భూమి అన్నది.. పరిహారం తమ్ముడికి


Tue,August 13, 2019 02:31 AM

farmer anthi reddy meets dharmaganta over revenue officers negligence

-సమాచారం ఇవ్వకుండానే చెక్కు జారీచేసిన అధికారులు
-మొరపెట్టుకొన్నా పట్టించుకోని రెవెన్యూ సిబ్బంది
-ధర్మగంటను ఆశ్రయించిన సిద్దిపేట జిల్లా బాధితుడు అంతిరెడ్డి

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: అతనికి ఉన్నదే 39 గుంటల భూమి. ఆ భూమి కూడా ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల పథకానికి ఇవ్వాల్సి వచ్చింది. భూమి పోయినా ప్రభుత్వం పరిహారం ఇస్తుందని అనుకొన్నారు. కానీ రెవెన్యూ అధికారుల నిర్వాకంతో బాధితుడికి పరిహారం అందకుండాపోయింది. భూమి ఒకరి పేరిట ఉంటే.. పరిహారం మరొకరికి మంజూరుచేశారు. ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా లెక్కచేయడం లేదని ఆవేదన వ్యక్తంచేస్తూ సిద్దిపేట జిల్లా ములుగు మండలం తంకి బొల్లారం గ్రామానికి చెందిన బాధితుడు మ్యగన్నగారి అంతిరెడ్డి ధర్మగంట ను ఆశ్రయించారు. నా పేరు మ్యగన్నగారి అంతిరెడ్డి. నాకు సిద్దిపేట జిల్లా ములుగు మండలం తుంకిబొల్లారంలోని సర్వే నంబర్ 339/అ2లో వారసత్వంగా వచ్చిన 39 గుంటల భూమి ఉన్నది. 339 సర్వే నంబర్‌లో మా తండ్రి పేరిట 1.38 ఎకరాలు ఉండేది. దానిని నేను, మా తమ్ముడు సమానంగా పంచుకొన్నాం.

దానికి సంబంధించి పాత పాస్‌పుస్తకాలు ఉండటంతోపా టు కొత్తవి కూడా మంజూరయ్యాయి. అయితే మా తండ్రి నుంచి మాకు సంక్రమించిన ఈ భూమి పేదల కోసం ప్రభుత్వం నిర్మిస్తున్న డబుల్ బెడ్‌రూం ఇండ్ల కోసం రెవెన్యూ అధికారులు సేకరించారు. భూమిని తీసుకొన్నా పరిహారం వస్తుందిలే అనుకొన్నాం. కానీ అధికారులు నాకు అన్యాయంచేశారు. నాకున్న 39 గుంటల భూమికి వచ్చే పరిహారాన్ని కూడా మా తమ్ముడి పేరిటే మంజూరుచేశారు. ఈ విషయంలో నాకు అన్యాయం జరిగిందని ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా అధికారులు లెక్కచేయడం లేదు. నేను అందుబాటులో లేనందునే తమ్ముడి పేరిట మంజూరుచేశామని దాటవేస్తున్నారు. స్థానికంగా గ్రామం లో లేనంత మాత్రాన నాకు రావాల్సిన పరిహారాన్ని మా తమ్ముడికి మంజూరుచేయడం దారుణం. కేవలం రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం వల్లే నాకు అన్యాయం జరిగింది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు విచారణచేసి నాకొచ్చే పరిహారం ఇప్పించాలి. లేకపోతే నా భూమినైనా తిరిగివ్వాలి.

ఎంజాయ్‌మెంట్ సర్వే ఎలాచేశారో తెలియదు

సదరు భూమికి సంబంధించి రెండేండ్ల క్రితమే పరిహారం మంజూరైంది. అప్పుడు తాసిల్దార్‌గా నేనులేను. ఆ సమయంలో ఎంజాయ్‌మెంట్ సర్వేచేసి అంతిరెడ్డి తమ్ముడికి పరిహారం మంజూరుచేశారు. ఏవిధంగా సర్వేచేసి పరిహారం చెల్లించారో, అప్పు డేం జరిగిందో నాకు తెలియదు. దీని గురించి ఆర్డీవోకు కూడా ఫిర్యాదు చేసుకోవచ్చు.
- విజయ్‌కుమార్, ములుగు తాసిల్దార్

అప్పుడు వీఆర్వోగా నేనే ఉన్నా

ఎంజాయ్‌మెంట్ సర్వేచేసాకే అంతిరెడ్డి తమ్ముడి పేరిట పరిహారం మంజూరుచేశాం. సర్వేచేసినప్పుడు అంతిరెడ్డి రాలేదు. అప్పుడు నేనే వీఆర్వోగా ఉన్నాను. మేం సర్వేచేసి రిపోర్టు ఆర్డీవోకు పంపించాం. ఆ రిపోర్టు ఆధారంగా పరిహారం మంజూరైంది. అంతిరెడ్డికి డబ్బులిచ్చేందుకు ఆయన తమ్ముడు సిద్ధంగా ఉన్నారు.
- జయప్రకాశ్, వీఆర్వో

332
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles