మాజీ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి కన్నుమూత

Thu,November 14, 2019 04:14 AM

-జోగిని వ్యవస్థ నిర్మూలనకు కృషిచేసిన అధికారి
-సంతాపం తెలిపిన గవర్నర్‌, సీఎం
-రేపు హైదరాబాద్‌లో అంత్యక్రియలు!

హైదరాబాద్‌,నమస్తే తెలంగాణ: ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో జోగిని వ్యవస్థ నిర్మూలనకు విశేషంగా కృషిచేసిన ఐఏఎస్‌ అధికారి డాక్టర్‌ వీ చంద్రమౌళి (82) బుధవారం కన్నుమూశారు. ఆయన కొంతకాలంగా అనారోగ్యంతో ఓ ప్రైవేటు దవాఖానలో చికిత్స పొందుతున్నారు. చంద్రమౌళికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. అమెరికాలో నివసిస్తున్న కుమారుడు వచ్చిన తర్వాత శుక్రవారం అంత్యక్రియలు జరిగే అవకాశం ఉన్నదని ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. చంద్రమౌళి మృతి వార్త తెలిసిన వెంటనే రాష్ట్ర ఐఏఎస్‌ అధికారుల సంఘం అధ్యక్షుడు, ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య.. ఆయన నివాసానికి వెళ్లి నివాళులు అర్పించారు.

సంతాపం తెలిపిన గవర్నర్‌, సీఎం

రిటైర్ట్‌ ఐఏఎస్‌ అధికారి చంద్రమౌళి మృతికి గవర్నర్‌ తమిళిసై సౌందర్‌రాజన్‌, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు తీవ్ర సంతాపం తెలియజేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఐఏఎస్‌ అధికారిగా విధులు నిర్వర్తించిన ఆయన సమర్థ అధికారిగా ప్రజలకు చేసిన సేవలను వారు గుర్తుచేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు.

వివిధ హోదాల్లో..

1962 బ్యాచ్‌ ఐఏఎస్‌ అధికారి అయిన చంద్రమౌళి 1937లో తమిళనాడులో జన్మించారు. ఉమ్మడి ఏపీకి సివిల్‌ సర్వీసెస్‌ అధికారిగా వచ్చిన ఆయన వివిధ హోదాల్లో పనిచేశారు. కొంతకాలం కేంద్ర సర్వీసులలో కూడా పనిచేశారు. వివిధ సంక్షేమశాఖలకు కార్యదర్శిగా పనిచేసిన సమయంలో జోగిని వ్యవస్థ నిర్మూలనకు ప్రత్యేకంగా కృషిచేశారు. ఈ క్రమంలోనే నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సోషల్‌ యాక్షన్‌ (ఎన్‌ఐఎస్‌ఏ)ను ప్రారంభించారు. చేతన రూరల్‌ డెవలప్‌మెంట్‌ అనే సంస్థను ఏర్పాటుచేసి జోగిని వ్యవస్థను కూకటివేళ్లతో పెకిలించడానికి ప్రయత్నించారు. జోగిని వ్యవస్థపై పుస్తకం రాసిన చంద్రమౌళి ఢిల్లీలో జాతీయస్థాయి సదస్సును నిర్వహించారు. పరిశ్రమలశాఖకు కార్యదర్శిగా ఉన్న సమయంలో ఆర్టీసీ క్రాస్‌రోడ్‌లో హ్యాండీక్రాప్ట్‌ సంస్థకు స్థలమిచ్చి, అక్కడ భవన నిర్మాణంచేయించి చేనేతకు చేయూతనిచ్చారు. గవర్నర్లు శంకర్‌దయాళ్‌ శర్మ, కుముద్‌బెన్‌ జోషి వద్ద రాజ్‌భవన్‌ కార్యదర్శిగా పనిచేశారు.

ఎంసీహెచ్చార్డీలో సంతాపసభ

చంద్రమౌళి మృతికి ఎంసీహెచ్చార్డీలో నిర్వహించిన సంతాపసభలో పలువురు వేసినివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంసీహెచ్చార్డీ డైరెక్టర్‌ జనరల్‌ బీపీ ఆచార్య, అడిషనల్‌ డీజీలు హరిప్రీత్‌ సింగ్‌, భూసాని వెంకటేశ్వర్లు, పీకే శర్మ, సీఎం సీపీఆర్వో వనం జ్వాలానర్సింహారావు తదితరులు పాల్గొన్నారు.

656
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles