అడుగండి అంటూ తిప్పలుపెడుతున్నరు. ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లితే.. ఆయన కూడా వీఆర్వోకు ఫోన్‌చేశారు. కానీ ఎమ్మెల్యే మాటను కూడా వీఆర్వో ఖాతరుచేయడంలేదు. నాకు న్యాయంచేయాలి.
- గోలి దశరథంరెడ్డి, బాధిత రైతు చెర్కూర్
వెంకట్మ్రణ, వెల్దండ ఉప తాసిల్దార్

వెంటనే పరిష్కరిస్తాం

గోలి సుమిత్రమ్మ భూ సమస్యపై గతంలోనే వీఆర్వో, బాధిత రైతులను పిలిపించి మాట్లాడాం. వెంటనే విచారణ జరిపి సమస్యను పరిష్కరించాలని వీఆర్వోను ఆదేశించాం. న్యాయపరంగా సుమిత్రమ్మ పేరిట ఉండాల్సిన భూమి ఆమెకు చెందేలా కృషిచేస్తాం. ఆర్డీవో లాగిన్‌కు పంపించాం. వెంటనే న్యాయంచేస్తాం.
- వెంకట్మ్రణ, వెల్దండ ఉప తాసిల్దార్

1038
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles