నిస్వార్థ సేవకు సిద్ధంగా ఉండాలి

Thu,December 5, 2019 02:42 AM

-స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు విస్తృతం కావాలి
-సామాజిక సేవ, జాతి నిర్మాణంలో కీలకం
-గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్
-ప్రత్యేక భవనాల కోసం కృషి: మాజీ ఎంపీ కవిత

హైదరాబాద్, నమస్తేతెలంగాణ: సామాజిక సేవ, జాతి నిర్మాణంలో భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ పాత్ర కీలకమని, వీరి సేవలు సేవలు విస్తృతం కావాలని రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ ఆకాంక్షించారు. వీరు ఎల్లప్పుడూ దేశానికి నిస్వార్థమైన సేవలు అందిండానికి సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. బుధవారం భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాజ్‌భవన్ దర్బార్ హాల్‌లో జరిగిన సమావేశంలో గవర్నర్ ప్రసంగించారు. ఇటీవల తాను రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌ను కలిసినప్పుడు తెలంగాణలో అద్భుతంగా జరుగుతున్న స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యక్రమాలను వివరించానని తెలిపారు. యువ స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతి సమగ్రతను కాపాడటంలో ముందుండాలన్నారు. మానవత్వం, ప్రేమ భావాలను కలిగి మహిళల పట్ల గౌరవంగా వ్యవహరించాలని సూచించారు. స్కౌట్స్ అండ్ గైడ్స్‌లో యువత పెద్ద సంఖ్యలో చేరేలా ప్రోత్సహించాల్సిన అవసరమున్నదని చెప్పారు.

స్కౌట్స్ అండ్ గైడ్స్ స్టేట్ చీఫ్ కమిషనర్, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రత్యేకంగా చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఖమ్మం, నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ అత్యంత ప్రతిభ కనబరుస్తున్నారని విశ్లేషించారు. ప్రతి జిల్లాకు పక్కా భవనాన్ని నిర్మించి స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు ఆదాయవనరులు వచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇందుకోసం కొందరు ప్రజాప్రతినిధులు ఉదారంగా సాయంచేస్తున్నారని వివరించారు. అనంతరం ఉత్తమ సేవలందించిన స్కౌట్స్ అండ్ గైడ్స్‌కు గవర్నర్ ప్రశంసాపత్రాలను అందజేశారు. కార్యక్రమంలో భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ తెలంగాణ స్టేట్ అసోసియేషన్ సీనియర్ అధికారులు విజయ్‌కుమార్, విజయేంద్ర బోయి తదితరులు పాల్గొన్నారు.
KAVITHA1

114
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles