జిల్లెలగూడలో పేలుడు కలకలం

Sat,November 9, 2019 01:48 AM

-ఓ మహిళకు త్రీవగాయాలు.. ఉస్మానియాకు తరలింపు
-బాంబు కాదు.. రసాయన పదార్థమని తేల్చిన పోలీసులు

బడంగ్‌పేట, నమస్తే తెలంగాణ/సుల్తాన్‌బజార్: హైదరాబాద్ శివారు బాలాపూర్ మండలం జిల్లెలగూడ విజయనగర్ కాలనీలో పేలుడు కలకలం రేపింది. పేలుడు దాటికి ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. శుక్రవారం ఉదయం 8:15 గంటల ప్రాంతంలో మంగి, విజయ, నిర్మల అనే ముగ్గురు మహిళలు కలిసి చెత్త కాగితాలు ఏరుకుంటున్నారు. నిర్మలకు చెత్తలో ఓ ప్లాస్టిక్ డబ్బా దొరికింది. అందులో ఏముందో చూద్దామని గట్టిగా నేలకేసి కొట్టడంతో పెద్ద శబ్దంతో పేలింది. దీంతో డబ్బా ముక్కలు గుచ్చుకోండంతో నిర్మల తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి బాధితురాలిని ఉస్మానియ దవాఖానకు తరలించారు. రోజూ మాదిరిగానే చెత్త కాగితాలు ఏరుకుంటుండగా ప్రమాదం జరిగినట్టు నిర్మల మేనమామ ఘాసీరాం చెప్పారు.
box
ఈ పేలుడులో బాధితురాలి కుడి చేతి వేళ్లు నుజ్జునుజ్జయ్యాయి. నల్లగొండ జిల్లా దేవరకొండ మండలం గేలిగుట్టతండాకు చెందిన నిర్మల (25), భర్త నిరియా ఇద్దరు పిల్లలతో కలిసి సైదాబాద్ సింగరేణికాలనీలో ఉంటున్నారు. ఘటనా స్థలాన్ని రాచకొండ అడిషనల్ సీపీ సుధీర్‌బాబు, ఎల్బీనగర్ డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్, ఏసీపీ, సీఐలు పరిశీలించారు. బాంబ్ స్కాడ్, క్లూస్ టీంలతో తనిఖీలు చేయించారు. బాంబు పేలుడు కాదని ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. పేలుడుకు రసాయన పదార్థం కారణమని చెప్తున్నారు. ఆ రసాయన పదార్థాన్ని ఇక్కడ ఎందుకు పడేశారన్న కోణంలో దర్యప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. డబ్బాలో ఉన్న రసాయనం పేరు, నమూనాలను సేకరించి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపిస్తున్నామన్నారు.

1128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles