బీసీల కోటా తగ్గదు


Thu,July 12, 2018 02:56 AM

Etela Speaks About BC's Reservations In Panchayat Elections

-34 శాతం ఇవ్వాల్సిందే
-హైకోర్టు తీర్పుపై సుప్రీంకు పోదాం
-పంచాయతీ రిజర్వేషన్లపై మంత్రివర్గ ఉపసంఘం నిర్ణయం
-సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి గెలిచి తీరుతాం
-ఎన్నికలకు సిద్ధంగా ఉన్నాం.. అన్ని ఏర్పాట్లు చేశాం
-గెలువలేమనుకున్నోళ్లే కోర్టుకు వెళ్ళి అడ్డుకుంటున్నారు
-విపక్షాల తీరుపై ఉపసంఘం సభ్యుల మండిపాటు

హైదరాబాద్, నమస్తే తెలంగాణ: బీసీ రిజర్వేషన్లు ఎట్టి పరిస్థితుల్లోనూ 34 శాతం కన్నా తగ్గకుండా చూడాలని మంత్రివర్గ ఉపసంఘం తీర్మానించింది. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లను కల్పించేందుకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించిందని, ఇప్పుడు కూడా ఆ విధంగా అమలుచేయడం కోసం సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయించింది. స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ 50 శాతం కన్నా రిజర్వేషన్లు మించరాదని ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుపై చర్చించేందుకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధ్యక్షతన మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో భేటీ అయింది. ఈ సమావేశంలో రిజర్వేషన్ల అంశంపై కూలంకషంగా చర్చించారు. సమావేశానికి సబ్ కమిటీ సభ్యులైన మంత్రి కేటీఆర్, ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, హరీశ్‌రావు, ఇంద్రకరణ్‌రెడ్డితోపాటు బీసీ సంక్షేమశాఖ మంత్రి జోగు రామన్న ప్రత్యేకంగా హాజరయ్యారు.

సుదీర్ఘంగా చర్చ

రిజర్వేషన్లపై ఇటీవల హైకోర్టు ఇచ్చిన తీర్పుతోపాటు బీసీ గణన, పంచాయతీల పాలకవర్గాల పదవీకాలం ముగిసిన తర్వాత తీసుకోవాల్సిన చర్యలపై సీఎస్ ఎస్కే జోషి, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్‌రాజ్, కమిషనర్ నీతూప్రసాద్, అదనపు అడ్వకేట్ జనరల్ రాంచందర్‌రావు, న్యాయశాఖ కార్యదర్శి నిరంజన్‌రావులతో మంత్రివర్గ ఉపసంఘం సుదీర్ఘంగా చర్చించింది. ఈ సందర్భంగా కమిటీ చైర్మన్ జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ సకాలంలో ఎన్నికలు నిర్వహించేందుకు తాము శాఖాపరంగా అన్ని చర్యలు తీసుకున్నామని, అయితే రిజర్వేషన్లు, బీసీ గణన అంశాలపై కొందరు కోర్టును ఆశ్రయించడం, దీనిపై హైకోర్టు ఇచ్చిన ఆదేశాల నేపథ్యంలో కొంత సందిగ్ధ పరిస్థితి ఏర్పడిందని మంత్రివర్గ ఉపసంఘానికి వివరించారు. ఈ నెలాఖరుతో పాలకవర్గాల పదవీకాలం ముగియనుండగా, ఈలోపు ఎన్నికలు నిర్వహించలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై కూడా మంత్రివర్గ ఉపసంఘం చర్చించింది. అనంతరం క్యాబినెట్ సబ్ కమిటీ చైర్మన్ జూపల్లి, మంత్రులు ఈటల రాజేందర్, తుమ్మల నాగేశ్వర్‌రావు, జోగు రామన్న మీడియాతో మాట్లాడారు. గత పంచాయతీ ఎన్నికల సందర్భంగా 61 శాతం రిజర్వేషన్లను కల్పించుకునేందుకు సుప్రీంకోర్టు వెసులుబాటు కల్పించిందని, ఇప్పుడు రిజర్వేషన్లు 50 శాతం మించకూడదన్న హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టుకు వెళ్లాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

సుప్రీంకోర్టులో వాదనలు వినిపించి గెలిచి తీరుతామన్నారు. ఇప్పటికే పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేశామని, ఎన్నికలు నిర్వహించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. పంచాయతీ ఎన్నికలను సకాలంలో నిర్వహించడం, స్థానిక సంస్థలను బలోపేతం చేయడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. కొంతమంది పంచాయతీ ఎన్నికలపై కేసులు వేయడం కారణంగా చిక్కులు ఎదుర్కోవాల్సి వస్తున్నదని చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రస్తుతం బీసీలకు ఉన్న 34 శాతం రిజర్వేషన్లను రానున్న పంచాయతీ ఎన్నికల్లోనూ తగ్గకుండా చూడాలని సుప్రీంకోర్టును ఆశ్రయించాలని నిర్ణయం తీసుకున్నామన్నారు. 50 శాతం అనేది కేవలం విద్య, ఉద్యోగాల్లో మాత్రమేనని, రాజకీయాలకు సంబంధం లేదని మంత్రులు చెప్పారు.

పదవీకాలం పొడిగింపా.. ప్రత్యేకాధికారులా..

జూలై 31తో సర్పంచ్‌ల పదవీకాలం ముగుస్తుందని, ఆ తర్వాత స్పెషలాఫీసర్లకు బాధ్యతలు అప్పగించాలా లేక పాలకవర్గం పదవీకాలం పొడిగించాలా అనే విషయంపై మంత్రివర్గ సమావేశంలో చర్చించి ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకుంటారని మంత్రులు తెలిపారు. బీసీ గణన విషయంలో హైకోర్టు ఇచ్చిన తీర్పుపై ఎలా ముందుకు వెళ్లాలనేది కూడా క్యాబినెట్‌లో చర్చించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కనీవిని ఎరుగని రీతిలో తండాలను గ్రామపంచాయతీలుగా చేసిందని, పరిపాలనను మరింతగా వికేంద్రీకరించాలనుకున్నదని చెప్పారు. ఎన్నికల్లో గెలువలేమని భయపడినవారు, గెలుపుపై ఆశలు సన్నగిల్లినవారు మాత్రమే కోర్టుకెళ్లారని, ఎన్నికలకు భయపడే ప్రసక్తే లేదని మంత్రులు అన్నారు. దేశంలో ఒక్కో రాష్ట్రంలో ఒక్కో ప్రత్యేకమైన పరిస్థితి ఉంటుందని, రిజర్వేషన్ల విషయంలో కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ర్టాలకు ఒకే రూల్ వర్తించకూడదని చెప్పారు. అణగారిన వర్గాలకు తెలంగాణ రాష్ట్రం నిలయమని, 85 శాతం ప్రజలు ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు చెందినవారని పేర్కొన్నారు.

తమిళనాడు ప్రభుత్వం అణగారిన వర్గాల కోసం విద్యా, ఉద్యోగాల్లో 69 శాతం రిజర్వేషన్ల చేసుకున్నదని, అలాగే తెలంగాణ రాష్ర్టానికి కూడా అనుమతించాలని బాజాప్తా అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపించామన్నారు. ఆచరణలో అమలుకావాలనే తపనతోనే తీర్మానం చేసి పంపించామని, ఈ విషయం ఇంకా పెండింగ్‌లో ఉందని చెప్పారు. బీసీ వర్గాలకు ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నామని, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తప్పకుండా రిజర్వేషన్లు సాధిస్తుందన్నారు. ఇప్పుడు ఏ రిజర్వేషన్లు ఉన్నాయో.. ఆ రిజర్వేషన్ల ప్రకారం పంచాయతీ ఎన్నికలు జరుగుతాయని మంత్రులు స్పష్టం చేశారు. ఏబీసీడీ వర్గీకరణ అనేది కూడా విద్యా, ఉద్యోగాలకు సంబంధించిన అంశమని, రాజకీయాలకు కాదన్నారు. ఏబీసీడీ వర్గీకరణపై తీర్మానం చేసి పంపించామని, చట్ట సవరణ కోసం కేంద్ర పెద్దలను కలుస్తామని చెప్పారు.

2193
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles