అడ్డగోలుగా భూమి తొలగింపు


Tue,June 18, 2019 03:18 AM

farmer adhonda venkat reddy requests for passbook

-ఒకరికి చెందిన భూమి మరో వ్యక్తి పేరిట పట్టా
-ఫిర్యాదు చేసినా పట్టించుకోని వికారాబాద్ రెవెన్యూ సిబ్బంది
-కంప్యూటర్లు పనిచేయడం లేదని కుంటిసాకులు చెప్తున్నారు: బాధితుడు
-సిస్టం పనిచేయడంలేదని కుంటిసాకులు చెప్తున్నారని బాధితుడి ఆవేదన

మన పేరిట ఉన్న రికార్డులు ఎలా మారుతాయిలే అని భరోసాతో ఉంటే.. ఉన్నది కాస్తా ఊడ్చుకుపోవడం ఖాయమన్నది నిజం చేసి చూపిస్తున్నారు రెవెన్యూ సిబ్బంది. మన భూమే అయినా.. మన పేరిట పాస్‌బుక్కులు ఉన్నా.. అప్పుడప్పుడు క్రాస్ చెక్ చేసుకొంటేగానీ విషయాలు బయట పడేట్లుగా లేవు. ఇలాంటి పరిస్థితే వికారాబాద్ జిల్లాలోని రైతు వెంకట్ రెడ్డికి ఎదురైంది. తనకు తెలియకుండానే తన భూమిని మరోవ్యక్తి పేరిట ఇచ్చిన పట్టాను రద్దుచేయాలంటూ ఎన్నో రోజులుగా తాసిల్దార్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్న వెంకట్‌రెడ్డి.. చివరకు తనకు న్యాయంచేయాలంటూ ధర్మగంటను ఆశ్రయించాడు.

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: వికారాబాద్ జిల్లా వికారాబాద్ మండల పరిధిలోని పీలారం గ్రామంలో సర్వే నంబర్ 9/ఈలో 7.27 ఎకరాల భూమి ఆదొండ రాంరెడ్డి, వారి బంధువు ఆదొండ రాంచంద్రారెడ్డి పేరిట జాయింట్ పట్టాగా నమోదై ఉన్నది. ఈ భూమి వారసత్వంగా వారికి సంక్రమించింది. 1964 నుంచి 2000 సంవత్సరం వరకు వారి పేరిటే ఆ భూమి రికార్డుల్లో ఉన్నది. రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి మరణాంతరం 2001లో రాంరెడ్డి మనుమడైన వెంకట్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి సోదరుడైన నారాయణరెడ్డి ఆ భూమిని పంచుకొన్నారు. వెంకట్‌రెడ్డికి 4.27 ఎకరాలు, నారాయణరెడ్డికి మూడెకరాల భూమి వచ్చింది. ఇద్దరి అంగీకారం మేరకు పంచుకొన్నట్టుగానే 2001లో రెవెన్యూ అధికారులు వారి పేరిట పట్టాదారు పాస్‌పుస్తకాలు కూడా మంజూరుచేసి, రికార్డులోకి ఎక్కించారు.

అయితే వెంకట్‌రెడ్డి పేరిట ఉన్న 4.27 ఎకరాల నుంచి 38 గుంటల భూమిని ఆన్‌లైన్ నుంచి చెప్పాపెట్టకుండా అధికారులు తొలగించారు. ఆ భూమిని 2019 ఏప్రిల్ 25వ తేదీన అధికారులు ఆదొండ సులోచన పేరిట నమోదుచేశారు. ఈవిధంగా అక్రమంగా పట్టా ఎందుకు మార్చారని అధికారులను బాధితుడు ప్రశ్నిస్తే.. మీ తాత రాంరెడ్డి 1982లోనే సులోచనకు విక్రయించారని, ఆ డాక్యుమెంట్ ఆధారంగా వారి పేరిట పట్టా మార్చినట్టు సమాధానమిచ్చారని వెంకటరెడ్డి వాపోతున్నారు. ఎన్నిసార్లు ఫిర్యాదుచేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోవడంలేదని, కంప్యూటర్లు పనిచేయడంలేదంటూ కుంటిసాకులు చెప్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.


ఆదొండ వెంకట్‌రెడ్డి, బాధితుడు

రెండుసార్లు రైతుబంధు వచ్చినా..

రెవెన్యూ అధికారులు నా భూమిని అక్రమంగా మార్చడమే కాకుండా.. మా తాత భూమి అమ్మాడని తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. 1982లో 9/ఈ సర్వే నంబర్‌లోని 4.27 ఎకరాల భూమి మా తాత రాంరెడ్డి, రాంచంద్రారెడ్డి పేరిట జాయింట్ పట్టాగా నమోదై ఉన్నది. రాంరెడ్డి ఒక్కడే ఆ భూమి అమ్మితే ఎలా చెల్లుతుంది? తాత చనిపోయినప్పటి నుంచి మేమే కాస్తులో ఉన్నాం. ఈ భూమిపై రెండుసార్లు రైతుబంధు సాయం కూడా అందుకొన్నాను. అలాంటిది రెవెన్యూ అధికారులే అక్రమంగా నా భూమిని వేరే వ్యక్తి పేరును పట్టాలోకి ఎక్కించారు.
- ఆదొండ వెంకట్‌రెడ్డి, బాధితుడు

అధికారుల తప్పిదంతోనే..

వెంకట్‌రెడ్డి పేరిట 2001లో పట్టాపుస్తకం మంజూరు చేసేటప్పుడు ఎవరూ అభ్యంతరం చెప్పకపోవడంతో ఆయన పేరిట పాస్‌బుక్ మంజూరుచేశాం. పాస్‌బుక్ మంజూరయ్యాక 38 గుంటల భూమిని 1982లో రాంరెడ్డి తమ కు అమ్మారంటూ వారి బంధువు సులోచన డాక్యుమెంట్ చూపించారు. అప్పుడు విచారించి పట్టాలో పేరు మార్చారు. రాంరెడ్డి మరణాంతరం 2001లో వెంకట్‌రెడ్డికి పట్టా మార్చేటప్పుడు రెవెన్యూ అధికారులు పరిశీలించి పట్టాలో పేరు మార్చిఉంటే ఈ సమస్య తలెత్తేది కాదు. ఇది ముమ్మాటికీ అధికారుల తప్పిదం వల్లే జరిగింది. అప్పటి అధికారులు చేసిన తప్పిదాన్ని సరిచేసేందుకే సర్వేచేసి పట్టాలో పేరు మార్చాం.
- చిన్న అప్పలనాయుడు, తాసిల్దార్, వికారాబాద్

979
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles