ఊరచెరువు కబ్జాదారులకు ఊతం


Wed,May 22, 2019 02:23 AM

farmer banda ravindhar reddy meets dharmaganta over passbook

-నీర్మాలలో వీఆర్వో మాయాజాలం
-ఆర్వోఆర్‌లో ఉన్న 6.15 ఎకరాలు మాయం
-ఏడాదిగా తాసిల్ చుట్టూ రైతు ప్రదక్షిణలు
-జనగామ కలెక్టరేట్ వరకు వెళ్లినా దక్కని పరిష్కారం
-చెరువు శిఖం కబ్జాదారులకు దర్జాగా పాస్‌పుస్తకాలు

దేవరుప్పుల: చెరువు శిఖం భూమిని కబ్జాచేసినవారికి పాస్‌పుస్తకాలు ఇప్పించి.. ఆర్వోఆర్‌లో వాటిని సరిచేసేందుకు అసలు పట్టాదారుభూమిని మాయం చేశాడు వీఆర్వో. భూప్రక్షాళనకు ముందువరకు 1బీలో తమ పేర్లు వచ్చినప్పటికీ తర్వాత మాయం కావడంతో ఆందోళన చెందిన బాధితులు ఏడాదిగా తాసిల్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. కలెక్టరేట్ వరకు వెళ్లినా సమస్య పరిష్కారం కాలేదని ధర్మగంటను ఆశ్రయించారు. జనగామ జిల్లా దేవరుప్పుల మండలం నీర్మాల గ్రామంలోని 179 సర్వేనంబర్‌లో 121.27 ఎకరాల భూమి ఉన్నది. 1978లో పట్టాదారు లింగాల పూలంభాయి నుంచి గ్రామానికి చెందిన బండ సంజీవరెడ్డి 6.15 ఎకరాలు కొనుగోలు చేసి, రిజిస్ట్రేషన్ చేయించుకొని పట్టాదారుగా కొనసాగుతున్నారు. 2003లో సంజీవరెడ్డి ఈ భూమిని తన తమ్ముడు రవీందర్‌రెడ్డికి అమ్మగా.. వెంటనే ఆయన తనభార్య బండ విజయ, కూతురు స్రవంతి పేరిట ఆర్వోఆర్ చేయించుకున్నారు. ఇందుకు సంబంధించి పాస్‌పుస్తకాలు, హక్కురికార్డులు అన్నీ అందాయి. పలుమార్లు బ్యాంకు నుంచి లోన్లుకూడా తీసుకున్నారు.

చివరగా 2017 జూన్‌లో మీసేవ నుంచి 1బీ తీసుకోగా వారిపేరిటే రికార్డులు ఉన్నాయి. గతేడాది భూ రికార్డుల ప్రక్షాళన అనంతరం కొత్త పాస్‌పుస్తకాలు మాత్రం రాలేదు. అనుమానం వచ్చిన రవీందర్‌రెడ్డి మీ సేవలో చూడగా వారిభూమి కనిపించలేదు. వీఆర్వోతోపాటు తాసిల్దార్‌ను వాకబుచేయగా ఆన్‌లైన్లో తప్పిదాల వల్ల పాస్‌పుస్తకాలు రాలేదని, త్వరలో సవరించి ఇస్తామని తెలిపారు. నెలలు గడిచినా పనికాలేదు. చివరకు ఇది తమచేతిలో లేదని.. కలెక్టర్ ఆఫీస్ లాగిన్‌లో ఉన్నదంటూ తాసిల్దార్ చేతులు దులుపుకున్నారు. బాధితుడు కలెక్టర్ ఆఫీసుకు వెళ్లినా పట్టించుకున్నవారే లేరని వాపోయారు. 30 ఏండ్ల నుంచి అనుభవిస్తున్న భూమిని ఒక్కసారిగా రికార్డుల్లో నుంచి మాయం చేశారని బాధితుడు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.

అసలేం జరిగింది..?

నీర్మాలలోని 179 సర్వేనంబర్‌లో 121.27 ఎకరాల భూమి ఉన్నట్టు కాస్రా పహాణీలో ఉన్నది. ఈ సర్వేనంబర్ గ్రామంలోని ఊరచెరువుకు ఆనుకొని ఉన్నది. ఆ చెరువును కొందరు వ్యక్తులు ఆక్రమించుకొని ఏండ్ల తరబడి సాగుచేసుకొంటున్నారు. వీరికి రికార్డుల్లో భూమి లేదు. 179 సర్వేనంబర్‌లో 121.27 ఎకరాలను వీఆర్వో చేతివాటం ప్రదర్శించి ఏకంగా 130 ఎకరాలుగా పహాణీలో సవరించాడు. ఆ భూమిని చెరువును ఆక్రమించిన కొందరి పేరిట పట్టాలివ్వడమేకాక పాస్‌పుస్తకాలు కూడా అందజేశారు. కాస్రా పహాణీలో ఉన్న భూమికి అదనంగా ఒక్కగుంట పెరిగినా తాసిల్దార్లు, వీఆర్వోలే బాధ్యులని రెవెన్యూశాఖ గతంలో ఉత్తర్వులు జారీచేసింది. దీంతో 179 సర్వేనంబర్‌లోని భూమిని 121.27 ఎకరాలకు పహాణీలో సవరించాల్సిన పరిస్థితిలో వీఆర్వో తన మాయాజాలాన్ని ప్రదర్శించాడు.

తనకు అనుకూలమైన వారిపేర్లను రికార్డుల్లో ఉంచి, అసలు పట్టాదారులను తొలిగించారు. ఇదేక్రమంలో బండ విజయ, బండ స్రవంతికి ఉన్న భూమి రికార్డుల్లో మాయం కాగా, చెరువు శిఖం ఆక్రమించుకున్న వారిపేరిట పట్టాలు వచ్చాయి. శిఖం భూమి కబ్జాదారులకు రాష్ట్ర ప్రభుత్వం అం దించిన రైతుబంధు పెట్టుబడి సాయం దర్జాగా అందింది. నీర్మాల ఊరచెరువు ఎఫ్‌టీఎల్‌ను సర్వేచేయించి హద్దులు పేర్కొంటే చెరువును ఆక్రమించుకున్నవారితోపాటు వీఆర్వో నిర్వాకం బయటపడుతుందని గ్రామస్థులు అంటున్నారు.


బండ రవీందర్‌రెడ్డి, రైతు

రికార్డుల్లో ఎక్కడా కనిపించడంలేదు

179/ఏ/3 సర్వేనంబర్‌లోని 6.15 ఎకరాల్లో నాభార్య విజయ పేర 2.15 ఎకరాలు, కూతురు స్రవంతి పేర మరో 4 ఎకరాలు 15 ఏండ్ల క్రితం పట్టాలు చేయించాం. 2017 జూన్ వరకు రికార్డుల్లో ఉన్న భూమి ఆ తర్వాత ఒక్కసారిగా మాయమైంది. ఆనాటి నుంచి నేను వీఆర్వో సోమయ్య చుట్టూ తిరుగుతూనే ఉన్నాను. మరోవైపు తాసిల్దార్‌ను కూడా అడగుతూనే ఉన్నాను. నాలుగు ఎకరాల భూమి నా బిడ్డకు ఇవ్వగా, అది మాయం కావడంతో కూతురు అత్తగారు వాళ్లు నేను అమ్మేసినట్టు అనుమానిస్తున్నారు. వారికి సమాధానం చెప్పడం కష్టమవుతున్నది. దేవరుప్పుల తాసిల్దార్ ఈ విషయం తన పరిధిలో లేదని, కలెక్టర్ లాగిన్‌లో ఉన్నదని అనడంతో కలెక్టర్ ఆఫీసు చుట్టూ తిరుగుతానే ఉన్నాను. అయినా పని కాకపోగా, మా భూమిని వేరే వారి పేర రాసి పట్టాలు ఇచ్చినట్టు తెలుస్తున్నది.
- బండ రవీందర్‌రెడ్డి, రైతు, నీర్మాల, దేవరుప్పుల మండలం

వారం రోజుల్లో సవరిస్తాం

179 సర్వే నంబర్‌లో 121.27 ఎకరాల భూమి ఉండాల్సి ఉండగా, 130 ఎకరాలు ఉన్నట్టు పహాణీలో చూపుతున్నది. బై నంబర్ల మూలంగా కొంత గందరగోళం జరిగింది. కాస్రా పహాణీలో సరిచూసి వారం రోజుల్లో సవరిస్తాం. 2017కు ముందు ఖాతాలు వెతికిచూసి బండ విజయ, స్రవంతి పేర భూమిని తిరిగి ఎక్కిస్తాం.
- సోమయ్య, వీఆర్వో, నీర్మాల, దేవరుప్పుల మండలం

1041
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles