లాభాదాయక పదవుల నుంచి కార్పొరేషన్లకు మినహాయింపు

Thu,December 5, 2019 01:22 AM

-గవర్నర్ సంతకంతో ఆర్డినెన్స్ జారీ
-చైర్మన్ల నియామకానికి మార్గం సుగమం

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: ఇటీవలి రాష్ట్ర క్యాబినెట్ నిర్ణయం మేరకు కార్పొరేషన్లను లాభాదాయక పదవుల నుంచి మినహాయిస్తూ బుధవారం ఆర్డినెన్స్ జారీ అయింది. ఇందుకు సంబంధించి తెలంగాణ రాష్ట్ర వేతనాలు, పెన్షన్ చెల్లింపుల అనర్హతను తొలిగిస్తూ ఆర్డినెన్స్ ఫైల్‌పై గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ సంతకంచేశారు. ఈ ఆర్డినెన్స్‌తో ముఖ్యమైన కార్పొరేషన్లకు ఎంపీ, ఎమ్మెల్యేలను నియమించడానికి ఆస్కారం ఏర్పడింది. ఇప్పటివరకు ప్రజాప్రతినిధులను వాటికి చైర్మన్లుగా నియమించడానికి ఇబ్బందులు ఉండేవి. ఆర్డినెన్స్‌తో ఈ ప్రతిబంధకాలన్నీ తొలిగిపోయాయి. తాజా ఆర్డినెన్స్‌తో రాష్ట్రంలో కార్పొరేషన్ పదవుల భర్తీ ప్రక్రియ ప్రారంభమయ్యే అవకాశం ఉన్నది. ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డికి రైతు సమన్వయ సమితి అధ్యక్ష పదవిని ఇవ్వనున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ఇప్పటికే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇతర కార్పొరేషన్లకు పాలకవర్గాలను ప్రకటించే అవకాశం ఉన్నది.

మినహాయింపు ఇచ్చిన సంస్థలు ఇవే
రాష్ట్ర ప్రభుత్వం 27 సంస్థలకు లాభదాయక సంస్థల నుంచి మినహాయింపు ఇచ్చింది. ఇందులో హెచ్‌ఎండీఏ, ఆర్టీసీ రిజినల్ బోర్డులకు అదనంగా చైర్మన్లు, డైరెక్టర్లను నియమించుకునే అవకాశం కలిగిస్తూ బుధవారం ఆర్డినెన్స్ జారీచేసింది. మినహాయింపు ఇచ్చిన సంస్థలు.. 1) అత్యంత వెనుకబడిన తరగతుల అభివృద్ధి సంస్థ (ఎంబీసీ కార్పొరేషన్), 2) రైతు సమన్వయ సమితి, 3) మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, 4) భవన నిర్మాణ కార్మికులు, ఇతర సంక్షేమ బోర్డు, 5) రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్, 6) కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు కార్పొరేషన్, 7) యాదగిరిగుట్ట టెంపుల్ ఏరియా డెవలప్‌మెంట్ అథారిటీ, 8) వేములవాడ టీఏడీఏ, 9) కులీకుతుబ్‌షా పట్టణాభివృద్ధి సంస్థ, 10) పట్టణాభివృద్ధి సంస్థలు, 11) క్రీడల సంస్థ, 12) గొర్రెలు, మేకల సహకార సొసైటీ, 13) హైదరాబాద్ నగర గ్రంథాలయ సంస్థ, 14) తెలుగు అకాడమి, 15) హాకా, 16) అధికార భాష కమిషన్, 17) తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్‌స్టిట్యూట్స్ సొసైటీ, 18) హజ్ కమిటీ, 19) సాంఘిక సంక్షేమబోర్డు, 20) ఫుడ్ కమిషన్, 21) సెట్విన్, 22) తెలంగాణ సాహిత్య అకాడమి, 23) జెన్‌కో, 24) ట్రాన్స్‌కో, 25) యోగాధ్యయన పరిషత్, 26) హెచ్‌ఎండీఏ చైర్మన్, వైస్ చైర్మన్, సభ్యులు, డైరెక్టర్లు, 27) టీఎస్ ఆర్టీసీ రీజినల్ బోర్డు చైర్మన్, డైరెక్టర్స్.

119
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles