పట్టా కాదంటున్నారు..


Wed,May 22, 2019 02:03 AM

farmer bhulaxmi requests for passbook from 5 years

-ఐదేండ్లుగా అధికారుల చుట్టూ ప్రదక్షిణ
-తిరిగి వేసారి దుబాయ్ పోయిన రైతు
-ఆఫీసులచుట్టూ తిరుగుతున్న బాధితుడి భార్య
-నిజామాబాద్ జిల్లా ఎడపల్లి అధికారుల తీరు

ఎడపల్లి: వారు నిరుపేదలు.. పైసాపైసా కూడబెట్టుకొని కొంత భూమి కొన్నారు. దానికి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నారు. ఆ భూమికి పట్టాచేయమంటే అధికారులు కాదు పొమ్మంటున్నారు. ఐదేండ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగిన నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలకేంద్రానికి చెందిన కుమ్మరి గంగాధర్ నమస్తే తెలంగాణ ధర్మగంటను ఆశ్రయించారు. ఎడపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి గంగాధర్ 2012లో సర్వేనంబర్ 293/2/2 లో మంగళి లక్ష్మి నుంచి 28 గుంటలు, సర్వేనంబర్ 293/2/3లో సవిత నుంచి 8 గుంటలు, సర్వేనంబర్ 293/2/4 దేరడి రాజన్న నుంచి 6 గుంటలు మొత్తం 42 గుంటల భూమిని కొనుగోలుచేశారు. దీనికి రూ.1.89 లక్షలు చెల్లించారు. రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. భూమిని కొనుగోలు చేసినప్పటి నుంచి పట్టాచేయాలని ఐదేండ్లుగా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగి వేసారి చివరకు బతుకుదెరువు కోసం గంగాధర్ దుబాయ్ వెళ్లాడు. అనంతరం ఆయన భార్య భూలక్ష్మి కూడా రెవెన్యూ అధికారుల చుట్టూ తిరిగినా కాదు పొమ్మంటున్నారు. 42 గుంటల భూమిలో ఏడు గుంటలకు పట్టాచేశారని, మరో 35 గుంటల భూమిని పట్టా చేయబోమంటున్నారని భూలక్మి ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


భూలక్ష్మి

ఏండ్ల నుంచి తిరుగుతున్నా ..

నా భర్త 35 గుంటల భూమిని పట్టాచేయాలని ఐదేండ్లుగా అధికారుల చుట్టు తిరిగితిరిగి విసిగి వేసారి పోయాడు. ఎన్నిసార్లు అడిగినా పట్టా చేయడంలేదు. ప్రస్తుతం నా భర్త దుబాయ్‌లో ఉన్నాడు. పలుమార్లు నేను కూడా రెవెన్యూ అధికారుల చుట్టు తిరిగినా పట్టా కాదు అంటున్నారు. భూమికి పట్టాచేసి ఆదుకోవాలి.
- భూలక్ష్మి, (కుమ్మరి గంగాధర్ భార్య,) ఎడపల్లి.

ఈ భూములు లావుణి పట్టా..

ఎడపల్లికి చెందిన కుమ్మరి గంగాధర్ కొన్న భూమిలో 35 గుంటలు లావుణి పట్టా. ఇలాంటి పట్టాలున్న భూములు తిరిగి ఇంకొకరి పేర మార్చడం వీలుకాదు. మండలకేంద్రానికి మూడు కిలోమీటర్లపైన ఉన్న భూములే పట్టాచేస్తారు. ఆ లోపు ఉన్న భూములకు పట్టాలిచ్చే అధికారం మాకు లేదు. అందుకే గంగాధర్‌కు చెందిన 35 గుంటలకు పట్టాలివ్వలేదు.
- అశోక్‌కుమార్, తాసిల్దార్, ఎడపల్లి

772
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles