ప్రాణం తీసిన కుటుంబకలహాలు

Sun,October 13, 2019 02:17 AM

-విషగుళికలు కలిపిన శీతలపానీయాన్ని తనయులకు తాగించిన తండ్రి
-చిన్నకొడుకు మృతి, పెద్దకొడుకు పరిస్థితి విషమం
-మద్యంమత్తులో అదే పానీయం తాగిన సురేశ్
-రాజబొల్లారం తండాలో విషాదం

మేడ్చల్ రూరల్: కుటుంబకలహాలు, మద్యంమత్తు ఆ ఇంట విషాదాన్ని నింపాయి. భార్యాభర్తల మధ్య గొడవలు చిన్నారుల ప్రాణాల మీదకు తెచ్చింది. మేడ్చల్ జిల్లా రాజబొల్లారంలో శుక్రవారం రాత్రి ఓ వ్యక్తి తాగిన మైకంలో భార్యతో గొడవపడి శీతలపానీయంలో విషగుళికలు కలిపి కొడుకులకు తాగించి.. ఆపై తాను తాగాడు. ఈ ఘటనలో చిన్నకొడుకు మృతిచెందగా.. మరో కొడుకు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. నగరంలోని రోడామిస్త్రినగర్‌కు చెందిన సురేశ్‌కు మేడ్చల్ మండలం రాజబొల్లారం తండాకు చెందిన మంజులతో తొమ్మిదేండ్ల క్రితం వివాహం కాగా, వీరికి ప్రణీత్(5), ప్రదీప్(7) ఇద్దరు సంతానం. కొన్నిరోజులు సాఫీగా సాగిన వీరి కాపురంలో కలహాలు మొదలయ్యాయి.

మద్యానికి బానిసై సురేశ్ భార్య మంజులతో తరచూ గొడవపడుతూ శారీరకంగా, మానసికంగా వేధించడంతో ఆమె మూడేండ్ల క్రితం పిల్లలతోపాటు రాజబొల్లారంలోని పుట్టింటికి వెళ్లింది. ఏడాది తర్వాత సురేశ్ భార్య వద్దకు వెళ్లి గొడవలు లేకుండా కలిసుందామని నమ్మబలికాడు. అత్త లక్ష్మి తన కూతురును అల్లుడితో పంపకుండా ఇక్కడే ఉండి పనిచేసుకోవాలని చెప్పడంతో సురేశ్ అత్తగారింట్లో ఉంటూ రాజబొల్లారం పంచాయతీలోని ఓ కంపెనీలో పనిచేస్తుండగా.. మంజుల మరో కంపెనీలో పనికి కుదిరింది. ఈ క్రమంలో సురేశ్ ఆరునెలల క్రితం అదేతండాలో అత్తగారింటి నుంచి అద్దె ఇంటికి మకాం మార్చాడు. అయితే, సురేశ్ తాగొచ్చినప్పుడల్లా భార్యను అనుమానిస్తూ గొడవపడుతుండేవాడు. శుక్రవారం రాత్రి కూడా తాగొచ్చి భార్యతో గొడవకు దిగడంతో మంజుల పిల్లలను అక్కడే వదిలేసి, తల్లి వద్దకు వెళ్లింది.

తాగిన మైకంలో ఉన్న సురేశ్ చిన్నారులకు విషగుళికలు కలిపిన శీతలపానీయం తాగించి.. తాను కూడా అదే పానీయాన్ని తాగాడు. ఆ తర్వాత పిల్లల్ని తీసుకెళ్లి మంజుల దగ్గర వదిలిపెట్టి వెళ్లిపోయాడు. పిల్లల దగ్గర గుళికలు వాసన రావడంతో అనుమానం వచ్చిన మంజుల స్థానికులతో కలిసి ఘనపూర్ మెడిసిటీ దవాఖానకు తరలించింది. అప్పటికే చిన్నకొడుకు ప్రణీత్ మృతిచెందగా.. మరో కొడుకు ప్రదీప్‌ను వైద్యుల సూచన మేరకు నిలోఫర్‌కు, సురేశ్‌ను గాంధీ దవాఖానకు తరలించగా చికిత్స పొందుతున్నారు. సురేశ్ ఆరోగ్యంగా నిలకడగానే ఉండగా.. ప్రదీప్ చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు. భార్య మంజుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు.

1690
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles